కేంద్ర కేబినెట్లోకి జ్యోతిరాదిత్య?
ABN, First Publish Date - 2021-06-14T07:56:33+05:30
కేంద్రంలో, ఉత్తరప్రదేశ్లో పెద్ద ఎత్తున మంత్రివర్గ మార్పులకు రంగం సిద్ధమైంది. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తమ మంత్రివర్గంలో త్వరలో మార్పులు చేసేందుకు...
- శర్బానంద, సుశీల్ మోదీకి చోటు!
- యూపీ, గుజరాత్, ఇతర రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలోనే..
- యూపీలో యోగి మంత్రివర్గంలోనూ మార్పులు!
న్యూఢిల్లీ, జూన్ 13(ఆంధ్రజ్యోతి): కేంద్రంలో, ఉత్తరప్రదేశ్లో పెద్ద ఎత్తున మంత్రివర్గ మార్పులకు రంగం సిద్ధమైంది. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తమ మంత్రివర్గంలో త్వరలో మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మార్పులు యూపీ, గుజరాత్ తదితర రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే జరుగుతాయని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. యోగి ఆదిత్యనాథ్ ఇటీవల ఢిల్లీ వచ్చి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలతో చర్చలు జరిపారు. తర్వాత మోదీ, అమిత్షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్రంలో పలు మంత్రిత్వ శాఖల పనితీరును సమీక్షించారు. ఉన్నతస్థాయి అధికారులతోనూ ప్రధాని సమావేశాలు నిర్వహించారు. మోదీ తన మంత్రివర్గాన్ని 60 నుంచి 79కి పెంచే అవకాశాలున్నాయని ఆ వర్గాలు అంటున్నాయి. బీజేపీకిఉన్న సంఖ్యాబలాన్ని బట్టి ప్రధాని తన మంత్రివర్గంలో తనతోపాటు 80 మందికి స్థానం కల్పించే వీలుంది.
ఎవరికి అవకాశం లభించవచ్చంటే..
కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి రాజ్యసభ సభ్య త్వం పొందిన జ్యోతిరాదిత్య సింధియా, అసోం మాజీ సీఎం సర్బానంద సోనోవాల్, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంతీ పాండాకు మోదీ మంత్రివర్గంలో చాన్స్ లభించవచ్చు. మిత్రపక్షాల్లో అప్నాదళ్ నేత, మీర్జాపూర్ ఎంపీ అనూప్రియ పాటిల్, జనతాదళ్యూ)కు చెందిన ఇద్దరికి కూడా అవకాశం లభించవచ్చని భోగట్టా. ఇక యోగీ మంత్రివర్గంలోనూ మార్పులు జరగనున్నాయి. ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన జితిన్ ప్రసాద, అరవింద్ శర్మతోపాటు అప్నాదళ్, నిషాద్ పార్టీ తదితరులకు అవకాశాలు కల్పించవచ్చు. అరవింద శర్మకు ఉప ముఖ్యమంత్రి లేదా హోంశాఖను కేటాయించాలని మోదీ పట్టుబడుతున్నారు.
ఖాళీలు ఎన్నంటే..
కేంద్రంలో ప్రస్తుతం 21 మంది కేబినెట్ మంత్రులు, 9 మంది ఇండిపెండెంట్ హోదా తో సహాయ మంత్రులు, 19 మంది సహాయ మంత్రులున్నారు. పాతికకు పైగా ఖాళీలున్నా యి. పలువురు మంత్రులు ఒకటి కంటే ఎక్కువ శాఖలు నిర్వహిస్తున్నారు. పీయూష్ గోయల్, స్మృతి ఇరానీ, రవిశంకర్ ప్రసాద్, నరేంద్ర సింగ్ తోమర్, హర్షవర్ధన్, ప్రకాశ్ జావడేకర్ తమ శాఖలతో పాటు అదనపు శాఖలను నిర్వహిస్తున్నారు. వినియోగ వ్యవహరాలు, ఆహారం. ప్రజాపంపిణీ శాఖకు కేంద్రమంత్రిగా ఉన్న రాంవిలాస్ పాశ్వాన్ మరణించిన తర్వాత ఆయన స్థానంలో ఎవర్నీ నియమించలేదు.
Updated Date - 2021-06-14T07:56:33+05:30 IST