బాల సాహిత్యకారుల పెద్ద బాలశిక్ష
ABN, First Publish Date - 2021-02-17T06:09:19+05:30
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత, విస్మృత చరిత్రను లిఖించుకుంటున్న సందర్భంలో కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారాన్ని...
నివాళి
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత, విస్మృత చరిత్రను లిఖించుకుంటున్న సందర్భంలో కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారాన్ని అందుకుని తెలుగు బాల సాహిత్యానికి, తెలంగాణకు పేరు తెచ్చిన అచ్చమైన పదహారణాల బాలల రచయిత వాసాల నరసయ్య. ఆయన గత శనివారం స్వస్థలమైన జగిత్యాల జిల్లా మెట్టుపల్లిలోని స్వగృహంలో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. దాదాపు ఐదున్నర దశాబ్దాలుగా సాహిత్య సృజన చేస్తున్న వాసాల నరసయ్య, బాలల కోసం ముప్పై పుస్తకాలు ప్రచురించారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను వింటున్న బాల సాహితీవేత్తల్లో వాసాల ఒకరు. 1955 నుంచి రచనలు చేస్తున్న ఆయన తెలుగు బాల సాహిత్యానికి తెరచాపగా వెలిగిన వారిలో ఒకరు. బాలల కోసం కథ, కవిత, గేయం, పొడుపుకథ రూపాల్లో తన రచనలు వెలువరించారు. ఇవాళ తెలుగులో బాల సాహిత్యం రాశిలోనూ, వాసిలోనూ విరివిగా వస్తోంది. అయితే ఆ సాహిత్యాన్ని, సృజియించే రచయితలకు అంతగా గుర్తింపు లేని సమయంలో దానినే తన ‘జెండా’గా పట్టుకుని నడిచిన వారు వాసాల. సాహిత్య ప్రపంచంలోకి అప్పుడప్పుడే అడుగులు వేస్తున్న నాలాంటి బుడిబుడి అడుగుల విద్యార్థులకు, బాల సాహిత్యకారులకు ఆయన అచ్చంగా ఒక ‘పెద్ద బాలశిక్ష’.
నేను ఇంకా పలకా బలపం పట్టని రోజుల్లోనే అగ్రేసర రచయితగా ఉన్న వాసాల నరసయ్య, నిన్నటి వరకు యువకులతో సమానంగా పిల్లల కోసం రచనలు చేయడం బాల సాహిత్యం పట్ల ఆయనకు ఉన్న ప్రేమ, నిబద్ధతకు నిదర్శనం. ఆ నిబద్ధతే ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. కవిగా, రచయితగా, విమర్శకునిగా, కావ్యకర్తగా, వివిధ సాహిత్య సాంస్కృతిక సంస్థల వ్యవస్థాపక కార్యకర్తగా ఆయన కరీంనగర్ ప్రాంతంలో సుపరిచితులు. బాల్యంలోనే తన సోదరులతో కలిసి వీథినాటకాల్లో నటించిన వాసాల, ఆయా నాటకాలకు స్క్రిప్టులను తానే స్వయంగా రాసుకునేవారట. అలా 1955లో ‘సౌగంధిక హరణం’ నాటక రచనతో మొదలైన ఆయన ప్రస్థానం, బాలసాహిత్యంలో చేసిన విశేషకృషికి సాహిత్య అకాడమీ పురస్కారం వరకు సాగింది. పద్యం, గేయం, వచన కవిత్వాన్ని సమానంగా ప్రేమించి సంపుటాలు వెలువరించినప్పటికీ 1997 నుంచి ఆయన పూర్తిగా బాల సాహిత్యానికి అంకితమై రచనలు చేశారు. కవితా సంపుటులతో పాటు నానీల సంపుటి కూడ వెలువరించారు. ‘మేధా సంపత్తి గల దేశ పౌరులు రూపుదిద్దుకోవడానికి బాల సాహిత్యమే పునాది’ అని నమ్మిన ఆయన ఆ దిశగానే రచనలు సాగించారు. తెలుగు పిల్లలందరినీ తన మనవలు, మనవరాళ్ళుగా భావించి వాళ్ళకోసం మేలిమి రచనల తాయిలం అందించారు. పిల్లల కోసం అరటిపండు ఒలిచి పెట్టినట్టు రాయడం అందరికీ సాధ్యం కాదు. ఆ విద్య వాసాలకు బాగా అబ్బింది. ఆయన రచనలతో పరిచయమున్న వాళ్ళకు అది తెలుసు. పాటలు, కథలు, వ్యాసాలు, పొడుపుకథలు, గేయకథలు వంటివి ఎన్నో పిల్లల కోసం రాశారు. కవిగా, రచయితగానే కాక తనకు నచ్చిన, తాను మెచ్చిన మేలిమి గేయాలను సంపాదకులుగా సంకలనం చేసి అందించారు. సమకాలికులపై గౌరవం ఉన్నవారు మాత్రమే అది చేయగలరు. అవేగాక ‘తెలంగాణ బాల సాహితీవేత్తలు’ పేరిట రాష్ట్రంలోని బాలసాహితీవేత్తలను పరిచయం చేసి ఒకచోట అందించారు. పన్నెండేళ్ళుగా తన పేరుతో ‘వాసాల నరసయ్య బాల సాహిత్య పురస్కారం’ ఇచ్చి బాల సాహితీవేత్తలను గౌరవించడం విశేషం. వాసాల అనేక రచనలు చేసినప్పటికీ, నాకు మాత్రం ఆయన రాసిన ‘స్ఫూర్తికథలు’, ‘పొడుపుకథలు’ ఎప్పటికీ గుర్తుంటాయి. కారణం వాటి స్ఫూర్తి అలాంటిది. దేశవిదేశాల్లోని ప్రముఖ వ్యక్తులు, మహనీయులు, శాస్త్రవేత్తలు, నేతల జీవితాలలోని స్ఫూర్తివంతమైన సంఘటనల కథలను అందులో అందించారాయన.
చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర వంటి తొలినాటి బాలల పత్రికల నుంచి ఇప్పటి పత్రికల వరకు వాసాల నరసయ్య రచనలు ప్రచురితమయ్యాయి. స్ఫూర్తికథలు (మూడు భాగాలు), అంజయ్య అరటితొక్క, రామయ్య యుక్తి, తపాలా ప్రపంచం, సమాజానికి సంకెళ్ళు, అనాచారాలు–అనర్థాలు, కార్డులు–కబుర్లు, చిరుతరంగాలు, గోగుపూలు, గులాబీలు, మల్లెమొగ్గలు వాసాల రచన, సంపాదకత్వంలో వచ్చిన కొన్ని రచనలు. బాలల కోసం ఆయన ప్రముఖుల జీవిత చరిత్రలను కూడ రాశారు.
వృత్తిరీత్యా హెడ్ పోస్ట్‌మాస్టర్‌గా పనిచేసి 2002లో పదవీ విరమణ పొందిన వాసాల తెలుగుతో పాటు హిందీ భాషలో నిష్ణాతుడు. జాతీయ స్థాయిలో జరిగిన పలు హిందీ అధ్యయన శిబిరాలు, కార్యశాలల్లో ఆయన పాల్గొన్నారు. బాలసాహిత్య రచనల పట్లనే కాక వాటి ముద్రణ, పంపిణీ వంటి విషయాల్లో వాసాలకు కచ్చితమైన అభిప్రాయాలున్నాయి. అందమైన రంగురంగుల బొమ్మల్లో బాలసాహిత్యం అచ్చుకావాలని, అప్పుడే అది పిల్లలకు నచ్చుతుందని ఆయన పలుమార్లు అనేవారు. వాసాల కేవలం రచనలు చేయడంతోనే సరిపెట్టుకోలేదు. వ్యక్తిత్వవికాసానికి దోహదపడేలా పిల్లల సాహిత్యం ఉండాలని, దేశభక్తి, మర్యాద, మన్నన, కుటుంబ విలువలు పెంపొందించేందుకు తోడ్పడాలని, సంస్కారంతో పాటు వ్యక్తులుగా క్రమశిక్షణ మానవీయ విలువలు పెంపొందించుకునే దిశగా తోడ్పడాలని కోరుకునేవారు.
తాను రాయగలిగినన్ని రోజులు కేవలం పిల్లల కోసమే రాసిన వాసాల నరసయ్య అకాడమీ అవార్డుతో పాటు, ప్రతిష్టాత్మక తెలుగు విశ్వవిద్యాలయం బాల సాహిత్య పురస్కారాన్ని, వివిధ సాహిత్య సాంస్కృతిక సంస్థల నుంచి గౌరవాలను, అవార్డులను అందుకున్నారు. అత్యంత అనారోగ్యదశలో, విజయవాడలో ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కారం అందుకున్న సమయంలో ఆయన ఆనందాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళలో నేనూ ఉన్నాను. రెండు, మూడు తరాలకు స్ఫూర్తిగా నిలిచిన వాసాల నరసయ్య తెలంగాణలో బాలసాహిత్యానికి చిరునామాగా వెలిగిన వారిలో ఒకరు. ఆయన మరణం తెలుగు బాలసాహిత్యానికి పూడ్చలేని లోటు. వాసాల లేకున్నా ఆయన స్ఫూర్తి మాత్రం కొనసాగుతూనే ఉంటుంది.
డా. పత్తిపాక మోహన్
Updated Date - 2021-02-17T06:09:19+05:30 IST