ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆటోపై ఇల్లు కట్టేశాడు

ABN, First Publish Date - 2021-03-17T06:43:12+05:30

చక్రాలపై ఇల్లు... అందులో చక్కర్లు కొట్టాలని ఎవరికి మాత్రం ఉండదు! అలాంటి కలే తమిళనాడు నమక్కల్‌ జిల్లాకు చెందిన 24 ఏళ్ల అరుణ్‌ ప్రభు కూడా కన్నాడు. అంతటితో వదిలెయ్యలేదు. దానికి రూపం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చక్రాలపై ఇల్లు... అందులో చక్కర్లు కొట్టాలని ఎవరికి మాత్రం ఉండదు! అలాంటి కలే తమిళనాడు నమక్కల్‌ జిల్లాకు చెందిన 24 ఏళ్ల అరుణ్‌ ప్రభు కూడా కన్నాడు. అంతటితో వదిలెయ్యలేదు. దానికి రూపం ఇవ్వాలనుకున్నాడు. స్వతహాగా ఆర్కిటెక్ట్‌ కావడం మరింత కలిసొచ్చింది. ఎప్పుడూ కొత్తగా ఆలోచించే అతడిని ‘టెంపరరీ హౌసింగ్‌’ (తాత్కాలిక గృహనిర్మాణం) విధానం బాగా ఆకట్టుకుంది. ఆ విధానంలో ఆటోరిక్షాపై చిన్నదిగా, సౌకర్యంగా ఉండే ఇల్లు ఒకటి నిర్మించాలని అనుకున్నాడు. వెంటనే కార్యక్షేత్రంలోకి దిగాడు. ఆటోరిక్షా ఒకటి తెచ్చాడు. దాని వెనకాల భాగంలో సింగిల్‌ బెడ్‌రూమ్‌ మొబైల్‌ ఇల్లు కట్టేశాడు. ఇందులో ప్రత్యేకతేంటంటే... ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్లడమే కాదు... ఎప్పుడు కావాలంటే అప్పుడూ ఏ భాగానికి ఆ భాగం ఊడదీసి, మళ్లీ బిగించుకోవచ్చు. 


లక్షలో సౌకర్యాలెన్నో... 

‘సోలో:01’లో ఆర్టిస్ట్‌, నిత్య పర్యాటకుడు, చిరు వ్యాపారి లేదా ఇల్లు లేనివారు ఎవరైనా సరే ఒకరు ప్రశాంతంగా గడిపేయవచ్చు. ఎలాంటివారికైనా అనువుగా ఉంటుందీ ఇల్లు. ఈ సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఇంట్లో ఇద్దరు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవనం సాగించే వీలుందంటాడు ప్రభు. దీని కోసం అతడు ఖర్చు పెట్టింది కేవలం లక్ష రూపాయలే! పైన సోలార్‌ ప్యానల్స్‌, వాటర్‌ ట్యాంక్‌, బ్యాటరీలు, కప్‌బోర్డ్స్‌, తలుపులు, మెట్లు, కాలకృత్యాలు తీర్చుకోవడానికి మరుగుదొడ్డి, బాత్‌ టబ్‌, పడుకోవడానికి బెడ్‌, సేద తీరడానికి ఓపెన్‌ ఎయిర్‌ లాంజ్‌, పని చేసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు ఇందులో ఉన్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే బహుళ ప్రయోజనాలు గల సౌకర్యవంతమైన ఇల్లు ఇది. 


మురికివాడల్లో ఇళ్లు చూసి... 

భూమి విలువ ఆకాశంలో ఉన్న తరుణంలో పేదవాడికి సొంత ఇల్లనేది కలగానే మిగిలిపోతుందంటాడు ‘బిల్‌బోర్డ్స్‌ కలెక్టివ్‌’ ఆర్కిటెక్చర్‌ కంపెనీ వ్యస్థాపకుడు కూడా అయిన ప్రభు. దాన్ని దృష్టిలో పెట్టుకునే ‘సోలో: 01’ రూపొందించానంటాడు. ‘‘భారత్‌లో ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తాత్కాలిక గృహనిర్మాణాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ‘సోలో’కు రూపకల్పన చేశాను. దీని కోసం మురికివాడల్లోని ఇళ్లను పరిశీలించాను. చాలా చిన్న ఇంట్లో ఎంతోమంది కుటుంబ సభ్యులు జీవిస్తుంటారు. ఇల్లు పక్కనే ఇల్లు... వాటి నిండా మనుషులు... చూస్తుంటేనే అక్కడ జీవనం ఎంత కష్టమో అర్థమవుతుంది. అదే తరహాలో గిరిజనులు వలసలు వచ్చి తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకొంటుంటారు.


వారి జీవన విధానంపై కూడా పరిశోధన చేశాను. వారిలో చాలామంది సంచార జీవులు. సరంజామా అంతటిని ఓ చిన్న మూటలో కట్టేసి ఒక చోట నుంచి మరొక చోటకు సులువుగా వెళ్లిపోగలుగుతారు. అంటే ఉన్నది తక్కువ చోటైనా దాన్ని పక్కాగా ఉపయోగించుకోవడం, నిరంతరం నివాస ప్రాంతాలను మార్చడం... ఈ రెండు అంశాలనూ దృష్టిలో పెట్టుకుని చిన్న ప్రదేశంలో అన్ని సౌకర్యాలతో మొబైల్‌ ఇల్లు ఒకటి సృష్టించాలనుకున్నా’’ అని ‘సోలో’ వెనక కథ చెప్పుకొచ్చాడు ప్రభు. 


ప్రణాళిక ఉంటే సాధ్యమే... 

అందుబాటులో ఉన్న చిన్న చిన్న ఖాళీ స్థలాలను పూర్తి సామర్థ్యం మేర ఎలా వినియోగించు కోవచ్చనేదానిపై అవగాహన పెరగాలనేది అరుణ్‌ ప్రభు అభిప్రాయం. ‘‘సరైన ప్రణాళిక ఉంటే ప్రతి ఒక్కరికీ అవసరమైన జాగా చూపించవచ్చు. ఈ దిశగా అవగాహన కల్పించాలన్నది నా లక్ష్యం. తద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగవుతాయి’’ అంటాడు ప్రభు. 


స్టీల్‌... అల్యూమినియం... 

ఆరు ఇన్టూ ఆరు అడుగుల వైశాల్యం గల ‘సోలో:01’ని స్టీల్‌, అల్యూమినియం, వాడి పడేసిన లోహాలతో రూపొందించాడు ప్రభు. ఇలాంటి మెటీరియల్స్‌ ఉపయోగించడంవల్ల ఖర్చు బాగా తగ్గుతుందంటాడు అతడు. ‘‘దీని తయారీకి ఆరు మాసాలు పట్టింది. పది పన్నెండు మోడల్స్‌ చేసిన తరువాత తుది రూపు వచ్చింది. మరింత మెరుగైన మోడల్‌ కోసం ప్రయత్నిస్తున్నాం’’ అంటున్న ప్రభు డిజైన్‌ను చూసి ‘మహీంద్రా గ్రూప్‌’ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా ఫిదా అయిపోయారు. ‘సోలో:01’ను తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘ఇది అద్భుతమైన ప్రాజెక్ట్‌. ఇలాంటివి మరిన్ని డిజైన్‌ చేయమని ప్రభుని అడగాలనుకుంటున్నా. ఎవరైనా అతడి కాంటాక్ట్‌ ఇవ్వగలగుతారా’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. ఇక అప్పటి నుంచి అరుణ్‌ ప్రభు ఫోన్‌ రింగ్‌ అవుతూనే ఉంది. ‘‘ఆయనంతటి పెద్దల ప్రోత్సాహం నాలాంటివారికి ఎనలేని ఉత్సాహాన్నిస్తుంది’’ అంటూ ప్రభు తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్న అతడికి మనమూ ఆల్‌ ద బెస్ట్‌ చెబుదాం.



ఆటోరిక్షానే ఎందుకు..? 

మొబైల్‌ ఇంటి నిర్మాణానికి ఆటోరిక్షానే ఎందుకు ఎంచుకున్నావని అడిగితే... భారత్‌లో అతితక్కువ చోటను ఆక్రమించే వాహనం అదొక్కటేనంటాడు ప్రభు. ‘‘సులువుగా అమర్చుకొనేలా చాలా తక్కువ బోల్ట్‌లతో ఇల్లు ఏర్పాటు చేశాను. ఏ మూల ఇంత చిన్న ఖాళీ ఉన్నా అక్కడ ఆటోను పార్క్‌ చేసుకొనే వీలుంది. అంతేకాదు ఈ ఇంటి యూనిట్‌ను కావాలనుకొంటే వేరేదైనా వాహనంపైకి కూడా మార్చుకోవచ్చు. విభిన్న పరిస్థితుల్లో సైతం తట్టుకొని నిలబడేలా దీన్ని డిజైన్‌ చేశాను. ఒక సైట్‌ వద్ద కొన్ని నెలల పాటు నివాసం ఏర్పాటు చేసుకొనే భవన నిర్మాణ కార్మికులు, సంచార జాతులకు ఇది బాగా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అత్యవసర నివాసంగానూ ఏర్పాటు చేసుకోవచ్చు’’ అంటూ ప్రభు తన ప్రాజెక్ట్‌ ప్రత్యేకతలు చెప్పాడు. 

Updated Date - 2021-03-17T06:43:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising