ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుసా!

ABN, First Publish Date - 2021-03-22T06:38:56+05:30

నీ భుజం మీదుగా ఎగురుతూ వెళ్లిన సీతాకోక ఎక్కడికి వెళ్లిందో తెలుసా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నీ భుజం మీదుగా ఎగురుతూ వెళ్లిన సీతాకోక

ఎక్కడికి వెళ్లిందో తెలుసా

దాని జ్ఞాపకం ఎగురుతోన్న ఈ క్షణంలో

ఏ పూల చుట్టూ తిరుగుతుందో ఊహించగలవా


బయట మొక్కలకుండీపై వాలిన ఎండ

నువు గదిలోకి వచ్చాక

ఆకులతో ఇంకా ఎంతసేపు సంభాషిస్తుందో తెలుసా

ఎండ సీతాకోకలా ఎగిరిపోయాక

ఆకుల కింది నీడల్లో యే కానరాని లోకాలు

    తెరుచుకుంటాయో ఊహించగలవా


నీ కళ్ళముందు బడిపిల్లల్లా కుదురుగా

ఆకాశంలో కూర్చున్న నక్షత్రాలు

కనురెప్పలు మూసిన క్షణంలో

ఎంత అల్లరి చేసి వుంటాయో

గబగబా చెదిరి, మళ్లీ కుదురులోకి వచ్చి ఉంటాయో

తెలుసుకోగలవా, పోనీ, ఊహించగలవా


ఈ లోకంలోకి రాకముందు

కాలం నిన్ను తెరిచింది ఏ యుగంలోనో తెలుసుకోగలవా

దీనినుండి వెళ్ళిపోయాక

ఆకాశం నిన్ను దాచేది ఏ తలంలోనో

ఊహించగలవా


అనంతమైన కొలతలతో

అలల్లా ఎగసిపడే సృష్టి ఇది

దీనిలోకి వెలుతురు పుట్టినట్టు పుట్టి

చీకటి పుట్టినట్టు వెళ్లిపోతావు

లేదా, నీలో ఇది చీకటి పుట్టినట్టు పుట్టి

వెలుతురు పుట్టినట్టు వెళ్ళిపోతుంది


వెలుగునీడల మసకచీకట్ల మాయాజాలంలో

నిజంగా ఉన్నదేమిటో, నిజంగా

లేనిదేమిటో

నిజం కాకున్నా ఉండీ,

లేనట్లున్నదేమిటో

ఎప్పటికైనా తెలుసుకోగలవా, ఊహించగలవా!

బివివి ప్రసాద్‌

90320 75415

Updated Date - 2021-03-22T06:38:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising