సిప్పిపారై జాతి శునకాలకు శిక్షణ
ABN, First Publish Date - 2021-04-17T16:23:21+05:30
అడవుల్లో జరిగే నేరాలను గుర్తించేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ సిప్పిపారై జాతి శునకాలను పెంచుతోంది. ఈ కుక్కలకు అట
అడయార్(చెన్నై): అడవుల్లో జరిగే నేరాలను గుర్తించేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ సిప్పిపారై జాతి శునకాలను పెంచుతోంది. ఈ కుక్కలకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్రంలోని రాజ పాళెయం పరిసర ప్రాంతాల్లో కనిపించే సిప్పిపారై జాతి శునకాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపుతో పాటు పేరు కూడా ఉంది. ముఖ్యంగా వాసన పసిగట్టడంలోనూ, పరుగెత్తడంతోనూ వాటికవేసాటి. లేత పసుపు వర్ణంలో ఉంటే ఈ శునకాలు బక్కగా ఉంటాయి. అలాగే తోక మాత్రం చాలా పొడవుగా వంకర తిరిగివుంటుంది. ఇటీవల అటవీశాఖ అధికారులు వెల్లడించిన గణాంకాల మేరకు మగకుక్క సుమారుగా 63 సెంటీమీటర్లు, ఆడకుక్క 56 సెంటీమీటర్ల ఎత్తు ఉంటాయని తెలుస్తోంది. అటవీ ప్రాంతాల్లో జరిగే నేరాలను గుర్తించేందుకు అటవీ సిబ్బంది ఈ శునకాల సాయం తీసుకుంటుంటారు. ఈ నేపథ్యంలో తేని జిల్లాలోని తమిళనాడు అటవీ శాఖ శిక్షణా కాలేజీలో వలవన్, కడువన్, కలింగన్, ఆదవై అనే నాలుగు శునకాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. వాటిని కోయంబత్తూరు, పొల్లాచ్చి, నీలగిరి, కూడలూరు ప్రాంతల్లో అటవీ ప్రాంతాల్లో జూన్ నుంచి విధుల్లోకి తీసుకోనున్నారు. అడవుల్లో ఉండే వన్యప్రాణులకు వ్యతిరేకంగా జరిగే నేరాలను గుర్తించేందుకు ఈ శునకాల సాయాన్ని తీసుకోనున్నారు. ఇదే విషయంపై తమిళనాడు అటవీ శిక్షణా కాలేజీ ప్రిన్సిపాల్ ఆర్. రాజమోహన్ మాట్లాడుతూ, ఈ నాలుగు రకాల శునకాలకు 15 రోజలు పాటు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఇది రాష్ట్రానికి చెందిన నాటు కుక్కలని, వాటిని పెంచడం చాల సులభమే కాకుండా ఖర్చు కూడా తుక్కవ అని వివరించారు. గంధపు చెక్కల స్మగ్లింగ్, అడువుల్లో తప్పించుకునే వారి ఆచూకీని గుర్తించడం, జింకల వేట వంటిని సులభంగా గుర్తించవచ్చని ఆయన వివరించారు.
Updated Date - 2021-04-17T16:23:21+05:30 IST