ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘బండ’ బాధలు

ABN, First Publish Date - 2021-08-19T07:29:34+05:30

వంటగ్యాస్‌ ధర మరో పాతికరూపాయలు పెరిగింది. గతనెల ఒకటో తేదీన కూడా ఇలాగే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వంటగ్యాస్‌ ధర మరో పాతికరూపాయలు పెరిగింది. గతనెల ఒకటో తేదీన కూడా ఇలాగే ఓ పాతిక రూపాయలు పెరిగినందున, నెలన్నరలో యాభై రూపాయలమేర హెచ్చినట్టు. కేవలం ఈ ఏడాదిలో సిలండరు ధర నూట అరవైఐదు రూపాయల మేరకు పెరిగింది. ఇప్పుడు సబ్సిడీగ్యాసుకూ, అది లేనిదానికీ ధరలో పెద్ద తేడా లేదు. 2014లో నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడిననాటికి సిలండరు ధర నాలుగువందల పదిరూపాయలు. ఏడేళ్ళలో ధర రెట్టింపు దాటిందని కాంగ్రెస్‌ గుర్తుచేస్తోంది. 


ఇది ప్రజావ్యతిరేకమనీ, ధరలు తగ్గించాలనీ విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. మిగతా ప్రజల మాట అటుంచినా, ప్రధానమంత్రి ప్రేమగా చూసుకొనే తన ఉజ్వల్‌యోజన పథకం లబ్ధిదారులైనా ఇలా సబ్సిడీ కరిగిపోతూ ధరలు పెరిగిపోతున్న బండలను భరించగలరా? మూడేళ్ళక్రితం ఈ పథకాన్ని ప్రకటించినప్పటికంటే ఈ కరోనాకాలంలో కనీసం 90శాతం మంది ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారినమాట నిజం. జీరో డిపాజిట్లు, ఉచిత తొలిసిలండరు, గరీబీయోజన నుంచి కాస్త మద్దతు తదితర వెసులుబాట్లు ఎన్ని ఉన్నప్పటికీ, కనీసం సగం మంది లబ్ధిదారులు రెండవ సిలండరు జోలికిపోలేదని పార్లమెంటుకు సమర్పించిన వివరాల్లో ప్రభుత్వమే పేర్కొంది. అప్పట్లో ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల నేపథ్యంలోనే ఈ పథకాన్ని ఆరంభించిన ప్రభుత్వం ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పథకం రెండోదశను ప్రధాని ఇటీవలే ప్రకటించారు. ప్రభుత్వం అంటున్న సబ్సిడీ మాట ధరలో ప్రతిఫలించడం లేదు. సబ్సిడీయేతర సిలండరు ధర కూడా దీనితో దాదాపు సమానమైపోయినప్పుడు ప్రయోజనం ఏమిటి? ఇటువంటి స్థితిలో గ్యాస్‌ధర భరించలేనివారు తిరిగి కర్ర పొయ్యిలు, బొగ్గుకుంపట్లవైపు మరలిపోరా? అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. 


సబ్సిడీలు ఎత్తివేయడం, మరిన్ని పన్నులు వడ్డించడం ఒక విధానంగా అమలు జరుగుతోంది. చమురు ధరలు అనతికాలంలోనే మూడంకెలు దాటేశాయి. మరీముఖ్యంగా పెట్రోల్‌ను భరించడం సామాన్యుడివల్ల కావడం లేదు. కేవలం ఆదాయం కోసం ప్రభుత్వాలు చమురు ధరను కృత్రిమంగా నిలబెడుతున్న మాట నిజం. తమిళనాడు ప్రభుత్వం లీటరుపై మూడురూపాయల పన్ను తగ్గించడం ద్వారా కోట్లాదిమంది మధ్యతరగతి ద్విచక్రవాహనదారులకు ప్రత్యక్ష ప్రయోజనంతో పాటు, మొత్తం ఆర్థికవ్యవస్థలో చురుకుదనం తెచ్చే ప్రయత్నం చేస్తున్నానని అంటున్నది. చమురు ధర తగ్గడం వల్ల ఇతరత్రా రూపాల్లో ఖజనాకు మరింత మేలు చేకూరుతుందని ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి అంటున్నారు. చమురు ధరల పాపం పూర్తిగా కేంద్రానిదేకాదనీ, వివిధరూపాల్లో సొమ్ము చేసుకుంటున్న రాష్ట్రాలు కూడా ప్రజలను ఆదుకోవచ్చునని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల అన్యాపదేశంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం మాత్రం చమురుమీద సుంకాలు తగ్గించబోదని ఆమె తేల్చేశారు. గత యూపీఏ ప్రభుత్వం ఇంధన ధరలకు సంబంధించి భారీ సబ్సిడీలు ఇచ్చిందనీ, ఇంధనం కొనుగోలు–అమ్మకం ధరల్లో ఉన్న వ్యత్యాసాన్ని ఆయిల్‌ కంపెనీలు తట్టుకొనేందుకు వీలుగా యూపీఏ ప్రభుత్వం జారీచేసిన చమురు బాండ్లపై వడ్డీకట్టాల్సి వస్తున్నదని అంటున్నారు. ఏటా పదివేల కోట్ల వడ్డీభారం మాట అటుంచితే, అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పతనమైన స్థితిలో సైతం కేంద్రప్రభుత్వం స్థానికంగా ధరలు తగ్గనివ్వకుండా మరిన్ని పన్నులు వేసి వేలకోట్లు నొల్లుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రాలు ఒప్పుకుంటే చమురు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తామని కేంద్రం పైకి చెబుతున్నప్పటికీ, కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు కలసికట్టుగా ఆ పనిజరగనివ్వడం లేదు. చమురుభారంనుంచి సామాన్యుడిని రక్షించేందుకు అంతా బాగున్నరోజుల్లోనే మనసురాని రాష్ట్రాలు ఈ కరోనాకాలంలో అంత గొప్పమనసు చేసుకుంటాయని ఎలాగూ అనుకోలేం. మహమ్మారినీ, దాని ఇతరత్రా పర్యవసానాలనూ భరించాల్సింది అంతిమంగా సామాన్యుడే.

Updated Date - 2021-08-19T07:29:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising