రామాయపట్నం పోర్టు హుళక్కి!
ABN, First Publish Date - 2021-03-09T08:27:51+05:30
మరో విభజన హామీ అటకెక్కింది. ప్రకాశం జిల్లా రామాయపట్నం రేవుతో తమకు సంబంధం లేదని కేంద్రం తేల్చేసింది. ‘కేంద్రం మేజర్ పోర్టులు మాత్రమే చేపడుతుంది. కానీ... అక్కడ నాన్-మేజర్ పోర్టు ఏర్పాటుకు
మరో విభజన హామీకి కేంద్రం తూట్లు!
మేజర్ పోర్టులే కేంద్రం పరిధిలోకి!
రామాయపట్నంలో నాన్-మేజర్ పోర్టు
రాష్ట్ర ప్రభుత్వమే నోటిఫికేషన్ ఇచ్చింది
కేంద్రం చేపట్టాలంటే విభజన చట్టాన్ని సవరించాలి
రాజ్యసభలో కేంద్ర మంత్రి వెల్లడి
టీజీ, జీవీఎల్ ప్రశ్నలకు జవాబు
గతంలో దుగరాజపట్నానికి ‘నో’.. ప్రత్యామ్నాయంగా ‘రామాయపట్నం’
దానిని ‘నాన్ మేజర్’గా మార్చిన జగన్.. అదే అస్త్రంగా అసలుకే మోసం!
ప్రత్యేక హోదాను అటకెక్కించారు! విశాఖ రైల్వే జోన్‌ను ప్రకటనతో సరిపెట్టారు. పోలవరం ప్రాజెక్టు నిధులకు గండి కొట్టారు. తాజాగా... రాష్ట్ర విభజన హామీల్లో మరొక దానిని మాయం చేసేశారు. రామాయపట్నం పోర్టు రాష్ట్రం బాధ్యతే అని తేల్చేశారు. దీనిని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ‘మైనర్ పోర్టు’గా మార్చడంతో ‘కేంద్ర ప్రభుత్వం మేజర్ పోర్టులను మాత్రమే చేపడుతుంది. అందువల్ల రామాయపట్నంతో మాకు సంబంధం లేదు’ అని కేంద్రం తేల్చేయడం గమనార్హం!
న్యూఢిల్లీ, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): మరో విభజన హామీ అటకెక్కింది. ప్రకాశం జిల్లా రామాయపట్నం రేవుతో తమకు సంబంధం లేదని కేంద్రం తేల్చేసింది. ‘కేంద్రం మేజర్ పోర్టులు మాత్రమే చేపడుతుంది. కానీ... అక్కడ నాన్-మేజర్ పోర్టు ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం గత ఏడాది ఫిబ్రవరి 20నే నోటిఫికేషన్ జారీచేసింది’’ అని గుర్తు చేసింది. నాన్-మేజర్ (మైనర్) పోర్టుల బాధ్యత రాష్ట్రప్రభుత్వాలదేనని చెప్పింది. సోమవారం రాజ్యసభలో బీజేపీ సభ్యులు టీజీ వెంకటేశ్, జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఓడరేవులు, నౌకాయాన మంత్రి మన్‌సుఖ్ మాండవియా లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. భారతీయ ఓడరేవుల చట్టం-1908లోని పేరా3(9) ప్రకారం మేజర్ పోర్టులే కేంద్రం పరిధిలోకి వస్తాయన్నారు.
ఇది జగన్నాటకం!
ఇప్పటికే ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం తేల్చేసింది. రెవెన్యూ లోటు నిధులను తెగ్గోసింది. వెనుకబడిన జిల్లాలకు సాయం ఆపేసింది. దుగరాజపట్నంలో ఓడరేవుకు అవకాశం లేదన్నది. ప్రత్యామ్నాయంగా రామాయపట్నాన్ని చూపిస్తే.. ఇప్పుడు దానికీ సాయం చేసేది లేదు పొమ్మని తెగేసిచెప్పింది. అరబిందో కంపెనీకి రామాయపట్నం ఓడరేవును కట్టబెట్టేందుకు రాష్ట్ర సర్కారు ఇచ్చిన నోటిఫికేషనే కేంద్రానికి అస్త్రంగా మారిందని అంటున్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం నెల్లూరు జిల్లా దుగరాజపట్నంలో కేంద్రప్రభుత్వం ప్రధాన ఓడరేవు (మేజర్ పోర్టు) ఏర్పాటు చేయాలి. అయితే నిపుణులతో అధ్యయనం చేయించి.. అక్కడ మేజర్ పోర్టు ఏర్పాటుకు పరిస్థితులు అనుకూలంగా లేవని.. దీనికి ప్రత్యామ్నాయం ప్రతిపాదించాలని కేంద్రం రాష్ట్రానికి సూచించింది. నాటి చంద్రబాబు ప్రభుత్వం ప్రకాశం జిల్లా రామాయపట్నంలో మేజర్ పోర్టు ఏర్పాటుకు ప్రతిపాదించింది.
ఈ హామీని నెరవేర్చాలని ఆ తర్వాత పలు సార్లు లేఖలు రాసినా కేంద్రం పట్టించుకోలేదు. 2019లో పగ్గాలు చేపట్టిన జగన్ ప్రభుత్వం కూడా.. కొన్నాళ్లు రామాయపట్నంలోనే మేజర్ పోర్టు ఏర్పాటు చేయాలని కోరింది. తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన వైఖరిని మార్చుకున్నారు. మేజర్ పోర్టు స్థానంలో మైనర్ (నాన్-మేజర్) పోర్టు ఏర్పాటుకు ఆయన సర్కారు నిరుడు ఫిబ్రవరి 20న నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ పోర్టు ఏర్పాటవుతుందని.. ఇందుకోసం ఒక ప్రైవేటు ఫార్మాసూటికల్ కంపెనీ (అరబిందో) ఆసక్తి చూపుతోందని.. ఇందులో రాష్ట్రప్రభుత్వం కూడా భాగస్వామిగా ఉంటుందని.. అవసరమైతే ఆర్థికంగానూ సహకరిస్తుందని కొద్దిరోజుల కింద ముఖ్యమంత్రే స్వయంగా ప్రకటించారు. దీంతో నాన్-మేజర్ పోర్టు ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం నోటిఫై చేసినందున.. అక్కడ మేజర్ పోర్టు ఏర్పాటు అవసరం లేదని కేంద్ర మంత్రి మాండవియా పార్లమెంటులో చెప్పకనే చెప్పారు. కేంద్రమే మేజర్‌పోర్టు పెడితే నిధులన్నీ అదే భరిస్తుంది. రాష్ట్రప్రభుత్వం మైనర్ పోర్టు వైపు మొగ్గడంతో ఇప్పుడు నిధులివ్వదన్న మాట. జగన్ మోదీ సర్కారుకు వెసులుబాటు కలిగించేలా.. మైనర్ పోర్టు స్థాయికి తగ్గించడంపై సందేహాలు ముసురుకుంటున్నాయి. తన సన్నిహిత ఫార్మా కంపెనీకి పోర్టు కట్టబెట్టాలన్న ఉద్దేశంతోనే.. విభజన చట్టాన్ని సవరించాల్సిందిగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదని ప్రచారం జరుగుతోంది.
Updated Date - 2021-03-09T08:27:51+05:30 IST