మూడో రోజుకు చేరిన కేదార్‌నాథ్ అర్చకుల మౌన నిరసన
ABN, First Publish Date - 2021-06-13T14:43:33+05:30
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ దేవాలయం అర్చకుల నిరసన మూడో
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ దేవాలయం అర్చకుల నిరసన మూడో రోజుకు చేరింది. అర్చకులు ఆదివారం కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూ, మౌనంగా ధ్యానం చేస్తూ నిరసన తెలిపారు. ఉత్తరాఖండ్ చార్‌ధామ్ దేవస్థానం మేనేజ్‌మెంట్ బోర్డును రద్దు చేయాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు.
ఉత్తరాఖండ్ చార్‌ధామ్ దేవస్థానం మేనేజ్‌మెంట్ చట్టం, 2019 ప్రకారం ఉత్తరాఖండ్ చార్‌ధామ్ దేవస్థానం మేనేజ్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేశారు. దీనిని రద్దు చేయాలని అర్చకులు కోరుతున్నారు. కేదార్‌నాథ్ తీర్థ పురోహిత్ మహాసభ అధ్యక్షుడు వినోద్ శుక్లా ఇటీవల మాట్లాడుతూ, ఈ చట్టానికి వ్యతిరేకంగా తాము కొన్ని నెలల నుంచి పోరాడుతున్నామని చెప్పారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదన్నారు. తమ నిరసనపై స్పందించకపోవడంతో కేదార్‌నాథ్ లోయలోని ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
ఇదిలావుండగా చార్‌ధామ్ దేవాలయాలను, 51 ఇతర దేవాలయాలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి గతంలో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిని హైకోర్టు తోసిపుచ్చింది. చార్‌ధామ్ దేవాలయాల ఆస్తులు వాటికే చెందుతాయని, బోర్డు అధికారాలు కేవలం పరిపాలన, ఆస్తుల నిర్వహణకు మాత్రమే పరిమితమవుతాయని హైకోర్టు పేర్కొంది.
Updated Date - 2021-06-13T14:43:33+05:30 IST