బరువు తగ్గడానికి చిరుధాన్యాలు
ABN, First Publish Date - 2021-08-07T17:32:38+05:30
బరువు తగ్గాలా? బరువు తగ్గడం కోసం రకరకాల ప్రయత్నాలు చేసి విఫలమయ్యారా? అయితే ఒకసారి చిరుధాన్యాలను ప్రయత్నించండి. వీటిలో ప్రోటీన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ వీటిని తీసుకోవడం ద్వారా బరువు కూడా తగ్గుతారని అధ్యయనంలో తేలింది.
ఆంధ్రజ్యోతి(07-08-2021)
బరువు తగ్గాలా? బరువు తగ్గడం కోసం రకరకాల ప్రయత్నాలు చేసి విఫలమయ్యారా? అయితే ఒకసారి చిరుధాన్యాలను ప్రయత్నించండి. వీటిలో ప్రోటీన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ వీటిని తీసుకోవడం ద్వారా బరువు కూడా తగ్గుతారని అధ్యయనంలో తేలింది.
రాగులలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. హీమోగ్లోబిన్ తయారీకి అవసరమైన ఐరన్ రాగుల ద్వారా శరీరానికి అందుతుంది. అంతేకాకుండా వీటిలో కాల్షియం, పొటాషియం అధికంగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఫలితంగా ఎక్కువ సమయం పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. డయాబెటిస్తో బాధపడేవారికి ఇది మంచి ఆహారం. రాగులు పిల్లలకు పెడితే చాలా మంచిది. ఇందులో ఉన్న అమైనోయాసిడ్స్ పిల్లల మెదడు పెరుగుదలకు సహాయపడతాయి.
జొన్నల్లో విటమిన్ బి, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లావనాయిడ్లు, ఫెనొలిక్ యాసిడ్స్, టానిన్స్ ఉంటాయి. బి విటమిన్ జీవక్రియల రేటును పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది. మెగ్నీషియం ఎముకలు, గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. 96గ్రాముల జొన్నలు తీసుకుంటే రోజూ తీసుకోవాల్సిన ఫైబర్‌లో 20 శాతం శరీరానికి అందుతుంది. ఫైబర్ పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.
సజ్జలు తక్కువ క్యాలరీలను ఇస్తాయి. ప్రొటీన్, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు సజ్జలను తప్పకుండా మెనూలో చేర్చుకోవాలి. వీటిలో ఉన్న ఫైబర్ ఎక్కువ సమయం పొట్ట నిండుగా ఉంచుతుంది. ఫలితంగా రోజూ తీసుకునే క్యాలరీల సంఖ్య పెరగదు. సజ్జలు తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంతో పాటు కొన్ని రకాల కేన్సర్లు రాకుండా కాపాడుతాయి.
Updated Date - 2021-08-07T17:32:38+05:30 IST