సమ్మె.. తొలిరోజు సక్సెస్!
ABN, First Publish Date - 2021-12-17T06:50:41+05:30
ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంక్
- తెరుచుకోని ప్రభుత్వ రంగ బ్యాంకులు
- దేశవ్యాప్తంగా ఖాతాదారులకు తీవ్ర ఇక్కట్లు
- ఏటీఎంలు పనిచేయడంతో కొంతవరకు ఊరట
- ప్రైవేటీకరణకు టీఆర్‌ఎస్ వ్యతిరేకం: వినోద్ కుమార్
న్యూఢిల్లీ/మంగళ్‌హాట్, డిసెంబర్ 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంక్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె.. తొలిరోజు విజయవంతమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పం జాబ్ నేషనల్ బ్యాంక్ తదితర ప్రభుత్వరంగ బ్యాంకులు మూతబడ్డా యి. విధులను బహిష్కరించిన ఉద్యోగులు.. ఎక్కడికక్కడ బ్యాంకుల ముందు నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని కోఠి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవరణలో గురువారం జరిగిన నిరసన కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సం ఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పాల్గొని ప్రసంగించా రు. ప్రభుత్వ రంగ బ్యాంకులు దేశ ప్రగతి రథ చక్రాలని, వాటిని ప్రైవేటీకరిస్తే.. ఆర్థిక వ్యవస్థ నాశనమవుతుందని అన్నారు. ఆర్థిక మాంద్యం వచ్చిన సమయంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలూ కు ప్పకూలినా.. భారత్, చైనాలు మాత్రం పెద్దగా ప్రభావితం కాలేదని, ఇందు కు ఇక్కడి పటిష్ఠమైన బ్యాంకింగ్ వ్యవస్థలే కారణమని తెలిపారు. జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణకు టీఆర్‌ఎస్ పూర్తిగా వ్యతిరేకమని, ఈ బిల్లును త మ పార్టీ ఎంపీలు పార్లమెంటులో వ్యతిరేకిస్తారని చెప్పారు.
మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ.. ఆర్థిక నేరగాళ్లను పట్టుకోవడం చేతగాని కేంద్రం.. ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటు పరం చేసేందుకు యత్నించడం ఏంటని ప్రశ్నించారు. ప్రైవేట్ బ్యాంకులతో ప్రజల డిపాజిట్ సొమ్ముకు ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా స్తంభించిన బ్యాంకింగ్
ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగుల సమ్మె ప్రభావంతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు స్తంభించాయి. రెండు రోజుల సమ్మెలో తొలిరోజు ఎక్కడికక్కడ లావాదేవీలు నిలిచిపోయాయి. నగదు డిపాజిట్లు, ఉపసంహరణలు, చెక్కుల క్లియరెన్సులు, లోన్ అప్రూవల్స్ ఆగిపోయాయి. దీంతో.. ఖాతాదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అయితే.. ఏటీఎంలు మాత్రం చాలా వరకు పనిచేయడం ఖాతాదారులకు కాస్తంత ఊరటనిచ్చింది.
దేశవ్యాప్తంగా ఒక్కరోజులో రూ.18,600 కోట్ల విలువైన 20.4 లక్షల చెక్కుల క్లియరెన్సు నిలిచిపోయిందని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం తెలిపారు. తమ రెండు రో జుల సమ్మె గురించి ఖాతాదారులకు బ్యాంకులు ముందుగానే చెప్పాయన్నా రు.
కాగా, హెచ్‌డీఎ్‌ఫసీ, ఐసీఐసీఐ, కొటక్ మహీంద్రా తదితర ప్రైవేటు బ్యాంకులు మాత్రం యథావిధిగా పనిచేశాయి. కాకపోతే.. ఈ బ్యాంకుల్లో డిపాజిటైన ప్రభుత్వ రంగ బ్యాంకుల చెక్కుల క్లియరెన్సు మాత్రం నిలిచిపోయింది. శుక్రవారం కూడా బ్యాంకుల సమ్మె కొనసాగనుంది. కాగా, బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు మం డిపడ్డారు.
Updated Date - 2021-12-17T06:50:41+05:30 IST