ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తొలి నవీన భారతీయుడు

ABN, First Publish Date - 2021-01-08T06:24:44+05:30

ఈనాడు మన జాతికి ఏ ఆధునిక దృష్టికలదంటే, మన దేశంలో ఆధునిక విజ్ఞానం ప్రబలినదంటే అది రాజా రామమోహన్ రాయ్ ప్రేమతో మనకు పెట్టిన భిక్షే! అందువలనే టాగోర్ ఆయనను ‘భారతదేశంలో తొలి ఆధునిక...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈనాడు మన జాతికి ఏ ఆధునిక దృష్టికలదంటే, మన దేశంలో ఆధునిక విజ్ఞానం ప్రబలినదంటే అది రాజా రామమోహన్ రాయ్ ప్రేమతో మనకు పెట్టిన భిక్షే! అందువలనే టాగోర్ ఆయనను ‘భారతదేశంలో తొలి ఆధునిక మానవుడు’గా కీర్తించాడు!


షేక్స్పియర్‌ను మహాకవిగా టాల్‌స్టాయ్ గుర్తించనట్టే రాజా రామమోహన్ రాయ్‌ని మహాపురుషుడుగా గాంధీజీ గుర్తించలేదు. రాయ్ ఘనతను గుర్తించలేనివారు మరి కొందరు కూడా లేకపోలేదు. పాషండుడని, సగం క్రైస్తవుడని, భారతీయ సంస్కృతి పట్ల ద్రోహం తలపెట్టినవాడని ఆయనను వారు తెగనాడారు. అయితే వారైనా ఆయనను, గాంధీ వలె ‘అంగుష్ఠ మాత్రుని’ (పిగ్మీ)గా అభివర్ణించలేదు. దుష్టులలో మహాదుష్టుడుగానైనా ఆయన ఘనతను వారు గుర్తించారు.


రామమోహన్ రాయ్‌పై గాంధీజీ విసిరిన విసురు టాగోర్‌కు కోపం తెప్పించింది. బాధ కలిగించింది. ఆయన హృదయాన్ని బలంగా గాయపరిచింది. ‘భారతదేశంలో తొలి ఆధునిక మానవుడు’గా తాను సంభావిస్తున్న విప్లవకారుని, విశిష్ట మానవుని, విశ్వ కల్యాణ కాంక్షిని అంగుష్ఠమాత్రునిగా విమర్శించడం దుస్సహం కాగా, గాంధీజీని ఖండిస్తూ టాగోర్ ఒక పెద్ద ప్రకటన చేశాడు. అందుపై వారిద్దరి మధ్య తర్జన భర్జనలు తీవ్రంగా జరిగాయి. ఆ వాద ప్రతివాదాల తర్వాత కూడా రాయ్ విషయంలో స్వాభిప్రాయాన్ని గాంధీజీ మార్చుకొనకపోయినా సత్యం వలె చరిత్ర కూడా టాగోర్ పక్షాన ఉన్నదని నిష్పాక్షికులందరి తీర్పు. రాయ్ అంగుష్ఠ మాత్రుడు కాడు, ఆయన ఆకాశాన్ని అంటగలపాటి మహోన్నతుడు! 


సమకాలిక సంఘం ఎంతగా ప్రతిఘటించినా, తనను హతమార్చడానికై ఎందరెంతగా ప్రయత్నించినా వెనుదీయక , రామమోహన్ రాయ్ సాధించిన ముఖ్య సంస్కరణలలో మొట్ట మొదటిది ఏకేశ్వరోపాసనతో కూడిన కొత్త మతాన్ని నెలకొల్పడం. రెండవది సతీసహగమనాన్ని బహిష్కరింపచేయడం. మూడవది సంస్కృత పాఠశాలల స్థానంలో ఇంగ్లీషు బోధనా భాషగా గల విద్యాలయాలను స్థాపింప జేయడం. 


సంస్కృత భాష గొప్పదే కావచ్చు. దాన్ని నమ్ముకొంటే భారతదేశం ఆధునిక యుగంలో పాదం పెట్టడం కల్ల. ఈ పరమ విశ్వాసంతో ఇంగ్లీషు బోధనా భాషగా గల విద్యాలయాల సంస్థాపనకై నిరంతరాందోళన చేసి, తన వాదాన్ని రాయ్ నెగ్గించుకోగలిగాడు. ఈనాడు మన జాతికి ఏ స్వల్పంగానైనా ఆధునిక దృష్టికలదంటే, మన దేశంలో ఏ స్వల్పంగానైనా ఆధునిక విజ్ఞానం ప్రబలినదంటే అది ఆయన ప్రేమతో మనకు పెట్టిన భిక్షే! అందువలనే టాగోర్ ఆయనను ‘భారతదేశంలో తొలి ఆధునిక మానవుడు’గా కీర్తించాడు!


1964 మే 24 ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకీయం

‘యుగకర్త: శ్రీరాజారామమోహన్ రాయ్’ నుంచి


ఆంధ్రజ్యోతి వ్యవస్థాపక సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావు సంపాదకీయాలలోని కొన్ని భాగాలను ఆయనకు నివాళిగా ఏడాది కాలంగా ఇస్తున్నాం. నార్లవారికి మరోసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ శీర్షికను ఇంతటితో ముగిస్తున్నాం.

– ఎడిటర్

Updated Date - 2021-01-08T06:24:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising