డెల్టా.. ‘విశ్వ’రూపం
ABN, First Publish Date - 2021-06-25T07:16:50+05:30
మనదేశాన్ని రెండోవేవ్‌లో పట్టి కుదిపేసిన డెల్టా వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని
- 85కు పైగా దేశాల్లో స్వైరవిహారం..
- యూకేలో కొత్త కేసుల్లో దాదాపు 90%
- అమెరికా, రష్యాలో ఆందోళనకరంగా కేసులు
- ప్రపంచవ్యాప్తంగా ప్రబలే వేరియంట్‌గా ఎదిగే ముప్పు: డబ్ల్యూహెచ్‌వో ఆందోళన
ఐక్యరాజ్యసమితి, జూన్ 24: మనదేశాన్ని రెండోవేవ్‌లో పట్టి కుదిపేసిన డెల్టా వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ‘జనాభాలో దాదాపు 45% మందికి రెండు డోసుల టీకా వేసేశాం’ అని ఊపిరి పీల్చుకుంటున్న అమెరికాలో కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 20% డెల్టా వేరియంట్‌వే. ఇప్పటికే రెండు వేవ్‌లతో అల్లాడిన బ్రిటన్‌ను మూడో వేవ్ రూపంలో చావుదెబ్బ కొడుతోంది ఈ వేరియంటే. గత నెలరోజుల్లో అక్కడ నమోదైన 50 వేలకు పైగా కేసుల్లో 38 వేలకు పైగా డెల్టా వేరియంట్‌వే అంటే.. దాని విశ్వరూపాన్ని అర్థం చేసుకోవచ్చు. రష్యాలో అయితే డెల్టా వేరియంట్ మరణ మృదంగం మోగిస్తోంది. ఫిబ్రవరి 11 తర్వాత.. గురువారం ఒక్కరోజే అక్కడ 568 మరణాలు నమోదయ్యాయి. 20,182 మందికి పాజిటివ్ వచ్చింది. మాస్కోలో నమోదవుతున్న కేసుల్లో 90% ఈ వేరియంట్‌వే. కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో.. డెల్టా వైరస్ విస్ఫోటవ్యాప్తిని సమర్థంగా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని రష్యా ప్రభుత్వం అధికారులకు సూచించింది.
ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో డెల్టా కేసులు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. వారం వారం విడుదల చేసే కొవిడ్-19 అప్‌డేట్‌ను డబ్ల్యూహెచ్‌వో జూన్ 22న విడుదల చేసింది. ఆందోళనకారక వేరియంట్లుగా గుర్తించిన నాలుగింటిలో.. ఆల్ఫా (బ్రిటన్) వేరియంట్ కేసులు 170 దేశాల్లో, బీటా (దక్షిణాఫ్రికా) వేరియంట్ కేసులు 119 దేశాల్లో, గామా (బ్రెజిల్) వేరియంట్ కేసులు 71 దేశాల్లో, డెల్టా వేరియంట్ కేసులు 85 దేశాల్లో నమోదవుతున్నాయని పేర్కొంది. డెల్టా వేరియంట్ ఆల్ఫా కంటే మరింత వేగంగా వ్యాపిస్తోందని, ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మిగిలినవాటన్నింటినీ తోసిరాజని ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
‘‘సింగపూర్‌లో చేసిన ఒక అధ్యయనం ప్రకారం.. డెల్టా బారిన పడిన కేసుల్లో ఆక్సిజన్, ఐసీయూ చికిత్స అవసరం, మరణించే ముప్పు ఎక్కువగా ఉన్నట్టు తేలింది’ అని వెల్లడించింది. యూకేలో జరిగిన అధ్యయనం ప్రకారం ఫైజర్ టీకా తీసుకున్నవారిలో డెల్టా వల్ల ఆస్పత్రిపాలయ్యే ముప్పు 96%, ఆల్ఫా వల్ల 95% తగ్గుతుందని తేలింది. సింగిల్ డోసు ఫైజర్‌తో.. డెల్టా వల్ల ఆస్పత్రిపాలయ్యే ముప్పు 94%, ఆల్ఫా వల్ల 83% తగ్గుతుందని పే ర్కొంది. సింగిల్ డోసు ఆస్ట్రాజెనెకా ప్రభావం.. డెల్టా బాధితులపై 83%, ఆల్ఫా బాధితులపై 79% ఉంటుందని వివరించిం ది. ఫైజర్, ఆస్ట్రాజెనెకా ఏదైనా సింగిల్ డోసు టీకా వల్ల 65 ఏళ్లు దాటినవారిలో కరోనా నుంచి 60% రక్షణ ఉంటుందని యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకుల అధ్యయనంలో తేలింది.
భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కొవాగ్జిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆమోదం త్వరగా లభించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మోదీకి గురువా రం ఆమె లేఖ రాశారు. కొవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్‌వో ఆమోదం లభిస్తే విద్యార్థులతో పాటు వ్యాపారాలు, వివిధ పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి లబ్ధి చేకూరుతుందన్నారు.
‘డెల్టా ప్లస్’తో మహిళ మృతి
మధ్యప్రదేశ్‌లో కరోనా డెల్టా ప్లస్ వేరియంట్‌తో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన గత నెల 23నే జరిగింది. ఉజ్జయినికి చెందిన ఈ మహిళ (59)కు మే 17న పాజిటివ్ వచ్చింది. అనంతరం వారం రోజుల్లోనే చనిపోయింది. ఆమె నమూనాలను జన్యు విశ్లేషణకు పంపగా ఈ నెల 22న డెల్టా ప్లస్ వేరియంట్ నిర్ధారణ అయింది. ఢిల్లీ పంపి విశ్లేషణ చేయించడంతో నెల సమయం పట్టింది. కాగా, ఈ మహిళ టీకా తీసుకోలేదని ప్రభుత్వం గురువారం ప్రకటించింది. భోపాల్‌కు చెందిన మరో మహిళ (65) శాంపిళ్లను మే 23న పంపగా డెల్టా ప్లస్ అని నిర్ధారిస్తూ ఈ నెల 16న ప్రకటించారు. ఈ నేపథ్యంలో త్వరలో భోపాల్‌లోనే పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో మరో నలుగురికీ డెల్టాప్లస్ నిర్ధారణ అయింది. వీరంతా టీకా పొందారు. ప్రస్తుతం వీరి ఆరోగ్యం మెరుగుపడిందని ప్రభుత్వం తెలిపింది.
Updated Date - 2021-06-25T07:16:50+05:30 IST