ఆర్జేడీ మాజీ ఎంపీ కోవిడ్‌తో మృతి
ABN, First Publish Date - 2021-05-01T21:07:53+05:30
రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) మాజీ పార్లమెంటు సభ్యుడు మొహమ్మద్ షహబుద్దీన్ (53) శనివారంనాడు...
న్యూఢిల్లీ: రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) మాజీ పార్లమెంటు సభ్యుడు మొహమ్మద్ షహబుద్దీన్ (53) శనివారంనాడు కోవిడ్‌తో కన్నుమూశారు. తీహార్ జైలులో హత్యానేరం కింద జీవితఖైదు అనుభవిస్తున్న షహబుద్దీన్‌ను ఏప్రిల్ 20న ఢిల్లీలోని దీన్ దయాళ్ ఆసుపత్రి ఐసీయూలో చేర్చారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. షహబుద్దీన్ మృతిపై ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని సంతాప సందేశంలో పేర్కొన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సైతం మొహమ్మద్ షాబుద్దీన్ మృతికి సంతాపం తెలియజేశారు. చాలాకాలంగా శివన్ నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా ఆయన సేవలందించారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నట్టు పేర్కొన్నారు. షహబుద్దీన్ మృతిపై దీన్ దయాళ్ ఆసుపత్రి డీన్ తమకు సమాచారం అందించినట్టు ఢిల్లీ తీహార్ జైల్ డీజీ సందీప్ గోయెల్ తెలిపారు.
Updated Date - 2021-05-01T21:07:53+05:30 IST