భారత్ ఆధీనంలోకి తవంగ్‌ను తెచ్చిన హీరోను గుర్తు చేసుకుంటూ...
ABN, First Publish Date - 2021-02-14T00:11:37+05:30
అరుణాచల్ ప్రదేశ్‌లోని తవంగ్ ప్రాంతాన్ని భారత దేశ నియంత్రణలోకి
న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్‌లోని తవంగ్ ప్రాంతాన్ని భారత దేశ నియంత్రణలోకి తేవడంలో ప్రధాన భూమిక పోషించిన మేజర్ రలెంగ్నావ్ బాబ్ ఖతింగ్‌ను స్మరించుకునే కార్యక్రమం ఆదివారం జరగనుంది. కలవంగ్పో ఆడిటోరియంలో మేజర్ బాబ్ ఖతింగ్ స్మారక కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు, మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా, కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ బ్రిగేడియర్ (రిటైర్డ్) బీడీ మిశ్రా పాల్గొంటారు.
కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ, మేజర్ ఖతింగ్ భారత దేశ అత్యంత ప్రముఖ హీరోల్లో ఒకరని తెలిపారు. ఆయన సేవలను ఎన్నటికీ మర్చిపోకూడదన్నారు. ఆయనను ఇప్పటి వరకు నిర్లక్ష్యం చేశారని, ఇకపై ఆయనకు సముచిత గుర్తింపు ఇస్తామని చెప్పారు.
మేజర్ ఖతింగ్ 1912 ఫిబ్రవరిలో మణిపూర్‌లోని ఉక్రుల్‌లో జన్మించారు. 1990 జనవరి 12న దివంగతులయ్యారు. ఆయన ఆర్మీ మేజర్, సివిల్ సర్వెంట్, దౌత్యవేత్తగా మన దేశానికి సేవలందించారు. రెండో ప్రపంచ యుద్ధానికి పూర్వం తవంగ్ అప్పటి స్వతంత్ర టిబెట్ ప్రభుత్వ నియంత్రణలో ఉండేది. అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ బ్రిటిష్ పాలకులు దీనిని స్వాధీనం చేసుకోలేకపోయారు.
ప్రస్తుత అరుణాచల్ ప్రదేశ్ గతంలో నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీగా ఉండేది. దీనికి అసిస్టెంట్ పొలిటికల్ ఆఫీసర్‌గా మేజర్ ఖతింగ్ వ్యవహరించారు. అప్పటి అస్సాం గవర్నర్ జైరామ్‌దాస్ దౌలత్‌రామ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో పని చేస్తూ, తవంగ్‌ను భారత దేశ నియంత్రణలోకి తీసుకొచ్చారు. 1951 జనవరి 17న 200 మంది సైనికులు, 600 మంది కూలీలతో తవంగ్‌కు వెళ్ళాలని గవర్నర్ ఆదేశించారు. వెంటనే మేజర్ ఖతింగ్ అస్సాం రైఫిల్స్‌కు చెందిన సైనికులు, కూలీలతో తవంగ్ వెళ్ళారు.
తవంగ్ మోనాస్టరీ వద్ద స్థానిక పన్నుల అధికారులు, గ్రామ పెద్దలు, ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేశారు. స్థానికుల మనసును దోచుకునేవిధంగా దౌత్యపరమైన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. టిబెటన్ పరిపాలకుల పన్నుల విదింపు విధానాలు చాలా కఠినంగా ఉంటాయని తెలుసుకుని, భారత దేశంలో ప్రజాస్వామ్యం ఉందని, కఠినమైన పన్నులను విధించబోరని తవంగ్ ప్రజలకు నచ్చజెప్పారు. భారత దేశంలో అన్యాయంగా పన్నులను విధించరని చెప్పారు. స్థానికులు అంగీకరించడంతో తవంగ్, బుమ్లాలో భారత దేశ త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. తవంగ్ భారత దేశ నియంత్రణలోకి వచ్చింది.
మేజర్ ఖతింగ్ సేవలను స్మరించుకుంటూ, ఆయనను గౌరవిస్తూ ఆదివారం జరిగే కార్యక్రమంలో ఆయన కుమారుడు, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి జాన్, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొంటారు.
Updated Date - 2021-02-14T00:11:37+05:30 IST