ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటుకు!

ABN, First Publish Date - 2021-08-24T07:16:37+05:30

రోడ్లు, రైళ్లు, విద్యుదుత్పత్తి, సరఫరా నుంచి.. గ్యాస్‌ పైప్‌ లైన్లు, మైనింగ్‌, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, మైదానాల దాకా.. అంతగా ఆదాయం రాని, వినియోగంలో లేని ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను ప్రైవేటుకు అప్పగించేందుకు మోదీ సర్కారు సిద్ధమైంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • అప్పగించి ఆదాయం పొందే ప్లాన్‌
  • నాలుగేళ్లలో 6 లక్షల కోట్ల ఆదాయమే లక్ష్యం
  • ఐదు రంగాల ద్వారానే 80శాతం పైగా రాబడి
  • ఇన్విట్‌, పీపీపీ విధానాల్లో ప్రభుత్వ ఆస్తుల
  • ద్వారా ఆదాయం ఆర్జించే భారీ ప్రణాళిక
  • యాజమాన్యహక్కులు మాత్రం ప్రభుత్వానివే
  • ‘నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌’ను విడుదల 
  • చేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ 
  • జాబితాలోని ఆస్తుల్లో విశాఖపట్నం రేవు
  • బెర్తులు, విజయవాడ, తిరుపతి, 
  • రాజమండ్రి విమానాశ్రయాలు
  • తెలుగు రాష్ట్రాల్లో పలు రోడ్లు ప్రైవేట్‌ పరం
  • నిర్ణీత కాలం తర్వాత ఆస్తులు మళ్లీ సర్కారుకు



(న్యూఢిల్లీ, బిజినెస్‌ డెస్క్‌-ఆంధ్రజ్యోతి)

రోడ్లు, రైళ్లు, విద్యుదుత్పత్తి, సరఫరా నుంచి.. గ్యాస్‌ పైప్‌ లైన్లు, మైనింగ్‌, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, మైదానాల దాకా.. అంతగా ఆదాయం రాని, వినియోగంలో లేని ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను ప్రైవేటుకు అప్పగించేందుకు మోదీ సర్కారు సిద్ధమైంది. తద్వారా..  2022 నుంచి 2025 వరకూ.. అంటే నాలుగేళ్లలో రూ.6 లక్షల కోట్లను సమీకరించేందుకు భారీ ప్రణాళికలు రచించింది. ఈ ఏడాది  కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన నిర్ణయాల ప్రాతిపదికగా నీతీ ఆయోగ్‌ రూపొందించిన ‘నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ను (ఎన్‌ఎంపీ)’ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం ఆవిష్కరించారు. నూతన మౌలిక సదుపాయాల కల్పనలో ప్రైవేట్‌ రంగ పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా ఉపాధి అవకాశాలను, అత్యధిక ఆర్థికాభివృద్దిని సాధించడం, గ్రామీణ- సెమీ అర్బన్‌ ప్రాంతాలను నిరంతరం విలీనం చేయడం ద్వారా సమగ్ర ప్రజా సంక్షేమం సాధించడం తమ లక్ష్యమని ఆమె తెలిపారు. రహదారులు, రవాణా, రైల్వే, విద్యుత్తు, సహజవాయువు, పౌర విమానయానం, షిప్పింగ్‌, రేవులు, జల మార్గాలు, టెలీకమ్యూనికేషన్లు, ఆహారం, ప్రజాపంపిణీ, మైనింగ్‌, బొగ్గు, గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాలు మొదలైన 20కి పైగా రంగాల్లో ప్రభుత్వ ఆస్తులను నగదుగా మార్చే కార్యక్రమం జరుగుతుందని ఆమె వెల్లడించారు. అయితే ఆయా ఆస్తులపై యాజమాన్య హక్కులు కూడా ప్రభుత్వానివేనని, నిర్ణీతకాలం తర్వాత ప్రైవేటు భాగస్వామి ఆస్తిహక్కును ప్రభుత్వానికి తిరిగి అప్పగించడం తప్పనిసరి అని ఆమె వివరించారు. 


ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో.. అంటే 2021-22లో 15 శాతం ఆస్తులను నగదుగా మార్చడం ద్వారా రూ.88,190 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మిగిలిన మూడు సంవత్సరాల్లో వరుసగా రూ.1,62,422 కోట్లు, రూ.1,79,544 కోట్లు, రూ.1,67,345 కోట్లు సమీకరించేందుకు ప్రణాళికలు రచించింది. నేషనల్‌ మానెటైజేషన్‌ పైప్‌లైన్‌’ అంటే ఏమిటి? ఒక్కముక్కలో అర్థమయ్యేలా చెప్పాలంటే.. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు అప్పగించి, తద్వారా ఆదాయాన్ని ఆర్జించడం. ఈ ప్రక్రియలో భాగంగా ప్రైవేటు కంపెనీలు, లేదా వ్యక్తులు ప్రభుత్వ ఆస్తుల్లో ‘మౌలిక సదుపాయాల పెట్టుబడి ట్రస్ట్‌ (ఇన్‌విట్‌)’ ద్వారా పెట్టుబడులు పెట్టొచ్చు. అలాగే ప్రభుత్వ ఆస్తిని అభివృద్ధి చేసి దాని నిర్వహణ ద్వారా ఆదాయం గడించే అవకాశం ప్రైవేటు సంస్థలకు కల్పిస్తారు. నిర్ణీత కాలం తర్వాత ఆ ఆస్తిని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. నిజానికి ఇది కొత్త విషయమేమీ కాదు. టోల్‌గేట్ల ద్వారా వస్తున్న ఆదాయం, రైల్వే లైన్ల ప్రైవేటీకరణ వంటివి ఇలాంటివాటిలో భాగమే. కాకపోతే ప్రభుత్వం దాన్ని పెద్ద ఎత్తున, నాలుగేళ్ల కాలానికి భారీ ప్రణాళికలు రచించి, ఒక పద్ధతి ప్రకారం చేయడమే కొత్త విషయం. ఇందులో భాగంగా ప్రభుత్వ గిడ్డంగులు, క్రీడా మైదానాల వంటివాటిని దీర్ఘకాలిక లీజుపై ప్రైవేటుకు అప్పగించనున్నారు. కాగా.. నీతిఆయోగ్‌ ఎన్‌ఎంపీలో భాగంగా రూపొందించిన జాబితాలోని ఆస్తుల్లో విశాఖపట్టణం రేవు బెర్తులు, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు రహదారులు కూడా ఉన్నాయి.


బడ్జెట్లోనే ప్రకటన 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) బడ్జెట్‌లో భాగంగా ఆర్థిక మంత్రి ఎన్‌ఎంపీ ప్రణాళికను ప్రకటించారు. ప్రభుత్వ మౌలిక ఆస్తుల్లో ప్రైవేట్‌ వర్గాలకు భాగస్వామ్యం కల్పించడం ద్వారా సమీకరించే నిధులను.. మరిన్ని మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఖర్చు చేసే అవకాశం ఉంటుందని ఆమె బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. ఎన్‌ఎంపీ ప్రణాళికలో భాగంగా ప్రైవేట్‌కు అప్పగించే  ఆస్తులను గుర్తించే బాధ్యతలను ప్రభుత్వం నీతి ఆయోగ్‌కు అప్పగించింది. ఆయా మౌలిక రంగ మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరిపిన అనంతరం నీతి ఆయోగ్‌  అనువైన ఆస్తుల జాబితాను రూపొందించింది. ఈ ప్రణాళికలో భాగంగా సేకరించనున్న నిధుల విలువ.. కేంద్రం తలపెట్టిన రూ.43 లక్షల కోట్ల నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పైప్‌లైన్‌ (ఎన్‌ఐపీ)లో 14 శాతానికి సమానం.








Updated Date - 2021-08-24T07:16:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising