సింగరేణి కార్మికులది రాష్ట్ర ప్రభుత్వ ప్రాయోజిత సమ్మె
ABN, First Publish Date - 2021-12-14T07:10:56+05:30
సింగరేణి కార్మికులు చేస్తున్న సమ్మె రాష్ట్ర ప్రభుత్వ ప్రాయోజిత సమ్మె అని
- కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి
- బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలి: ఉత్తమ్
న్యూఢిల్లీ, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): సింగరేణి కార్మికులు చేస్తున్న సమ్మె రాష్ట్ర ప్రభుత్వ ప్రాయోజిత సమ్మె అని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. ఇది దురదృష్టకరమని, సంబంధిత మంత్రితో లేదా అధికారులతో మాట్లాడకుండా కార్మికులు సమ్మెకు దిగారని, వాళ్లు వచ్చి మాట్లాడాలని సూచించారు. ప్రభుత్వ ప్రాయోజిత సమ్మె ఇటు దేశ, అటు సింగరేణి ప్రయోజనాలకు మంచిది కాదన్నారు.
పార్లమెంటులో సోమవారం జీరో అవర్ లో తెలంగాణలో బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. దానిపై కేంద్ర మంత్రి స్పందించి సమాధానమిచ్చారు. బొగ్గు గనుల వేలం విధానం లేక ముందు గనుల కేటాయింపుపై యూపీఏ హయాంలో ఏం జరిగిందో, ఆ తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పిందో అందరికీ తెలుసునని అన్నారు.
అంతకు ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... నాలుగు బొగ్గు గనుల వేలాన్ని తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు బొగ్గును సరఫరా చేస్తున్న సింగరేణిని కాదని గనులను వేలం వేయడం అభ్యంతరకరమన్నారు.
Updated Date - 2021-12-14T07:10:56+05:30 IST