ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బడీచౌడీ స్కూలు నుంచి బడా కోర్టుకు

ABN, First Publish Date - 2021-08-31T08:25:07+05:30

మూడు దశాబ్దాలకు పైగా సుప్రీం కోర్టులో సామాన్యుల సమస్యలపై వాదిస్తూ మచ్చలేని న్యాయవాదిగా పేరొందిన తెలుగు తేజం.. పమిడి ఘంటం శ్రీనరసింహ మంగళవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నేడు ప్రమాణస్వీకారం చేయనున్న 
  • తెలుగు తేజం పమిడిఘంటం శ్రీనరసింహ
  • న్యాయవాద వృత్తి నుంచి సుప్రీం న్యాయమూర్తిగా బాధ్యతలు
  • అబ్బయ్య మంత్రి వారసత్వం.. తండ్రి జస్టిస్‌ కోదండ రామయ్య స్ఫూర్తి


న్యూఢిల్లీ, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): మూడు దశాబ్దాలకు పైగా సుప్రీం కోర్టులో సామాన్యుల సమస్యలపై వాదిస్తూ మచ్చలేని న్యాయవాదిగా పేరొందిన తెలుగు తేజం.. పమిడి ఘంటం శ్రీనరసింహ మంగళవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీ న్యాయవర్గాల్లో మేధావిగా, పండితుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీ నరసింహ.. న్యాయవాద వృత్తి నుంచి నేరుగా న్యాయమూర్తి కానున్నారు. ఈమేరకు సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయంతో సుప్రీం న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్న శ్రీ నరసింహకు.. 2028లో కొద్దికాలంపాటు దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించే అద్భుత అవకాశం కూడా దక్కనుంది. ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ తర్వాత ఆ బాధ్యతలు నిర్వర్తించే తెలుగువాడు ఆయనే అవుతారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ పమిడిఘంటం కోదండరామయ్య కుమారుడైన నరసింహ.. తన తండ్రి మార్గదర్శకత్వమే తనను ఈ స్థాయికి చేర్చిందని పేర్కొన్నారు. సోమవారం ఆయనను కలిసినప్పుడు ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ అనేక అంశాలపై తన భావాలుపంచుకున్నారు. ‘‘మా నాన్నగారు సరళమైన, నిజాయతీ మూర్తీభవించిన మనిషి. ఆస్తులు, వనరులు లేకున్నా ఎందరికో సహాయపడ్డారు. ఆయన నడవడిక ద్వారానే మేము ఎన్నో నేర్చుకున్నాం’’ అని చెప్పారు. ప్రకాశం జిల్లా మోదేపల్లి గ్రామంలో జన్మించినపీఎస్‌ నరసింహ చదువంతా హైదరాబాద్‌లోనే సాగింది. బడీచౌడీలోని సెయింట్‌ ఆంథోనీ స్కూల్‌లో, నిజాం కళాశాలలో ఆయన విద్యాభ్యాసం చేశారు. 


న్యాయశాస్త్రంలో డిగ్రీ చేయడానికి ఢిల్లీ వచ్చిన ఆయన పట్టభద్రుడయ్యాక దేశరాజధానిలోనే ప్రాక్టీసు కొనసాగించారు. శ్రీ నరసింహ న్యాయవాద వృత్తి నుంచి న్యాయమూర్తి పదవికి రావడం గురించి చాలా కాలంగా ఢిల్లీలో చర్చ జరుగుతోంది. కానీ ఈ పదవి తాను ఆశించింది కాదని నరసింహ అంటారు. 1990 నుంచి సుప్రీంకోర్టులో ప్రాక్టీసు చేస్తున్న నరసింహకు గతంలో హైకోర్టు న్యాయమూర్తిగా అవకాశం వచ్చినప్పటికీ ఆయన వెళ్లడానికి ఇష్టపడలేదు. 2014-2018 మధ్య నాలుగేళ్లు అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా ఉన్నా ఆ పదవి నుంచి తప్పుకొని న్యాయవాదిగా ఉండేందుకే ఇష్టపడ్డారు. కోర్టుల్లో వాదించడం, కీలకమైన ప్రజా సమస్యలపై దృష్టి కేంద్రీకరించడం తనకు ఇష్టమని చెబుతారాయన. అయోధ్యలో రామమందిర నిర్మాణం నుంచి దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారంలో ఆయన ఎంతో కృషి చేశారు. ప్రాచీన గ్రంథాలపై, భారత చరిత్ర, ఇతిహాసాలపై, సంస్కృతిపై ఆయనకు ఉన్న పట్టు అయోధ్య కేసు పరిష్కారానికి తోడ్పడింది. అలాగే.. 15 సంవత్సరాలు లిటిగేషన్‌లో ఉన్న ‘బోర్డ్‌ ఆఫ్‌ క్రికెట్‌ కంట్రోల్‌ ఆఫ్‌ ఇండియా’ కేసులో అమికస్‌ క్యూరీగా వ్యవహరించి 145 గంటలపాటు చర్చించి, అందర్నీ ఒప్పించి దాని పరిపాలనకు సంబంధించిన సమస్యలను సామరస్యంగా పరిష్కరించడం ఆయనకెంతో పేరు తెచ్చింది. ఇవాళ బీసీసీఐ బలంగా ఉండడానికి కారణం ఆయనేనంటే అతిశయోక్తి కాదు. అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా పరువునష్టం రాజ్యాంగబద్ధత, ఆర్టీఐ చట్టానికి సంబంధించిన కీలక కేసుల్లో వాదించారు. అంతర్జాతీయ ట్రైబ్యునల్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఉన్నతాధికార కమిటీ సభ్యుడిగా ఆర్బిట్రేషన్‌ చట్టంలో కీలక మార్పులకు ఆయన కారకులయ్యారు.


ఆదివాసీల ఆత్మబంధువు..

ఆదివాసీలన్నా, అడవులన్నా నరసింహకు ప్రాణం. అందుకే ఆయన అనేక పర్యావరణ, అటవీ చట్టాలకు సంబంధించి కేసుల్లో వాదించారు. ‘‘అడవిలో అంతర్భాగమైన ఆదివాసీలను నేరస్థులుగా నిర్ణయిస్తూ బ్రిటిష్‌ వారు అటవీ చట్టం చేశారు. కానీ ఆదివాసీలను అడవి నుంచి విడదీయలేం. అలాగే, అడవిలో ఉండే ప్రతి మొక్కకూ జీవించే హక్కు ఉంటుంది. మనుషులకు పనికిరాదని దాన్ని తీసేసే వైఖరి తప్పు. మనిషి ఉన్నా లేకపోయినా మొక్క ఉంటుంది ఇదే హక్కు అడవిలో ఉండే ఆదివాసీలకూ ఉంటుంది. ఆదివాసీలే అడవి, అడవే ఆదివాసీలు’’ అంటూ ఒక కేసులో ఆయన చేసిన వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. పర్యావరణ, అటవీ బెంచ్‌కు అమికస్‌ క్యూరీగా 3 సంవత్సరాలు ఉన్నంతకాలం ముఖ్యమైన పర్యావరణ, అటవీ చట్టాలు, గిరిజన హక్కుల రూపకల్పనలో శ్రీనరసింహ ఎంతగానో తోడ్పడ్డారు. అలాగే.. తమిళనాడు సంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టు కేసులో కూడా అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌గా కేంద్ర ప్రభుత్వం తరఫున ఆయన కీలక వాదనలు చేశారు. ‘‘జల్లికట్టును పట్టణ మనస్తత్వంతో చూడకూడదు. ఎద్దు కష్టాన్ని ఆ రోజే చూస్తారుగానీ.. ఏడాదిలో మిగతా కాలమంతా ఆ ఎద్దులను సొంత బిడ్డల్లా పెంచి పోషించిన విషయాన్ని గుర్తించరు. ఇలాంటి పండుగలు మానవ సంబంధాలు మెరుగవడానికి తోడ్పడతాయి. ఊళ్లో సినిమా థియేటర్లు, ఫార్ములా వన్‌ రేసులు ఉండవు. ఆ పండుగలు అక్కడి ప్రజల జీవితంలో భాగం’’ అని వాదించి సుప్రీంకోర్టు జల్లికట్టు క్రీడ జరగడానికి ఒప్పుకొనేలా చేశారు. కాగా.. తనకు స్ఫూర్తినిచ్చింది గాంధీజీ ఆత్మకథ అని నరసింహ చెబుతారు. స్వేచ్ఛకు, సమానత్వానికి జరిగే సంఘర్షణ గురించి, మానవత్వం గురించి చెప్పిన అరవిందుడి తాత్విక దృక్పథమూ ఆయనకు ఇష్టమే. 


తెలుగు.. భారతీయత..ఇష్టం

శ్రీనరసింహకు తెలుగంటే చాలా ఇష్టం. తెలుగువాడిగా పుట్టడం చెప్పలేనంత అదృష్టంగా భావిస్తారు. ‘‘తెలుగుదనాన్ని, తెలుగు ప్రాముఖ్యతను గుర్తించడం ప్రతి తెలుగువాడికీ అవసరం. నిజానికి తెలుగు భాష సంస్కృతాన్ని మించింది. తెలుగు భాష, సాహిత్య సౌందర్యం సంస్కృత సాహిత్యం కంటే ఎన్నో రెట్లు గొప్పది. తెలుగు వాడే తెలుగును పట్టించుకోకపోవడమంత విషాదం మరేదీ లేదు. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినా తెలుగును అభివృద్ధి చేయాలి. పూర్వవైభవం తేవాలి. పోతన తెలుగు పద్యాల్లోని సౌందర్యం నుంచి కాళోజీ వాక్యాల్లోని కమ్మదనం వరకూ నాకెంతో ఇష్టం’’ అంటారాయన. ఆయనతో తెలుగు సాహిత్యం గురించి మాట్లాడితే ఎన్నో గొప్ప వాక్యాల గురించి చెబుతారు. పద్యాలను చదివి వినిపిస్తారు. అలాగే.. భారత సంస్కృతి కంటే గొప్ప సంస్కృతి ప్రపంచంలో ఎక్కడా లేదని ఆయన విశ్వసిస్తారు. ‘‘ ‘మీరు మా కంటే తక్కువవాళ్లు’ అని వలసవాదులు నిరూపించే ప్రయత్నం చేశారు. కానీ, మనం ప్రపంచంలో ఏ జాతి కంటే తక్కువ కాదు. మన భవిష్యత్‌ను మనమే రూపొందించుకుని ప్రపంచంలో మన ప్రతిష్ఠను నిలుపుకునే ప్రయత్నంచేయాలి’’ అంటారాయన.


ఆ ఇంటిపేరు ఎలా వచ్చిందంటే..

విజయనగర సామ్రాజ్యంలో 15వ శతాబ్దంలో ప్రౌఢదేవరాయల ఆస్థానంలో మంత్రిగా ఉన్న అబ్బయ్య మంత్రి పీఎస్‌ నరసింహ పూర్వీకులని చెబుతారు. ఆయన కాలంలో వారి ఇంటిపేరు తామరపల్లి. మహా పండితుడైన అబ్బయ్యకు రాజు బంగారు కలం బహుమానంగా ఇవ్వడంతో అప్పటి నుంచి వారి ఇంటిపేరు పమిడిఘంటంగా మారిందంటారు. పమిడి అంటే బంగారం అని అర్థం.



కుటుంబమంతా విద్యాధికులే..

ఆయనకు ఇద్దరు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. అందరూ విద్యాధికులే. నరసింహ పెద్దన్నయ్య శ్రీ రఘురామ్‌ సీనియర్‌ న్యాయవాది. మరో అన్నయ్య కాశీ విశ్వనాథ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నిర్వహిస్తున్నారు. ఒక అక్కయ్య తత్వ శాస్త్రంలో ప్రొఫెసర్‌ కాగా.. రెండో అక్కయ్య కెనడాలో చాలాకాలంపాటు లైఫ్‌స్కిల్స్‌ కౌన్సెలర్‌గా పనిచేసి బెంగళూరులో స్థిరపడ్డారు. ఆయన ఇద్దరు బావలూ శాస్త్రవేత్తలు.

Updated Date - 2021-08-31T08:25:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising