ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాళ్లూ వీళ్లూ తాలిబనీతత్వాన్ని వీడాలి

ABN, First Publish Date - 2021-08-27T06:05:31+05:30

భారతీయ ముస్లింలకు అడుగడుగునా అగ్నిపరీక్షలే. ఒక ‘లౌకిక’, ‘రాజ్యాంగబద్ధ’ భారతీయ ముస్లిం ఎదుర్కొనే అవస్థల గురించి మరి చెప్పనవసరం లేదు. హిందూ మితవాదులు నిరంతరం అతన్ని వేధిస్తూనే ఉంటారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారతీయ ముస్లింలకు అడుగడుగునా అగ్నిపరీక్షలే. ఒక ‘లౌకిక’, ‘రాజ్యాంగబద్ధ’ భారతీయ ముస్లిం ఎదుర్కొనే అవస్థల గురించి మరి చెప్పనవసరం లేదు. హిందూ మితవాదులు నిరంతరం అతన్ని వేధిస్తూనే ఉంటారు. ఇంచుమించు ప్రతి అంశంపైన ప్రతి ముస్లిం కూడా దేశభక్తి పరీక్షలో నెగ్గితీరాలని ఆ మితవాదులు సతాయిస్తుంటారు. ముస్లింలందరూ తమ మతపరమైన అస్తిత్వానికి ఇతర జీవన వ్యాసంగాల కంటే ప్రాధాన్యమిచ్చితీరాలని ఇస్లామిస్ట్ బృందాలు డిమాండ్ చేస్తుంటాయి. ఇస్లామిక్ మతమౌఢ్యం, అధికసం ఖ్యాక ఆధిపత్య వాద హిందూత్వ మధ్య చిక్కుకున్న ‘లౌకిక’ ముస్లిం మనుగడ అపాయంలోకి జారిపోతోంది. మన సహచర భారతీయుడైన అతడు అంతకంతకూ దుర్బలుడు అవుతున్నాడు. ఉరుముఉరిమి మంగళం మీద పడ్డట్టు అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ల పునరుత్థానం మన దేశీయ రాజకీయాలలో సృష్టిస్తున్న ప్రకంపనలే భారతీయ ముస్లింల తాజా సంకటపరిస్థితికి అద్దం పడుతున్నాయి.


తాలిబన్ దళాలు పాల్పడుతున్న అరాచకాలు, దురాగతాలను భారతీయ ముస్లింలు నిర్ద్వంద్వంగా ఖండించాలని హిందూ మితవాదులు కోరుతున్నారు. భారతీయ ముస్లింలు అఫ్ఘాన్ మిలీషియా (పౌరసైన్యం)ను ‘స్వాతంత్ర్య సమరయోధులు’గా గుర్తిస్తూ తాలిబన్లకు మతాభినివేశ సంఘీభావాన్ని తెలుపాలని ఇస్లామిక్‌ వాదులు అభిలషిస్తున్నారు. మనదేశంలో ఒక ముస్లిం మతాచార్యుడు లేదా ప్రజాజీవిత ప్రముఖుడు బహిరంగంగా తాలిబన్‌ను సమర్థించిన ప్రతిసారీ ‘నేను చెప్పలా, వారు అంతేరా బాబూ’ అనే ఈసడింపు ఆధిపత్యవర్గ మితవాదుల నుంచి వినబడుతోంది. ఇందుకు వ్యతిరిక్త పరిస్థితి ఏమైనా వివేకశీలంగా ఉన్నదా అంటే, అదీ లేదు. ఆసేతుహిమాచలంలో ఎక్కడైనా సరే ఒక ముస్లింపై దాడి జరిగిన ప్రతిసారీ మైనారిటీలపై హిందూ రాజ్య పెత్తనాన్ని చెలాయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలయిన ఉత్తరప్రదేశ్, అసోంలలో తాలిబన్ విజయాల పట్ల హర్షామోదాలు వ్యక్తం చేస్తూ కన్పించిన వారిపై దేశద్రోహ కేసులు బనాయిస్తున్నారు! సరే, సామాజిక మాధ్యమాలలో విషపూరిత ప్రచారోద్ధృతులు మత సామరస్యాన్ని మరింతగా దెబ్బతీస్తున్నాయి. 


నిర్దాక్షిణ్యమైన లోకం పోకడలో సామాన్యులకు కానరాని కఠిన వాస్తవాలను బహిర్గతం చేయవలసిన అవసరముంది. తొలుత తాలిబన్ల మద్దతుదారుల వైఖరులను చూద్దాం. తాలిబన్ ఒక హింసాత్మక మిలీషియా. ప్రజాస్వామిక పద్ధతుల ద్వారా కాకుండా బలప్రయోగంతో తాలిబన్లు అధికారాన్ని సొంతం చేసుకున్నారు. ఇది ఎవరూ కొట్టివేయలేని సత్యం. పాశ్చాత్య అగ్రరాజ్యాలు కాబూల్‌లో ప్రతిష్ఠాపించిన కీలుబొమ్మ ప్రభుత్వాల పట్ల అఫ్ఘాన్ ప్రజలలో అత్యధికుల వ్యతిరేకతకు తాలిబన్ ప్రాతినిధ్యం వహిస్తోందని ఇస్లామిక్‌వాదుల ప్రగాఢ విశ్వాసం. అయితే ఇది సముచితం కాని భావనే కాకుండా అత్యంత ప్రమాదకరమైన విశ్వాసం. ‘అత్యధిక ప్రజల అభీష్టాన్ని’ తుపాకీ నిర్ణయించదు, నెరవేర్చదు. తాలిబన్ నాయకత్వంలో ప్రాబల్యం వహిస్తున్న పస్తూన్లకు, ఇతర తెగలు, మతాలకు చెందినవారిపై విచక్షణారహితంగా దాడులు, దౌర్జన్యాలకు పాల్పడే అధికారాన్ని ప్రజల సంకల్పం సమకూర్చదు.


ఇక్కడ ఒక చారిత్రక వాస్తవాన్ని నొక్కిచెప్పాల్సి ఉంది. గత శతాబ్ది తుది సంవత్సరాలలో కాబూల్ లోని తాలిబన్ ప్రభుత్వ దౌష్ట్యాలకు గురయింది వారి సహ మతస్థులైన ముస్లింలే. ఇది, తాలిబన్ల గురించిన రెండో వాస్తవం. రక్తస్తికమైన అఫ్ఘాన్ ఇటీవలి చరిత్రలో అత్యధికంగా అన్నివిధాలా నష్ట పోయింది కూడా ముస్లింలే. మరి ఇప్పుడు కాబూల్‌లో మళ్లీ అధికారాన్ని స్వాధీనం చేసుకున్నంత మాత్రాన తాలిబన్లు ‘పుణ్యపురుషులు’ అయిపోతారా? తొలిసారి అధికారంలో ఉన్నప్పుడు సహచర మతస్థులపై పాల్పడిన దురాగతాలకు బాధ్యత వారిదే కాదా? ఇస్లామిక్ సౌభ్రాతృత్వానికి వారు ప్రతినిధులు ఎలా అవుతారు? 


ఇస్లామిక్ షరియా నియమాలను అమలుపరచడంలో తాలిబన్లు కఠినంగా వ్యవహరించడం కద్దు. కనుక వారి పాపాలను క్షమించి తీరాలని కొంత మంది వాదిస్తున్నారు. ఈ వాదన శుద్ధతప్పు. ఇది తాలిబన్ల పునరుత్థానం గురించిన మూడో వాస్తవాన్ని వెల్లడిస్తోంది. కాలం చెల్లిన నైతిక నియమాలను బలవంతంగా అమలుపరచడం ప్రజాహిత పాలన ఎలా అవుతుంది? ముస్లింలు మైనారిటీవర్గంగా ఉన్న భారత గణతంత్రరాజ్యంలో రాజ్యాంగ బద్ధ లౌకికవాదాన్ని మీరు ఆమోదిస్తున్నారు, అనుసరిస్తున్నారు. మరి ముస్లింలు అధిక సంఖ్యాకులుగా ఉన్న అఫ్ఘానిస్తాన్‌లో షరియాను ప్రజలపై రుద్దడాన్ని మీరు ఎలా ప్రశంసిస్తారు. ఇదెలాంటి నైతికత? మరింత ముఖ్యమైన విషయమేమిటంటే తమ ప్రజలు, ముఖ్యంగా మహిళలు షరియా నియమాలను పాటించి తీరాలనే నిర్ణయాన్ని తీసుకునే ప్రత్యేకహక్కు లేదా విశేషాధికారాలను తాలిబన్లకు ఎవరి చ్చారు? వారిని సమర్థించేందుకు చేసే ఎలాంటి ప్రయత్నమైనా సరే ముస్లిం సమాజానికి తీరని హాని చేస్తుంది. ఇది స్పష్టం. భారత్, అఫ్ఘాన్‌ల లోని సమస్తపౌరులకూ దానివల్ల జరిగే అపాయం అంతా ఇంతకాదు. 


ఇక ఇప్పుడు తాలిబన్ల దురాగతాలకు భారతీయ ముస్లింలను బాధ్యులను చేస్తున్నవారి వైఖరులు, వాదనలు, తీరుతెన్నులను నిశితంగా చూద్దాం. తొలుత మనం గుర్తించవలసిన సత్యం: తాలిబన్ పునరుత్థానం మౌలికంగా అఫ్ఘానిస్తాన్ అంతర్గత వ్యవహారం. భారతదేశ అంతర్-–మత సంబంధాలతో ఆ పరిణామం ఏ విధంగానూ ముడివడిలేదు. తాలిబన్ల దౌష్ట్యాలకు వ్యతిరేకంగా భారతీయ ముస్లింలు మాత్రమే కాదు, ప్రతి భారతీయ పౌరుడూ మాట్లాడితీరాలి. ప్రజాస్వామిక స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను ఔదలదాల్చిన మనం తాలిబన్ల మతోన్మాద ఆగడాలను ఖండించకపోతే ఎలా? తాలిబన్ పునరుత్థానం ఒక ‘ముస్లిం’ పరిణామం కాదు; అఫ్ఘాన్‌లో సుస్థిర శాంతి సామరస్యాలను నెలకొల్పడంలో ప్రపంచదేశాల ఘోర వైఫల్యానికి అదొక తిరుగులేని తార్కాణం.


భారతీయ ముస్లింలు బహిరంగంగా తాలిబన్లను తిరస్కరించాలని పట్టుబడుతున్నవారు ఎలాంటి మతతత్వం లేని నిర్మలమైన అంతరాత్మతో చర్చకు రావాలి. ఇది రెండో ముఖ్యవిషయం. మనదేశంలో మైనారిటీలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత, హింసాత్మక కార్యకలాపాలను నిర్వహిస్తున్న సంఘ్‌పరివార్ అనుబంధ సంస్థ బజరంగ్‌దళ్‌ను సమర్థిస్తున్నవారు తాలిబన్‌ను బహిష్కరించాలని డిమాండ్ చేయడమేమిటి? ఇదెలా న్యాయబద్ధం? ముస్లింలపై చట్ట విరుద్ధంగా విచారణ జరిపి, అమానుష శిక్షలకు గురి చేస్తూ, గోరక్షణ, ‘లవ్ జిహాద్’, మత మార్పిడి వ్యతిరేక చట్టాల వత్తాసుతో ఆ చర్యలను సమర్థించుకుంటున్న వారు తాలిబన్లు మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారని గుండెలు బాదుకోవడమేమిటి? విశ్వ మానవహక్కులను అందరికీ సమానంగా వర్తింపచేయాలి. ఈ విషయంలో ఎలాంటి పాక్షిక దృక్పథమూ సమంజసం కాదు. తాలిబన్‌ను తిరస్కరించడమనేది తాలిబని మనస్తత్వ నిర్మూలనతో పాటు జరిగి తీరాలి. ‘భారత్ ఒక తాలిబన్ రాజ్యం కాదు. అయితే తమకుతాము నిఘా బృందాలుగా వ్యవహరిస్తున్నవారు తాలిబన్ పోకడలను పోలిన సంకుచిత మనస్తత్వాన్ని ప్రదర్శిస్తున్నారు’ అని ఇటీవల ఒక ఉన్నత న్యాయస్థానం తన ఆదేశంలోవ్యాఖ్యానించడం గమనార్హం. 


తాలిబన్ల నేరపూరిత చర్యలను ఎటువంటి మినహాయింపు లేకుండా ఖండిస్తూనే ఒక వాస్తవాన్ని మనం గుర్తించితీరాలి. తాలిబన్లకు ప్రతిఘటన అమెరికా నాయకత్వంలోని ప్రపంచసైనిక దళాల నుంచి కాకుండా స్థానిక అఫ్ఘాన్‌పౌరుల నుంచే ఎదురయిందన్నదే ఆ వాస్తవం. తాలిబన్లు దిగ్విజయంగా కాబూల్‌లో ప్రవేశించిన తరువాత బతుకుజీవుడా అంటూ అమెరికా సేనలు క్రమంగా నిష్క్రమిస్తుండగా సామాన్య అఫ్ఘాన్ స్త్రీపురుషులు తాలిబన్ల నుంచి ఎదురవుతున్న భీతావహ పరిస్థితులను ధైర్యసాహసాలతో సమర్థంగా ఎదుర్కొంటున్నారు. మరి ఈ సాహసవంతులు మనందరి మద్దతుకు అర్హులు కారా? యావత్ ముస్లింసమాజంపై విచక్షణారహితంగా మోపుతున్న అపవాదులలో సత్యం ఆవంత కూడా లేదన్న విషయాన్ని వారు తమ నిర్భీక, నిష్పాక్షిక ప్రవర్తనతో రుజువు చేయలేదా? 


ఈ వాస్తవాలు మనకు స్పష్టం చేస్తున్నదేమిటి? ఇస్లాం విద్వేషులు, తాలిబన్ మద్దతుదారులు ఇరువురినీ తిరస్కరించాలి. ఉదారవాద విలువల వ్యవస్థలను అనుసరించాలి. నైరాశ్యం ఆవహించిన వేళ భవిష్యత్తుపై పరిపూర్ణ నమ్మకాన్ని పాదుకొల్పేది ఆ నికార్సయిన ప్రజాస్వామిక సంప్రదాయాలు మాత్రమే. రాజకీయవేత్తలు, మతాచార్యులు తమ అనుయాయుల భయాలు, ఆందోళనల ఆధారంగానే తమ ప్రాభవాన్ని పదిలపరచుకోవడానికి ప్రయత్నిస్తారు. కొవిడ్ దురవస్థలు, వరదలు, ధరల పెరుగుదలతో దేశప్రజలు సతమతమవుతున్న ఆపత్కాలమిది. తక్షణ సమస్యలను పరిష్కరించలేక తాలిబన్ లాంటి ‘శత్రువు’పై ప్రజల దృష్టిని మళ్ళించేందుకు రాజకీయ నాయకులు తప్పక ప్రయత్నిస్తారు, ప్రయత్నిస్తున్నారు కూడా. వివేకవంతులు, వివేచనాశీలురైన భారతీయులందరూ ఈ కుటిల యత్నాలపై సమష్టిగా పోరాడాలి. 


తాజా కలం: న్యాయవేత్తలు, పాత్రికేయులు, నటులు, ప్రజాఉద్యమాల కార్యకర్తలతో సహా 140 మందికి పైగా ప్రముఖ భారతీయ ముస్లింలు ‘ఇండియన్ ముస్లిమ్స్ ఫర్ సెక్యులర్ డెమొక్రసీ’ వేదికపై తాలిబన్ల దురాగతాలకు వ్యతిరేకంగా తమ గళమెత్తారు. దురదృష్టవశాత్తు మీడియా ఈ వివేకశీలుర వాణికి ఎటువంటి ప్రాధాన్యమివ్వలేదు. అయితే కొంతమంది ముస్లిం పెద్దమనుషులు తాలిబన్‌ను సమర్థిస్తూ చేసిన ప్రకటనలు పతాకశీర్షికలయ్యాయి! ఆధిపత్య భావజాలంతో మీడియా ఎంతగా రాజీపడిందనే వాస్తవాన్నే కాకుండా విద్వేష ప్రసంగాలు, ప్రకటనలకు సువిశాల ప్రచారావరణం ఉందనే సత్యాన్ని కూడా ఆ పరిణామం రుజువు చేసింది.


రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్)

Updated Date - 2021-08-27T06:05:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising