మధురైలో రూ.70 కోట్లతో ‘కలైంజర్ గ్రంథాలయం’
ABN, First Publish Date - 2021-07-24T12:40:55+05:30
మదురై రేస్‌కోర్స్ ప్రాంతంలో రూ.70 కోట్లతో ‘కలైంజర్ గ్రంథాలయం’ నిర్మించనున్నట్లు ప్రజాపనుల శాఖ మంత్రి ఏవీ వేలు తెలిపారు. మదురై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మదురై, తేని, దిండుగ
చెన్నై: మదురై రేస్‌కోర్స్ ప్రాంతంలో రూ.70 కోట్లతో ‘కలైంజర్ గ్రంథాలయం’ నిర్మించనున్నట్లు ప్రజాపనుల శాఖ మంత్రి ఏవీ వేలు తెలిపారు. మదురై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మదురై, తేని, దిండుగల్, శివగంగ, రామనాధపురం జిల్లాల్లో అమలు చేస్తున్న ప్రజాపనుల శాఖ పథకాలపై ఏర్పాటైన సమీక్షా సమావేశంలో ఏవీ వేలుతోపాటు మంత్రులు ఎ.చక్రపాణి, పి.మూర్తి, పళనివేల్ త్యాగ రాజన్, ఐదు జిల్లాలకు చెందిన కలెక్టర్లు, ప్రజాపనుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశం తర్వాత మంత్రి ఏవీ వేలు పాత్రికేయులతో మాట్లాడుతూ మదురై - నత్తం రహదారిలో రేస్‌కోర్స్ ప్రాంతంలోని నాలుగు ఎకరాల విస్తీర్ణంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పేరిట కొత్త గ్రంథాలయం నిర్మించనున్నామని తెలిపారు. ఈ గ్రంథాలయం కోసం మదురైలో పలు ప్రాంతాలను పరిశీలించిన మీదట రేస్‌కోర్స్ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు చెప్పారు. రేస్‌కోర్స్ ప్రాంతంలో ఇప్పటికే జిల్లా కలెక్టర్ నివాసగృహం, పోలీసు, ప్రజాపనుల శాఖ, న్యాయ శాఖకు చెందిన ఉన్నతాధికారుల కార్యాలయాలు, నివాసగృహాలు ఉన్నాయని ఆయన వివరించారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని గ్రంథాలయం నిర్మించడానికి ఇదే అనువైన స్థలమని ఎంపిక చేసినట్లు చెప్పారు. త్వరలో ముఖ్యమంత్రి స్టాలిన్ అంగీకారం పొందిన తర్వాత గ్రంథాలయం నిర్మాణపు పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు.
Updated Date - 2021-07-24T12:40:55+05:30 IST