ఉన్నత విద్యాసంస్థల విద్యార్థులందరికీ పదిరోజుల్లోగా కొవిడ్ టీకాలు
ABN, First Publish Date - 2021-06-30T11:27:21+05:30
కర్ణాటక రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులందరికీ పదిరోజుల్లోగా కొవిడ్ టీకాలు వేయిస్తామని...
కర్ణాటక డిప్యూటీ సీఎం హామి
బెంగళూరు (కర్ణాటక): కర్ణాటక రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులందరికీ పదిరోజుల్లోగా కొవిడ్ టీకాలు వేయిస్తామని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సీఎన్ అశ్వత నారాయణ హామి ఇచ్చారు. రాష్ట్రంలో పాలిటెక్నిక్ ఐటీఐ, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, పారామెడికల్ డిప్లొమా, యూనివర్శిటీల విద్యార్థులకు పదిరోజుల్లోగా వ్యాక్సిన్లు వేయాలని డిప్యూటీ సీఎం నారాయణ వైద్యాధికారులను ఆదేశించారు. జూన్ 28వతేదీన 94వేలమంది విద్యార్థులకు వ్యాక్సిన్లు వేశామని, మరో పదిరోజుల్లోగా ఉన్నత విద్యార్థులకు అందరికీ టీకాలు వేస్తామని నారాయణ ప్రకటించారు.
జూన్ నెలలో 60 లక్షల వ్యాక్సిన్లు కర్ణాటక రాష్ట్రానికి వచ్చాయని, వచ్చే నెల టీకాల సంఖ్య పెరుగుతుందన్నారు. దేశంలోనే టీకాలు వేయడంలో కర్ణాటక మూడో స్థానంలో నిలిచిందని డిప్యూటీ సీఎం చెప్పారు. కరోనా థర్డ్ వేవే నేపథ్యంలో ఆగస్టు నాటికి ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచుతున్నామన్నారు. ఆసుపత్రులు, మెడికల్ కళాశాలల్లో 250 నుంచి 400 మెట్రిక్ టన్నులకు ఆక్సిజన్ ఉత్పత్తి పెంచుతున్నామని నారాయణ చెప్పారు. దీనికోసం 9 జిల్లాల్లో ఆక్సిజన్ రీఫిల్లింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని డిప్యూటీ సీఎం వివరించారు.
Updated Date - 2021-06-30T11:27:21+05:30 IST