గుత్తాధిపత్యాలకు ఎర్రతివాచీ!
ABN, First Publish Date - 2021-08-28T05:55:25+05:30
ఒకపెద్ద అసత్యం బహిర్గతమయింది. కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ జాతికి ఆర్థికపుష్టిని పెంపొందించే ఏ పనినీ చేయలేదు, ఎలాంటి నిర్మాణాన్నీ చేపట్టలేదని’ అని గత ఏడు సంవత్సరాలుగా నరేంద్ర మోదీ...
ఒకపెద్ద అసత్యం బహిర్గతమయింది. కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ జాతికి ఆర్థికపుష్టిని పెంపొందించే ఏ పనినీ చేయలేదు, ఎలాంటి నిర్మాణాన్నీ చేపట్టలేదని’ అని గత ఏడు సంవత్సరాలుగా నరేంద్ర మోదీ, ఆయన మంత్రులు గుండెలు బాదుకుంటున్నారు, గొంతులు చించుకుంటున్నారు. కాంగ్రేసేతర ప్రభుత్వాలలో వాజపేయి సర్కార్ కూడా ఉందనే నిజాన్ని వారు ఎలా విస్మరించారో చిత్రంగా ఉంది. 2014 మేలో మాత్రమే భారతదేశం స్వాతంత్ర్యం పొందిందన్నట్లుగా ప్రభుత్వ పెద్దలు మాట్లాడారు. 2021 ఆగస్టు 23న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ‘మానిటైజేషన్’ (ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం) చేసేందుకు ప్రతిపాదించిన ఆస్తుల జాబితాను విడుదల చేశారు. అయితే ఆ ఆస్తులు ఎప్పుడు నిర్మాణమయ్యాయో, సంచితమయ్యాయో వెల్లడించడంలో ఆమె విఫలమయ్యారు. ఆ సిరిసంపదలను మోదీ ప్రభృతులు దుయ్య బట్టిన ఏడు దశాబ్దాల లోనే మన ప్రజలు, నాయకులు సృష్టించారు.
ప్రైవేట్ సంస్థలకు అప్పగించదలిచిన ఆస్తుల జాబితాలో, 27వేల కిలోమీటర్ల రోడ్లు, 28,698 సికెటి కిలోమీటర్ల విద్యుత్ పంపిణీ సంబంధిత ఆస్తులు, 6000 మెగా వాట్ల థర్మల్, సౌర విద్యుదుత్పాదన ఆస్తులు, 8154 కిలోమీటర్ల సహజవాయువు పైప్‌లైన్స్, 3930 కిలోమీటర్ల పెట్రోలియం ఉత్పత్తుల పైప్‌లైన్, 2,10,00,000 మెగాటన్నుల గిడ్డంగులు, 400 రైల్వేస్టేషన్లు, 90 ప్యాసింజర్ రైళ్ల నిర్వహణ కార్యకలాపాలు, 265గూడ్స్ షెడ్స్, కొంకణ్ రైల్వే, 2,86,000 కిలోమీటర్ల ఫైబర్, 14,917 టెలికాం టవర్లు; 25 విమానాశ్రయాలు, 9 ప్రధాన ఓడరేవులు, 2 జాతీయస్టేడియాలు ఉన్నాయి.
ఒక్క కలంపోటుతో ప్రభుత్వరంగ సంస్థల సమస్త ఆస్తులను ఇంచుమించు సంపూర్ణంగా లుప్తం చేసేందుకు ప్రధానమంత్రి, ఆయన ఆర్థిక మంత్రి సమకట్టారు. ప్రైవేట్‌సంస్థలకు అప్పగించనున్న ఆస్తులపై ఏటా రూ.1,50,000 కోట్ల ఆదాయం ‘అద్దె’ రూపేణా సమకూరనున్నదని ప్రభుత్వ పెద్దలు ఆనందభరితులవుతున్నారు. ఆస్తులు ప్రైవేట్‌వ్యక్తులు, ప్రైవేట్‌సంస్థల అధీనంలోకి వెళ్ళిపోయినప్పటికీ వాటి అసలైన ‘యజమాని’ ప్రభుత్వం మాత్రమేనని ప్రధానమంత్రి, ఆయన మంత్రులు భావిస్తున్నారు. అదే మాట వారు గట్టిగా చెబుతున్నారు. బదిలీ కాలపరిధి ముగిసినప్పుడు ధర మందగించిన ఆస్తులన్నీ మళ్ళీ ప్రభుత్వ పరమవుతాయని కూడా అంటున్నారు. నిజమేనా? ఇది, ‘నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్’ (ఎన్‌ఎమ్‌పి)లోని ఒక కీలకాంశం. అంతేకాదు, ఒక చిక్కుప్రశ్న కూడా.
ప్రభుత్వరంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ విధానం ఒక్కసారిగా ఉనికిలోకి రాలేదు. అనేక సంవత్సరాలుగా అది రూపు దిద్దుకుంది. 1991 నుంచి అన్ని ప్రభుత్వాలు ఆ విధానంలో మార్పులుచేర్పులు చేస్తూ దాన్ని మెరుగుపరిచారు ప్రైవేటీకరణ లక్ష్యం ఆదాయాన్ని పెంచుకోవడం మాత్రమే కాదు. మూలధన పెట్టుబడుల పెంపుదల, నవీన సాంకేతికతలను సమకూర్చుకోవడం, మార్కెట్ల విస్తరణ, ఉద్యోగాల సృష్టి మొదలైనవి కూడా ఆ విధానప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి.
ఏ సంస్థలను ప్రైవేటీకరించాలి? ఏ సంస్థలను ప్రైవేటీకరించకూడదు? అనే విషయమై కూడా నిర్దిష్ట ప్రమాణాలను నిర్దేశించుకోవడం జరిగింది. అవి: (1) వ్యూహాత్మక రంగంలోని ప్రభుత్వరంగ సంస్థ (పిఎస్‌యు)లను ప్రైవేటీకరించకూడదు. అణు ఇంధనం, రక్షణఉత్పత్తులు, రైల్వేస్, వ్యూహాత్మక ఓడరేవులు మొదలైనవి వీటికి ఉదాహరణలు. (2) పూర్తిగా కష్టాల్లో కూరుకుపోయిన సంస్థలను ప్రైవేటీకరించాలి. (3) మార్కెట్‌లో తన ఉత్పత్తులకు కనిష్ఠవాటా మాత్రమే ఉన్న పిఎస్‌యులను ప్రైవేటీకరించాలి. (4) మార్కెట్‌లో పోటీని పెంపొందించగల పిఎస్‌యును ప్రైవేటీకరించవచ్చు. అలా కాకుండా అది గుత్తాధిపత్యాన్ని పెంపొందించేందుకు దోహదం చేసేదయితే దాన్ని ప్రైవేటీకరించకూడదు.
నరేంద్రమోదీ ప్రభుత్వం ఈ ప్రమాణాలను యమునానదిలో నిమజ్జనం చేసింది. ప్రత్యామ్నాయ ప్రమాణాలు వేటినీ ప్రకటించనే లేదు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే రైల్వేస్‌ను వ్యూహాత్మకరంగ సంస్థల జాబితా నుంచి తొలగించారు! ఇప్పుడు దాన్ని మౌలికేతర రంగ ఆస్తిగా వర్గీకరించారు. అయితే బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ తదితర మార్కెట్ ఆర్థికవ్యవస్థలు రైల్వేస్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తున్నాయి.
ఎన్‌ఎమ్‌పి అనివార్యంగా కీలకరంగాలైన నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, సౌరశక్తి, టెలికాం, సహజవాయువు పైప్‌లైన్, పెట్రోలియం పైప్ లైన్, గిడ్డంగులు మొదలైన వాటిలో గుత్తాధిపత్యాలకు దారితీస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి భయాలు నిర్హేతుకమైనవి కావు. ఆర్థిక కార్యకలాపాలలో ప్రైవేట్‌రంగానికి ప్రాధాన్యమిచ్చే విధానాలను మనదేశం గత ముప్పై ఏళ్లుగా మాత్రమే అనుసరిస్తోంది. పారిశ్రామిక, సేవల రంగాలలో సదరు విధానాలు గుత్తాధిపత్యాలకు దారితీస్తున్నాయి. మొదటి నుంచీ పెట్టుబడిదారీ విధానాలనే అనుసరించిన ఆర్థికవ్యవస్థలు గుత్తాధిపత్యాల ఆవిర్భావం పట్ల ఆందోళన చెందుతున్నాయి. అమెరికాయే ఇందుకొక ఉదాహరణ. గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్ మొదలైన సంస్థల గుత్తాధిపత్యాన్ని అరికట్టేందుకు తీసుకురావలసిన చట్టాలు, చేపట్ట వలసిన చర్య విషయమై అమెరికా కాంగ్రెస్, ప్రభుత్వం చర్చలు జరుపుతున్నాయి. ఇక చైనా సైతం క్రమబద్ధీకరించలేని స్థాయిలో పెరిగిపోయిన టెక్నాలజీ కంపెనీలు కొన్నిటిపై చర్యలు చేపడుతోంది. సరిగ్గా ఇందుకు విరుద్ధ మార్గంలో దేశాన్ని తీసుకువెళ్ళేందుకు ఎన్‌ఎమ్‌పి హామీ ఇస్తోంది!
మరో ముఖ్యమైన విషయమేమిటంటే ప్రైవేట్‌రంగానికి అప్పగించనున్న ప్రభుత్వరంగ సంస్థలలో ఉద్యోగాలు, రిజర్వేషన్ల విషయమై ఎటువంటి స్పష్టత లేదు. సదరు సంస్థలలోని ఉద్యోగాలను యథాతథంగా కొనసాగిస్తారా? వాటి సంఖ్యను మరింతగా పెంచుతారా? ప్రభుత్వరంగ సంస్థలలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కల్పించిన రిజర్వేషన్లను కొనసాగిస్తారా లేక రద్దుచేస్తారా? అసలు ఎన్‌ఎమ్‌పి విషయంలో నరేంద్రమోదీ ప్రభుత్వం ఎందుకు నిగూఢంగా వ్యవహరిస్తోంది? ఎన్‌ఎమ్‌పిపై ముసాయిదా పత్రం లేదు. సంబంధిత వ్యక్తులతో ముఖ్యంగా ఉద్యోగులు, కార్మికసంఘాలను సంప్రదించడం జరగనేలేదు. పార్లమెంటులో చర్చలు జరపలేదు. ఇకముందైనా చర్చలు జరిగేందుకు ఆస్కారం లేదు ఎన్‌ఎమ్‌పికి సంబంధించిన విధానాన్ని రహస్యంగా రూపొందించి ఆకస్మికంగా ప్రకటించారు. ఎన్‌ఎమ్‌పిని ప్రశంసించేలా మీడియాను ప్రభుత్వమూ, ప్రైవేట్ పరిశ్రమల అధిపతులూ ముందుగానే తగురీతిలో ప్రోద్భలించారు. ఇక మహాముగింపు అమ్మకాలకు సంసిద్ధమవ్వండి. అలాగే గుత్తాధిత్యాలను స్వాగతించేందుకూ సిద్ధంగా ఉండండి.
పి. చిదంబరం
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు)
Updated Date - 2021-08-28T05:55:25+05:30 IST