మాతో పెట్టుకుంటే షాక్ ఖాయం
ABN, First Publish Date - 2021-12-20T15:37:18+05:30
‘‘1956లో ఏపీఎ్‌సఈబీ ఏర్పడింది. అప్పటి నుంచి ఏనాడూ చూడని పరిస్థితులను నేడు చూడాల్సి వస్తోంది. ఉద్యోగులు, కార్మికుల సమస్యలను..
చరిత్ర కూడా ఇదే చెబుతోంది
ఉద్యోగులపై ఎందుకింత వ్యతిరేకత?
సమస్యలు పరిష్కరించకుంటే తాడోపేడో
విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నిప్పులు
మమ్మల్ని చీడపురుగుల్లా చూస్తున్నారు
విజయవాడ, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): ‘‘1956లో ఏపీఎ్‌సఈబీ ఏర్పడింది. అప్పటి నుంచి ఏనాడూ చూడని పరిస్థితులను నేడు చూడాల్సి వస్తోంది. ఉద్యోగులు, కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన యాజమాన్యాలు కక్షసాధింపు చర్యలకు దిగుతున్నాయి. భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఉద్యోగులను చీడపురుగుల్లా చూస్తున్నారు. యాజమాన్యం తీరుతో ఉద్యోగులు స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎంతో ఓర్పుతో వ్యహరించాం. ఇక ఆ పరిస్థితి లేదు. మాతో పెట్టుకుంటే షాక్ తగలడం ఖాయం. చరిత్ర కూడా ఇదే చెబుతోంది’’ అని ఏపీ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ ప్రభుత్వాన్ని, యాజమాన్యాలను హెచ్చరించింది. విజయవాడ సర్కిల్ విద్యుత్ ఉద్యోగుల సర్వసభ్య సమావేశం ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ పి.చంద్రశేఖర్, కన్వీనర్ సాయికృష్ణ, ప్రతాపరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసినా ముఖ్యమంత్రితో కనీసం శెభాష్ అనిపించుకోలేకపోయామని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యుత్ శాఖ ఉద్యోగులతో ఇంతకుముందు ప్రభుత్వాలన్నీ ఎంతో సఖ్యతతో వ్యవహరించాయని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. ఉద్యోగులను యాజమాన్యం వేధిస్తోందని ఆరోపించారు. సమస్యలపై రెండేళ్లుగా పోరాడుతున్నా ఇప్పటి వరకు ఒక్కదానికీ పరిష్కారం లభించలేదన్నారు. పాత పెన్షన్ విధానం కొనసాగింపు, కాంట్రాక్ట్ కార్మికులకు నేరుగా వేతనాలు, కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్ వంటి సమస్యలన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉన్నాయన్నారు. 2019లో ఇంధన శాఖ కార్యదర్శి, ట్రాన్స్‌కో సీఎండీ వేర్వేరుగా ఉండేవారని, ఇప్పుడు రెండింటికీ ఒక్కరే అధికారి కావడంతో సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ఇంతకుముందు పనిచేసిన సీఎండీలు ప్రభుత్వాల వద్దకు వెళ్లకుండా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించారన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో తాము రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. సమస్యలపై ప్రశ్నించిన ఉద్యోగులపై అధికారులు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని వెల్లడించారు. ఈ భయంతో కొంతమంది వీఆర్‌ఎస్ తీసుకుంటున్నారని చెప్పారు. మంత్రి బాలినేనిని ఇప్పటి వరకు 10-11సార్లు కలిశామన్నారు. అక్టోబరు 23న సీఎంతో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చినా ఇప్పటి వరకు జరగలేదన్నారు.
13జిల్లాలోనూ జేఏసీ సమావేశాలు నిర్వహిస్తామని, ఇది ఆరంభం మాత్రమేనని స్పష్టం చేశారు. జేఏసీ నేతల ముఖాలు చూడటానికి కూడా ప్రభుత్వం, డిస్కంల సీఎండీలు ఇష్టపడటం లేదన్నారు. ఉద్యోగులపై యాజమాన్యాలకు, ప్రభుత్వానికి ఎందుకింత వ్యతిరేకతని ప్రశ్నించారు. జమ్మూకశ్మీర్‌లో విద్యుత్ శాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అక్కడి ఉద్యోగులు మొత్తం సమ్మెలోకి వెళ్లారన్నారు. ఆ పరిస్థితి ఇక్కడ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం, డిస్కంల అధికారులపై ఉందని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగులు 50వేలకు పైగా ఉన్నారన్నారు. వారిలో 90శాతం మంది జెన్‌కో సీఎండీపై తప్ప మిగిలిన అన్ని డిస్కంల సీఎండీల పైనా వ్యతిరేకంగా చెబుతున్నారని జేఏసీ నేతలు పేర్కొన్నారు.
Updated Date - 2021-12-20T15:37:18+05:30 IST