ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నాడీఎంకేలో చిన్నమ్మ చిచ్చు!

ABN, First Publish Date - 2021-10-27T14:31:52+05:30

మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు వీకే శశికళను చేర్చుకునే విషయంపై పార్టీ అధిష్ఠానవర్గం ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుంటుందంటూ అన్నాడీఎంకే పార్టీ సమన్వయకర్త, మాజీ ముఖ్యమం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                   - పార్టీలో OPS పట్ల పెరుగుతున్న వ్యతిరేకత


చెన్నై(Tamilnadu): మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు వీకే శశికళను చేర్చుకునే విషయంపై పార్టీ అధిష్ఠానవర్గం ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుంటుందంటూ అన్నాడీఎంకే పార్టీ సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. అంతేగాక ఇప్పటివరకూ నివురుగాసిన నిప్పులా వున్న పార్టీలో చిచ్చు రాజేసింది. రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చని, వారిని ఆమోదించడమా లేదా అన్నది ప్రజలే నిర్ణయిస్తారంటూ శశికళకు మద్దతు పలికేలా పన్నీర్‌సెల్వం చేసిన ప్రకటనపై సీనియర్లు రగిలిపోతున్నారు. ఇన్నాళ్లూ పళనిస్వామి జట్టుగా వున్న పన్నీర్‌సెల్వం.. హఠాత్తుగా ఎందుకు మారారన్న దానిపై ఆరా తీస్తున్నారు. మరీ ముఖ్యంగా శశికళను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పళనిస్వామి వర్గీయులు దీనిపై మండిపడుతున్నారు. అంతేగాక ఈపీఎస్‌ వర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి డి.జయకుమార్‌ తీవ్రంగా స్పందించారు. శశికళకు వ్యతిరేకంగా ధర్మయుద్ధం చేసిన పన్నీర్‌సెల్వం ఇలా మాట్లాడ్డం గర్హనీయమని పేర్కొన్నారు. అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో శశికళను పార్టీ నుంచి బహిష్కరిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశామని, ఆ తీర్మానంపై పన్నీర్‌సెల్వం సంతకం కూడా చేశారని ఆయన గుర్తు చేశారు. శశికళకు వ్యతిరేకంగా ధర్మయుద్ధం చేయడానికి పన్నీర్‌సెల్వం పార్టీని సైతం తాత్కాలికంగా విడిచిపెట్టారని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకే డిప్యూటీ సమన్వయకర్త కేపీ మునుస్వామి మాట్లాడుతూ... శశికళను పార్టీలో చేర్చుకోకూడదని పార్టీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన తర్వాత ఈ అంశాన్ని మళ్ళీ తిరగదోడటం సమంజసం కాదని పేర్కొన్నారు. ప్రస్తుతం శశికళకు మద్దతుగా వ్యవహరిస్తున్న నాయకులను పార్టీ నుండి బహిష్కరిస్తున్నారని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శశికళను పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 


డిసెంబర్‌లో సర్వసభ్య మండలి!

అన్నాడీఎంకే సీనియర్‌ నాయకుడొకరు మాట్లాడుతూ.. డిసెంబర్‌లో అన్నాడీఎంకే సర్వసభ్య మండలి సమావేశం జరుగ నుందని, ఆ సమావేశంలో శశికళ వ్యవహారంపైనా చర్చిస్తారని తెలిపారు. శశికళ వ్యవహారంపై ఎడప్పాడి పళనిస్వామి, ఒ. పన్నీర్‌సెల్వం మధ్య ప్రస్తుతం తీవ్ర అభిప్రాయభేదాలు వున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. మాజీ మంత్రులు కూడా ఆమెను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. సీనియర్‌ నేతలు పలువురు శశికళ వ్యవహారంపై మౌనం పాటిస్తున్నారు. కాగా ఈనెల 30వ తేదీన స్వాతంత్య్ర సమరయోధుడు ముత్తు రామలింగదేవర్‌ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఈపీఎస్‌ రామనాథపురం జిల్లా పశుంపొన్‌ వెళ్లనున్నారని, ఆ రోజు ఆయన శశికళపై కీలక ప్రకటన చేయబోతున్నారని మరో నేత వ్యాఖ్యానించారు. 


ఇరువురి మధ్య రాజీ కుదురుస్తా- జేసీడీ ప్రభాకరన్‌

శశికళ వ్యవహారంపై ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్‌సెల్వం మధ్య ఏర్పడిన వివాదం సమసిపోయేలా ఇరువురి మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిస్తానని అన్నాడీఎంకే వ్యవస్థాపక కార్యదర్శి జేసీడీ ప్రభాకరన్‌ తెలిపారు. పార్టీకి నాయకత్వం వహిస్తున్న ఇరువురు నేతలు విరుద్ధమైన అభిప్రాయాలను కలిగి వుంటే పార్టీ శ్రేణులంతా అయోమయానికి గురవుతారని ఆయన చెప్పారు. ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు.


ముగిసిన వివాదంపై వ్యాఖ్యలా?

- పొన్నయ్యన్‌

శశికళను పార్టీలో చేర్చుకోకూడదని పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులంతా సమైక్యంగా తీర్మానం చేసిన తర్వాత మళ్ళీ ఆ వివాదంపై వ్యాఖ్యలు చేయడం సబబు కాదని అన్నాడీఎంకే మాజీ మంత్రి సి. పొన్నయ్యన్‌ పేర్కొన్నారు. ముగిసిపోయిన వివాదంపై పన్నీర్‌సెల్వం మళ్లీ ప్రస్తావించడం వెనుక గల కారణమేమిటో అర్థం కావటం లేదని చెప్పారు. అన్నాడీఎంకేకు శశికళకు ఎలాంటి సంబంధాలు లేవని సుప్రీంకోర్టు సుస్పష్టంగా ప్రకటించిందని, పార్టీపై ఆమెకు ఎలాంటి హక్కు లేదని కూడా తెలిపిందని, ఈ పరిస్థితులలో ముగిసిన అధ్యాయాన్ని మళ్ళీ ప్రారంభించడం భావ్యం కాదని అన్నారు. 

Updated Date - 2021-10-27T14:31:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising