ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జల రాజకీయాల్లో ప్రజలే పావులు

ABN, First Publish Date - 2021-06-30T06:42:17+05:30

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై 2020 మేలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జీవో 203 విడుదల చేసిన తరవాత అప్పటివరకు ఏడాది కాలంగా అలాయ్ బలాయ్ ఆడిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై 2020 మేలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జీవో 203 విడుదల చేసిన తరవాత అప్పటివరకు ఏడాది కాలంగా అలాయ్ బలాయ్ ఆడిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ ఒకరి నిర్ణయాలను ఒకరు తప్పుబడుతూ, తమ ప్రాంత ప్రజల ఛాంపియన్లుగా ముందుకు వచ్చారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పరస్పరం కె.ఆర్.ఎం.బి, అపెక్స్ కౌన్సిలుకు ఫిర్యాదులు చేసుకున్నాక, ఇరువురూ ఆ సంగతిని మరిచారు. మరలా కేసీఆర్‌కు ఇప్పుడున్న ప్రతికూల రాజకీయ వాతావరణంలో ప్రజలు గుర్తుకొచ్చారు. జలవివాదం మరలా రచ్చకెక్కింది. విభజన చట్టం, కె.ఆర్.ఎం.బి (దీనికి అధికారాలే లేవు), అపెక్స్ కౌన్సిల్ నియమనిబంధనలు గుర్తుకొచ్చాయి. వాస్తవంలో వాటిని ఇరు రాష్ట్రాలూ ఉల్లంఘిస్తూనే ఉన్నాయి. ప్రజల నుంచి వాస్తవ పరిస్థితులను దాచి వారి ఇబ్బందులకు తమ పరిపాలన కారణం కాదని, ఇతర ప్రాంతాలవారు బాధ్యులని మభ్యపెట్టడం పాలకులకు మామూలు విషయమే. ప్రజల మధ్య వైరుధ్యాలు సృష్టించి తమ పాలనను సుస్థిరం జేసుకోవడం మన రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య.


అసలు విషయానికొస్తే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలూ నియమనిబంధనలను తుంగలో తొక్కాయి. తాము చేపడుతున్న ప్రాజెక్టులకు సంబంధించిన ప్రాజెక్ట్ నివేదికలను కె.ఆర్.ఎం.బి, అపెక్స్ కౌన్సిళ్ళకు సమర్పించలేదు. తెలంగాణలో అటు పాలమూరు - రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులతో సహా ఆరు ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతీ లేదు. ఇటు, రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు కాలవల వెడల్పు పెంచడం, విడుదల సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచడం... వీటిలో దేనికి ఆంధ్రప్రదేశ్‌కు అనుమతులు లేవు. చివరకు ఆర్డీఎస్ కుడి కాలువకు బ్రిజేష్ కుమార్ కేటాయించిన 4 టీఎంసీల నీటి వాడకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నిస్తున్నది. అయితే, అదే సమయంలో బచావత్ నివేదిక అమలులో ఉన్నందున మిగులు జలాలను వాడుకునే స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్‍కు ఉందన్న విషయాన్ని మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మరచింది. 


రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించి గత రెండేళ్ల చరిత్రను పరిశీలిస్తే వారి నిజస్వరూపం బయటపడుతుంది. 2019 ఎన్నికల ముందు, తెలంగాణలో చేపడుతున్న నూతన సాగునీటి పథకాల వల్ల కృష్ణా డెల్టా (రాయలసీమ కాదు) ఎడారి అవుతుందని కర్నూలులో (విజయవాడలో కాదు) జగన్ మూడు రోజుల నిరసన దీక్ష చేసి తాను కోస్తా సంపన్న రైతాంగానికి విధేయుడనని ఋజువు చేసుకున్నారు. అప్పుడు జగన్ సీమ అవసరాలను విస్మరించాడనీ, ఆ నిరసనను విజయవాడలో చేపట్టవలసిందనీ విమర్శిస్తూ సీమ ప్రజాసంఘాలు జగన్‌కు వ్యతిరేకంగా నిరసన దీక్ష చేశాయి. ఆయన పదవిలోకి వచ్చాక చాలాకాలం ఆ ఊసే మరచిపోయి కేసీఆర్‌ను కౌగలించుకున్నారు. కేసీఆర్ కూడా తక్కువేమీ తినలేదు. కృష్ణా-గోదావరి అనుసంధానం అన్నారు. రాయలసీమను సస్యశ్యామలం చేయడంలో సహకారం అందిస్తానన్నారు. కానీ, ఇప్పుడు రాజకీయ పరిస్థితులు ఇబ్బందికరంగా మారేటప్పటికి, అకస్మాత్తుగా ప్రజలు గుర్తుకొచ్చారు. వారిని మభ్యపెట్టడానికి ఆంధ్రప్రదేశ్‍లో అక్రమ సాగునీటి పథకాల చిట్టాను వెలికితీశారు. జగన్ కూడా అంతే. ఏదో ఒకటి చేశానన్నట్టు, కనీసం చేస్తున్నట్టు ప్రచారం కోసం రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు కాలవల వెడల్పు పెంచడం, విడుదల సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచడం లాంటివి ముందుకు తెచ్చాడు. వీటికి నిధులు లేవు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, తద్వారా ఋణాలు సేకరించి, కేవలం 600 కోట్ల రూపాయలతో సిద్దేశ్వరం అలుగును నిర్మించి, వాలు ద్వారా కృష్ణా జలాలను తీసుక్కునే అవకాశం ఉండగా, 4000 కోట్ల రూపాయలతో ఎత్తిపోతల ద్వారా నీటిని తోడుకునే ప్రయత్నాన్ని జగన్ చేయడం ఎవరి లబ్ధి కోసమో? 


ఏతావాతా, కరువు పీడిత ప్రాంత ప్రయోజనాల పేరుతో తమ రాజకీయ ప్రయోజనాలను సంరక్షించుకునే ప్రయత్నాలు ఇవన్నీ. సీమ ప్రజల సాగు తాగునీటి సరఫరాకు అసలు అడ్డంకి గత పాలకులు తెచ్చిన జీవో 69. ఆ జీవో లోని రూల్స్ ఆఫ్ ఆపరేషన్ రూల్ 1(సి)iv ప్రకారం శ్రీశైలం రిజర్వాయరులో నీటిమట్టం 854 అడుగుల కన్నా తక్కువ ఉంటే No Release to Telugu Ganga Project, SRBC AND SLBC అనే నిబంధన ఉంది. దాంతోపాటు, శ్రీశైలం రిజర్వాయరులో కనీస నీటిమట్టం 854 నుండి 834 అడుగులకు కుదించటం సీమ ప్రయోజనాలకు శరాఘాతమే. గతంలో, తెలంగాణ ప్రాంత ప్రముఖ జలనిపుణులు విద్యాసాగర్ రావు, రాజకీయ నాయకుడు జూపల్లి కృష్ణారావు దీనిపై, జూలై 11, 2012 న పిల్ వేశారు. తర్వాత దాన్నెవ్వరూ పట్టించుకోలేదు. దాంతో నీటిమట్టాన్ని 790 అడుగులకు తగ్గించారు. ఈ విధంగా నీళ్ళు తోడటం వల్ల కేవలం సీమకే కాదు ఎస్.ఎస్.బి.సి కి కూడా నష్టం జరుగుతుందనే విషయాన్ని తెలంగాణవాదులు గమనించాలి. 


గత 34 సంవత్సరాల్లో శ్రీశైలం జలాశయంలో సంవత్సరానికి సగటున 976 టీఎంసీలకు పైగా కృష్ణాజలాలు చేరినట్టు తెలుస్తోంది. కేటాయింపులు 599టీఎంసీలు కాగా, అందులో నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువల కోసం, కృష్ణా డెల్టా కోసం వదలవలసిన నీరు మొత్తం 344 టీఎంసీలు మాత్రమే. కానీ నాగార్జునసాగర్‍కు అదే కాలంలో విడుదల అయ్యింది 937.37 టీఎంసీలు. అంటే అదనంగా దాదాపు 600 టీఎంసీలు. మరి ఈ అదనపు నీటిని మహబూబ్ నగర్, నల్గొండ, సీమ జిల్లాలకు తరలిస్తే అభ్యంతర పెట్టేవారెవరు? ఒకర్ని ఒకరు దొంగలని నిందించుకుంటూ ప్రజల్ని మభ్యపెడుతున్న ప్రభుత్వాలు నిజాలను దాస్తున్న మోసకారులు కాదా? ఇక, సముద్రం పాలవుతున్న నీళ్ళ మాటేమిటి? గత 34 సంవత్సరాల్లో ఏటా 500 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రం పాలవుతున్నాయే! వాటిని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు వినియోగించుకోలేకపోయాయి? ప్రజల పట్ల తమ బాధ్యతారాహిత్యాన్ని దాస్తూ ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్న నాటకాలివి. 


కె.ఆర్.ఎం.బి, అపెక్స్ కౌన్సిళ్లు కోరలు లేని పాములు. అవేమీ చేయలేవు. ఫిర్యాదులు స్వీకరించడం, నిలుపుదల చేయమని ఉత్తరాలు రాయడం. పిల్లీ పిల్లీ తగువులాడుకుంటే కోతి పరిష్కారం చూపినట్టు, రెండు రాష్ట్రాల తగవు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోతుంది. కమలనాథులకు కావలసింది అదే. వాళ్ళూ సాగదీసి సాగదీసి జగన్, కేసీఆర్‌ల విధేయతకు పరీక్ష పెడుతారు. మరలా ఎన్నికలు దగ్గరికి వస్తాయి. మరలా సాగునీటి పథకాల నిర్మాణం ఎజెండాగా ప్రజల ముందుకు వస్తుంది. ప్రజలు మాత్రం అటు ఆకాశం వైపో, ఇటు ప్రభుత్వం వైపో చూస్తూనే ఉంటారు. 


సమస్య అన్నాక పరిష్కారం ఉండక మానదు. పోతే ఇరు రాష్ట్రాల నాయకులకు ప్రజల ప్రయోజనాల పట్ల చిత్తశుద్ధి ఉండాలి. తమ ప్రాజెక్టుల వివరాలు సంబంధిత సంస్థలకు పంపి, వాటి నిర్ణయాలు వెంటనే వెలువడేలా చూడాలి. అంతవరకు నిర్మాణాలు ఆపాలి. జీవో 69ను రద్దు చేయాలి. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణాడెల్టాకు తరలిస్తున్నారు కాబట్టి, డెల్టాకు కేటాయించిన 80 టీఎంసీల కృష్ణాజలాలను శ్రీశైలం జలాశయంలోనే నిల్వచేసి విభజన చట్టంలో పేర్కొన్న నిష్పత్తి మేరకు రెండు రాష్ట్రాలూ పంచుకోవాలి. వాటిని రాయలసీమ, దక్షిణ తెలంగాణ జిల్లాలకే వినియోగించాలి. అదేవిధంగా పులిచింతల ద్వారా ఆదా అయ్యే 54 టీఎంసీలను సీమ జిల్లాలకే కేటాయించాలి. మరీ ముఖ్యంగా ఇరువురు ముఖ్యమంత్రుల ఆధ్వర్యంలో ఇరు ప్రభుత్వాల ఇంజనీర్లు సమావేశమై అధికంగా నీరు లభ్యమయ్యేటప్పుడు ఎలా పంచుకోవాలి, తక్కువగా లభించేటప్పుడు ఎలా సర్దుబాటు చేసుకోవాలి అనే దానిపై ఒక ఒప్పందానికి రావాలి. కానీ ఇది సాధ్యమేనా? ప్రజలకు సమస్యలు లేకపోతే పరిష్కారాలు ఎవరు చూపాలి? ఆ సాకుతో ఓట్లెవరు దండుకోవాలి?


ఈ మొత్తం పరిణామంలో మంచో చెడో కానీ ప్రజల ఆదరణ కోసం తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన మెప్పు పొందడం కోసం టీఆర్‍ఎస్ నేతలూ, ప్రజల మెప్పు కోసం తెలంగాణలోని ఇతర ప్రతిపక్షాలూ సీమ పథకాలపై పోటాపోటీగా విరుచుకుపడుతున్నాయి. సీమ విషాదమేమంటే పైభాగాన తెలంగాణలో ఎత్తిపోతల నిర్మాణాలు జరుగుతున్నా, ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచుతున్నా, సీమ ఎడారిగా మారిపోతుందని తెలిసినా ఈ ప్రాంతపు ఒక్క రాజకీయ నాయకుడూ గళం విప్పడం లేదు. 

అరుణ్

కన్వీనర్, రాయలసీమ విద్యావంతుల వేదిక

Updated Date - 2021-06-30T06:42:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising