మృతిచెందిన శిశువు బతికిందన్నారు.. అంతలోనే..
ABN, First Publish Date - 2021-07-06T13:22:23+05:30
తేని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు మృతి చెందినట్లు ప్రకటించిన శిశువు బ్రతికి, మళ్లీ అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శాశ్వతంగా కన్నుమూసిన సంఘటన కలకలం సృష్టించింది. తేని జిల్లా పెరి
చెన్నై: తేని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు మృతి చెందినట్లు ప్రకటించిన శిశువు బ్రతికి, మళ్లీ అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శాశ్వతంగా కన్నుమూసిన సంఘటన కలకలం సృష్టించింది. తేని జిల్లా పెరియకుళం సమీపం తామరైకుళం తహసీల్దార్ నగర్‌లో బిల్వేంద్రరాజా (35), ఫాతిమా మేరీ (30 అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. మేరీ ఇటీవల గర్భం దాల్చింది. పురుటి నొప్పులు రావడంతో శనివారం ప్రసవం కోసం తేని ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రిలో చేరింది. ఆదివారం ఉదయం ఆమె ఆడశిశువుకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన కాసేపటికే ఆ శిశువు మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. ఆ పసిబిడ్డను ఫాతిమా మేరీకి అప్పగిం చారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన మేరీ తన కుటుంబీకులకు కబురు చేసింది. కుటుంబ సభ్యులు ఆ బిడ్డను ఖననం చేయడానికి శ్మశానానికి తీసుకెళ్ళారు. కాసేపట్లో ఖననం చేయబోతుండగా ఆ బిడ్డ ఉన్నట్టుండి కాళ్లూ చేతు లూ ఊపింది. దీంతో కుటుంబీకుల సంతోషానికి పట్టపగ్గాలు లేకపోయింది. బిడ్డ బ్రతికిందన్న సంతోషంతో ఆస్పత్రికి పరుగులు తీశారు. వెంటనే ఆ బిడ్డను పరిశీలించిన వైద్యులు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతోందని ప్రకటించి వార్డులోకి తీసుకెళ్ళి వెంటిలేటర్‌ను అమర్చి చికిత్సలందించారు. సోమవారం ఉదయం 12 గంటలకు ఆ పసిబిడ్డ చికిత్స ఫలించక శాశ్వతంగా కన్ను మూసింది. దీనితో రోజంతా సంతోషంతో గడిపిన బిల్వేంద్రరాజా, మేరీ దంపతులు శోకతప్తులయ్యారు. బ్రతికున్న పసికందును మృతిచెందినట్టు ప్రకటించిన సంఘటనకు సంబంధించి ఇద్దరు డాక్టర్లు, నలుగురు నర్సులకు ఉన్నతాధికారులు మెమోలు జారీ చేశారు.
Updated Date - 2021-07-06T13:22:23+05:30 IST