ప్రధాని మోదీ పనితీరుపై ఆరెస్సెస్ అసంతృప్తి
ABN, First Publish Date - 2021-04-30T08:08:51+05:30
బహిరంగంగానే బీజేపీపై విరుచుకుపడ్డారు....
- ఇలాగా కరోనా నియంత్రణ?
- ఢిల్లీలో కట్టడి చర్యలపై ఆరెస్సెస్ కలత
న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: కొవిడ్ విపత్తు నుంచి దేశాన్ని కాపాడటానికి నరేంద్ర మోదీ సర్కారు మల్లగుల్లాలు పడుతున్నవేళ.. బీజేపీ సైద్ధాంతిక మార్గదర్శి ఆరెస్సెస్ మాత్రం.. ఈ పరిస్థితిని ఎదుర్కొనడంలో పార్టీనేతలు ప్రదర్శిస్తున్న తీరుపై కలత చెందినట్టు తెలుస్తోంది. కరోనా తీవ్రతను సమర్థంగా ఎదుర్కోవడంలో కేంద్ర వైఫల్యంపై సంఘ నాయకత్వం పెదవి విప్పకపోయినా.. ఆరెస్సెస్ ఢిల్లీ రాష్ట్ర కార్యకవర్గ సభ్యుడు రాజీవ్ తుల్లి మాత్రం బహిరంగంగానే బీజేపీపై విరుచుకుపడ్డారు. కరోనా విలయంతో ఢిల్లీ అతలాకుతలం అవుతుంటే ప్రజలకు సాయపడేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు ఎక్కడా కనిపించలేదని ఆయన బుధవారం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని లేపుతున్నాయి. ఢిల్లీవాసులకు అండగా నిలవాల్సిన బీజేపీ తీరు ఇదేనా? అంటూ ఆయన దుమ్మెత్తిపోశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గాన్ని రద్దుచేశారా? అని ఎద్దేవా చేశారు. రాజీవ్ వ్యాఖ్యలపై ఆరెస్సెస్ వర్గాలు పైకి సమర్థించకపోయినా.. లోలోపల మాత్రం ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తంచేస్తున్నాయి. ‘‘ఈ విపత్కర పరిస్థితిపై సహజంగానే అందరూ ఆందోళన చెందుతున్నారు. అయితే విమర్శించడానికి ఇది తగిన సమయం కాదు’’ అని ఆ వర్గాలు తమలోతాము సమాధానపడుతున్నాయి.
అయితే ఆరెస్సెస్ అఖిల్ భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేడ్కర్ మాత్రం.. రాజీవ్ తుల్లి వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీలకు అతీతంగా అందరూ కరోనా బారిన పడినవారిని ఆదుకోవడానికి కలిసికట్టుగా కదలిరావాలని అభిప్రాయపడ్డారు. రాజీవ్ వ్యాఖ్యలు వ్యక్తిగతమని.. వాటితో సంఘ్‌కు సంబంధంలేదని స్పష్టంచేశారు. కరోనా విపత్కర సమయంలో ప్రజలకు సంఘ్‌పరివార్ 12 విధాలైన సహాయ కార్యక్రమాలను చేపడుతున్నట్టు సునీల్ వివరించారు.
Updated Date - 2021-04-30T08:08:51+05:30 IST