‘కొవిడ్ మృతులకు పరిహారం..’
ABN, First Publish Date - 2021-10-29T08:25:36+05:30
‘కొవిడ్ మృతులకు పరిహారం..’
కేరళలో భారీగా దరఖాస్తులు!
మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్ వాస్తేకు పాజిటివ్
ఒమన్ గుర్తింపు పొందిన జాబితాలోకి కొవాక్సిన్
న్యూఢిల్లీ, అక్టోబరు 28: కేరళలో కరోనాతో సంభవించిన మరణాల సవరణ కొనసాగుతోంది. కొత్త, పాత కలిపి బుధవారం రాష్ట్ర ప్రభుత్వం 622 మరణాలను బులెటిన్‌లో తెలిపింది. మరోవైపు కొవిడ్‌తో చనిపోయినవారి కుటుంబాలకు రూ.50 వేల పరిహారం మంజూరుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల మార్గదర్శకాలు పంపిన నేపథ్యంలో.. ఇందుకోసం కేరళలో దరఖాస్తులు వస్తున్నాయి. వీటిని పరిశీలించిన ప్రభుత్వం బుధవారం 199 మరణాలను కొవిడ్‌తో సంభవించినట్లు పేర్కొంది. కొన్ని రోజుల నుంచి కేరళలో కరోనా మరణాల గణాంకాలను సవరిస్తున్నప్పటికీ.. పరిహారం కోసం రికార్డుల్లో నమోదు చేసినవాటి సంఖ్య ఇంత భారీగా లేదు. కాగా, పాతవాటితో కలిపి గురువారం కేరళ 708 మరణాలను హెల్త్ బులెటిన్‌లో చూపింది. వీటితో కలిపి రాష్ట్రంలో కొవిడ్ మృతుల సంఖ్య 30,685కు చేరింది. కర్ణాటకలోని కొడుగు జిల్లాలో 9 నుంచి 12వ తరగతులకు చెందిన 32 మంది రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు కరోనా సోకింది.
మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సేకు కరోనా వచ్చింది. మరోవైపు దేశంలో బుధవారం 16,156 మందికి కరోనా నిర్ధారణ అయింది. 733 మంది చనిపోయినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కాగా, కొవిడ్ కట్టడికి ప్రస్తుతం అమల్లో ఉన్న మార్గదర్శకాలను నవంబరు నెలాఖరు వరకు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులిచ్చింది. ఇక, భారత ఆరోగ్య రంగంలో పెట్టుబడులు పెట్టాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ప్రైవేటు రంగాన్ని కోరారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఏసియా హెల్త్ సమ్మిట్‌లో గురువారం ఆయన మాట్లాడారు. గతంలో ఆరోగ్య రంగం అంటే.. చికిత్స మాత్రమేనని, మోదీ ప్రభుత్వం ఈ రంగాన్ని అభివృద్ధిలో భాగం చేసిందని పేర్కొన్నారు. భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాక్సిన్‌ను.. ‘‘గుర్తింపు పొందిన టీకా’’ జాబితాలో చేరుస్తూ ఒమన్ నిర్ణయం తీసుకుంది.
రష్యాలో మరింత ఉధృతంగా కరోనా
రష్యాలో గురువారం తొలిసారి కరోనా కేసులు 40వేలు దాటాయి. ఎన్నడూ లేనంతగా 40,096 మందికి వైరస్ నిర్ధారణ అయింది. రికార్డుస్థాయిలో 1,159 మంది చనిపోయారు.
Updated Date - 2021-10-29T08:25:36+05:30 IST