ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వాతంత్య్రానికి అర్థం

ABN, First Publish Date - 2021-08-14T05:52:58+05:30

జననికీ, జన్మభూమికీ అభేదం పాటించే ఉద్వేగం ఎట్లా ఎక్కడ మొదలయిందో కానీ, అసంఖ్యాకులైన మనుషుల అమూర్త రూపం జాతిగా, ఆ జాతి సమష్టి రూపం ఒక దేశంగా అనువదింపజేసుకుని దేశభక్తులు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జననికీ, జన్మభూమికీ అభేదం పాటించే ఉద్వేగం ఎట్లా ఎక్కడ మొదలయిందో కానీ, అసంఖ్యాకులైన మనుషుల అమూర్త రూపం జాతిగా, ఆ జాతి సమష్టి రూపం ఒక దేశంగా అనువదింపజేసుకుని దేశభక్తులు పరవశించిపోయారు. ‘జయజయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి‘ అని కీర్తించిన కవి, ‘దేశమంటే మనుషులోయ్’ కూడా గుర్తుకు వచ్చి, ‘జయజయ జయ శతసహస్ర నరనారీ హృదయనేత్రి’ అని దేశమాతను అభివర్ణిస్తాడు. ‘..పొంగిన గుండె నిండు పద్దెముల్ ‘పూజకు తెచ్చిన దేశప్రేమికుడు ‘ఓ జనతా! నతాంజలిపుటోజ్జ్వలకోష్ణ నవోష్ణ రక్తధారా జలసిక్త పాదకమల ద్వయ శోభి మనోజ్ఞదేహరేఖా, జయభారతీ’ అని స్తుతిస్తాడు.


జాతీయవాదం నేల విడిచి సాము చేస్తే, ప్రజలతో నడవడం అన్న మానవీయ, రాజకీయ అంశ తప్పిపోతుంది. గాంధీజీకి అత్యంత ప్రియమైన, మార్గదర్శకమైన గీతం వైష్ణవజనతో. పల్లవి భావం--–‘ఇతరుల కష్టములెవ్వడెరుంగునో- యతడే వైష్ణవుడు’. ఇతరులకు ప్రతినిధిగా, వారందరి లక్ష్యసాధన కోసం పనిచేయడమే రాజకీయ కార్యకర్త చేయవలసిన పని. జాతీయవాద కార్యకర్త జాతి స్వాతంత్ర్యం కోసం పనిచేస్తాడు. చేశాడు. పరతంత్రం ఎందుకు చెడ్డది, స్వాతంత్ర్యం ఎందుకు కావాలి, స్వేచ్ఛలో సాధికారతలో జాతి ఎటువంటి భవితవ్యాన్ని ఆశిస్తుంది అన్నవి జాతీయవాద ఉద్యమం బోధపరచుకునే, రూపొందించుకునే విలువలు, కార్యక్రమాలు.


ఈ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా మనం ఆనాటి జాతీయోద్యమ విలువలను, ఆశయాలను మననం చేసుకుంటున్నామా? అసలు స్వాతంత్ర్యం కోసం నడచిన మార్గంలోనే అనంతరం కూడా నడుస్తున్నామా? ఈ ప్రశ్నలన్నీ వేసుకోవాలి. మనమిప్పుడు అనేక ఇతర పనులలో నిమగ్నమై ఉన్నాము. జాతీయోద్వేగాలను తీవ్రశ్రుతిలో, భిన్నార్థంలో పలికించడంలో తలమునకలై ఉంటున్నాము. ఇప్పుడు మనకసలు జాతీయోద్యమం ఎందుకు జరిగిందో, ఎవరెవరు పాలుపంచుకున్నారో గుర్తే లేదు. మహా అయితే, కొన్ని పేర్లు, కొన్ని విగ్రహాలు గుర్తు ఉండవచ్చు. వచ్చే ఏడాది 75 సంవత్సరాల స్వాతంత్ర్యాన్ని, వజ్రోత్సవాల పేరిట అట్టహాసంగా ఆర్భాటంగా జరపడానికి రేపటి నుంచే సన్నాహాలు చేసుకుంటున్నాము. ప్రస్తుతం మనలను బాధిస్తున్న సమస్యలనుంచి మనసు మళ్లించుకుని ఒక భావోద్వేగంలో ఓలలాడడానికి, రాజకీయవైఫల్యాలనుంచి పెద్దలు వెసులుబాటు పొందడానికి, జాతీయ విలువల నిర్వచనాలను మరింతగా తలకిందులు చేయడానికి ఈ సందర్భం అందరికీ ఒక అవకాశం.


రాజకీయంగా స్వపరిపాలన, దేశీయంగా స్వావలంబన, సాంస్కృతికంగా ఐక్యతలో భిన్నత్వాన్ని, భిన్నత్వంలో ఐక్యతను సాధించడం, క్రియాశీల, భాగస్వామ్య ప్రజాస్వామ్యం.. మనం స్వాతంత్ర్యాన్ని కోరుకోవడంలో ఇమిడి ఉన్న కొన్ని ముఖ్యమైన ఆకాంక్షలు. ఒక్కసారి పరిస్థితులను పరికించి చూస్తే, స్వపరిపాలన ఒక్కటి అంతో ఇంతో అమలులో ఉన్నది తప్ప, ఆ పాలన తరచు అంతర్జాతీయ ప్రభువులకు, దేశీయ దొరలకు సామంతంగానే వ్యవహరిస్తుంది. తీవ్రజాతీయవాదం, మూఢత్వం, అసహనం, మూకతత్వం, హింసావాదం ప్రజలలో సహజీవన తత్వాన్ని చంపుతున్నాయి. పురోగామిగా ఉండవలసిన సమాజగమనాన్ని అబద్ధానికీ, దౌర్జన్యానికీ లోబరుస్తున్నారు. ఇక ప్రజాస్వామ్యం అన్న మాట నుంచి వాస్తవ అర్థం ఎప్పుడో పారిపోయింది. ‘‘దేశభక్తితోడ మేము తిరుగుతుండగానె బాబు, రాజద్రోహులంటు మమ్ము రచ్చపెట్టుతాడు బాబు’’అని గరిమెళ్ల సత్యనారాయణ తెల్లదొరతనం గురించి చెప్పింది ఇప్పుడు అక్షరాలా సరిపోతుంది.


నూలుపోగు మీద రాజ్యమూగుతుందని, సీమనూలును తెంచితే రాజ్యమే చితికిపోతుందని జాతీయవాద కవికి అవగాహన ఉండింది. విదేశీ ఆర్థికానికీ రాజకీయానికీ ఉన్న సంబంధమే, స్వదేశీ రాజ్యంలో కూడా ఉంటుంది. సీమనూలు ఇంకా తెగిపోలేదని, ప్రపంచీకరణ హయాంలో భారతప్రభుత్వాల తీరు చూస్తే అర్థమవుతుంది. ఇంటికి జెష్ట, పొరుగుకు లక్ష్మి- అన్న సామెత మాదిరిగా, దేశీయ వనరులను కొల్లగొట్టి విదేశీకంపెనీలకు లబ్ధి చేయడం, పల్లెల్ని అడవుల్ని కొట్టి పట్టణాలకు మేలు చేయడం స్వప్రజలను ప్రేమించే ప్రభుత్వాలు చేయవలసినవి కావు. దీపం ఆరిపోకుండా, చెదిరిపోకుండా రెండు చేతులూ అడ్డుపెట్టే చిత్రంతో, భారతదేశపు జాతీయ ధీమాగా నిలిచిన జీవితబీమా సంస్థ ఇప్పుడు లక్ష కోట్ల సమీకరణ కోసం అంగట్లో నిలబడింది. బహుళజాతి బీమా సంస్థలు వికటాట్టహాసం చేస్తుండగా, భారతీయ చిరుద్యోగి, మధ్యతరగతి అభద్రజీవి ఎంతో నమ్మకంగా భవిష్యత్తుకు మదుపు చేసే జాతీయసంస్థ ఇక ఒక వ్యాపారసంస్థగా మాత్రమే మిగిలిపోతున్నది. మాకూ అభివృద్ధి కావాలని ప్రాణాలిచ్చి పోరాడి సాధించిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకానికి సిద్ధంగా ఉన్నది. ప్రజల ఉమ్మడి ఆస్తులను ప్రైవేటు పరం చేయడంలో నేటి పాలకులకు ఉన్న అంకితభావం చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఇటువంటి పాలన కోసమేనా, చెరసాలలనే వరచంద్రశాలలుగా, అరదండాలనే విరిదండలుగా భావించి ఉద్యమకారులు త్యాగాలు చేసింది? అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నియు మెలగాలని ఒక మహాకవి గురజాడ చెబితే, మరొక మహాకవి జాషువా ‘‘ఐకమత్యంబు గల్గి నిన్ననుభవించు కొరత పూరింపవే! మాకు భరతమాత!’’ అని విన్నవించుకున్నాడు. విభజనను ప్రోత్సహించే ఏలుబడిలో ఐక్యత ఎక్కడ? భరతమాత చేత కూడా కడగొట్టుబిడ్డలకు అన్యాయం చేయిస్తున్న రాజపుత్రుల కాలం ఇది.


స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంలో ఈ దేశం కోల్పోయిన స్వతంత్రాన్ని, ప్రజలు కోల్పోతున్న హక్కులను స్వేచ్ఛలను, ఉధృతమై కొనసాగుతున్న కుల వివక్షను, సహజీవనాన్ని ద్వేషపూరితం చేస్తున్న మతతత్వాన్ని తప్పనిసరిగా చర్చించుకోవాలి. జాతీయోద్యమ ఆకాంక్షలు ఏవీ పరిపూర్తి కాలేదు. పైగా, జాతీయోద్యమ చరిత్రనే తిరగరాసే ప్రయత్నంలో, తిరోగామి విలువలు రొమ్ము విరుచుకుంటున్నాయి. జాగ్రత్త పడకపోతే, వజ్రోత్సవాలలో అలనాటి స్ఫూర్తి ఏదీ వ్యక్తం కాదు.

Updated Date - 2021-08-14T05:52:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising