విభజన గాయాలు గుర్తుకొచ్చే రోజు : మోదీ
ABN, First Publish Date - 2021-08-14T18:20:09+05:30
దేశ విభజన సమయంలో బుద్ధి లేని విద్వేషం, హింసకు
న్యూఢిల్లీ : దేశ విభజన సమయంలో బుద్ధి లేని విద్వేషం, హింసకు అనేక మంది బలైపోయారని, అటువంటివారిని స్మరించుకుంటూ, ‘భయానక విభజన గాయాలు గుర్తుకొచ్చే రోజు’గా ఆగస్టు 14ను పాటిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాలను ఆగస్టు 15న జరుపుకుంటున్న నేపథ్యంలో మోదీ ఈ ప్రకటన చేశారు.
మోదీ ఇచ్చిన ట్వీట్‌లో, విభజన వల్ల కలిగిన బాధలు ఎన్నటికీ మరపు రావని తెలిపారు. అర్థరహితమైన, బుద్ధిలేని హింస, విద్వేషాల కారణంగా లక్షలాది మంది మన సోదర, సోదరీమణులు నిరాశ్రయులుగా మారారన్నారు. అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మన ప్రజల సంఘర్షణ, త్యాగాలను స్మరించుకుంటూ, ఆగస్టు 14ను భయానక విభజన గాయాలు గుర్తుకొచ్చే రోజుగా పాటిస్తామన్నారు.
మరొక ట్వీట్‌లో, సామాజిక విభజనలు, అసమతౌల్యం, అపశ్రుతుల విషాన్ని తొలగించవలసిన అవసరం ఉందని ‘భయానక విభజన గాయాలు గుర్తుకొచ్చే రోజు’ మనకు నిరంతరం గుర్తు చేస్తుందన్నారు. అంతేకాకుండా సమైక్య భావన, సాంఘిక సామరస్యం, మానవ సాధికారతలను మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు.
Updated Date - 2021-08-14T18:20:09+05:30 IST