ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాహిత్య సృజనుడు, శాస్త్ర శోధకుడు

ABN, First Publish Date - 2021-08-22T06:45:39+05:30

ఇలా సజీవ పుస్తకాల మధ్య కూర్చుని తన లోకంలో తానే ఉంటూ, తన అన్వేషణ తానే సాగిస్తూ ఒక రాజు గారు రుషిలాంటి జీవితం గడుపుతున్నారు. పలకరిస్తే చిరునవ్వుతో స్వాగతిస్తారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘ఇన్నివేల సమాధుల్లో / ఏ ఒక్కటి తెరిచినా ఒక రచయిత తన ఆలోచనలతో సజీవంగా బయటకు వస్తాడు / మూయగానే గతంలోకి, తన నిర్ణీత కాలంలోకి చటుక్కున పోయి నిల్చుంటాడు నిశ్శబ్దంలో సమాధుల మధ్య / కూర్చున్నట్టుంది, ‍ఈ లైబ్రరీలో / పుస్తకాల మధ్య కూర్చుంటే..’’


ఇలా సజీవ పుస్తకాల మధ్య కూర్చుని తన లోకంలో తానే ఉంటూ, తన అన్వేషణ తానే సాగిస్తూ ఒక రాజు గారు రుషిలాంటి జీవితం గడుపుతున్నారు. పలకరిస్తే చిరునవ్వుతో స్వాగతిస్తారు. కదిపితే తన లోపలి సాహిత్య సామాజిక శాస్త్రీయ దృక్పథాల సుగంధాలతో మనల్ని ముంచెత్తుతారు. సన్మానాలంటే చూద్దాంలే అంటారు. అవార్డుల గురించి మాట్లాడితే మనకెందుకులే అంటారు. సర్కారు సభలు అంటే దూరంగా ఉంటారు. ఏలికలతో వచ్చే లాభాల కంటే మోయాల్సిన భారాలే కష్టమని స్పష్టంగా చెబుతారు. ఆయనే దేవరాజు మహారాజు. తెలంగాణ వీణలో రత్నాలుగా ఒదిగిన ఎందరో సాహితీవేత్తలు, మేధావులు, సామాజిక వైజ్ఞానికవేత్తలలో ఈయన కూడా ఒక మరపురాని రత్నమే. చదువుకున్నది జీవశాస్త్రమే గాని దానితోపాటు మానవ జీవన శాస్త్రాన్ని కూడా అధ్యయనం చేయడం తన జీవితంలో ఒక భాగంగా చేసుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 30 సంవత్సరాలకు పైగా ప్రొఫెసర్‌గా, వృక్ష పరాన్నజీవులపై పరిశోధనలు చేస్తూ, విద్యార్థులతో పరిశోధనలు చేయిస్తూ, అదే సమయంలో సమాజంలో కూడా పరాన్న ఘరానా జీవులను కూడా అధ్యయనం చేశారు. తనకు తెలిసిన, తాను చదివిన శాస్త్ర జ్ఞానాన్ని సమాజ శాస్త్రానికి అన్వయించి, దానికి సాహిత్య పరిమళాన్ని మేళవించి ఒక అపురూప విజ్ఞాన సర్వస్వంగా తనను తాను మలచుకున్న ప్రొఫెసర్ మన దేవరాజు మహారాజు. ఆయనను చూస్తే ఎవరికైనా మనసు నిర్మలమవుతుంది. ఆయన ఫ్రెంచి గడ్డం లోపల నుంచి సన్నగా నవ్వినప్పుడు ఆ నవ్వు మీద ఆయన కళ్ళల్లోని తాత్వికమైన కాంతి పడినప్పుడు ఎదుటి వారి హృదయం ఒక మార్మికమైన తాదాత్మ్యతకు గురవుతుంది. ఆయనతో రాజకీయాలు సంభాషించినప్పుడు దేశ, ప్రపంచ రాజకీయాల పట్ల ఆయనకున్న లోతైన అవగాహన తెలుసుకుని మనం నివ్వెరపోతాం. పాలకులే మూఢనమ్మకాల అంధవిశ్వాసాల వాహకాలయినప్పుడు జ్ఞానవంతుడు మౌనంగా ఉండకూడదని ఆయన మనకు మౌనంగానే చెప్తారు. శాస్త్ర విజ్ఞానాన్ని మానవ సమూహాల్లో విస్తృతంగా ప్రచారం చెయ్యకపోతే మనిషి అంధ యుగాల వైపు తిరోగామిస్తాడని ఆయన అంటారు. అందుకే మూఢనమ్మకాలను, అశాస్త్రీయ విధానాల అపసవ్య పోకడలు అన్నింటినీ ఖండిస్తూ ఆయన రాసిన వందలాది వ్యాసాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. ఇంత చేసి ఎక్కడా ఏ హడావుడీ హంగామా ఉండదు. చేయాల్సిన పనిని నిశ్శబ్దంగా చేసుకుంటూ పోవడమే మన పని అని ఆయన నిశ్శబ్దంగానే చెప్తారు. ఎప్పుడైనా ఒక కవిత గురించో ఒక కథ గురించో ఆయనతో సంభాషణకు దిగితే, తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు భాషాసాహిత్యాలలో ఉన్న గొప్ప గొప్ప కాంతిగోళాలను మన ముందు తిప్పి వాటిచుట్టూ మనల్ని తిప్పుతారు. అందుకే ఆయన కవిత్వంలో చెప్పాలనుకున్నది కవిత్వంలోనే చెప్పారు. కథలో చెప్పాలనుకున్నది కథల్లో చెప్పారు. భారతీయ భాషల నుంచి ఇంగ్లీషు నుంచి కొన్ని అపురూపమైన పుస్తకాలను మన తెలుగు వారి కోసం చక్కగా అనువదించారు. నాటకాల రూపంలో, నాటికల రూపంలో, వ్యాసాల రూపంలో ఎక్కడెక్కడ ఏయే రూపంలో మన తెలుగువారిని వెలుగు లోకాల వైపు నడిపించడానికి వీలవుతుందో ఆ రూపాలనన్నింటినీ ఆయన మన ముందుంచారు. దాదాపు 80కి పైగా పుస్తకాలు రచించారు. కథలు, కవిత్వాలు, సాహిత్య విశ్లేషణ, శాస్త్రీయ సామాజిక అంశాలపై విశ్లేషణ పుంఖానుపుంఖాలుగా మన ముందుంచారు. అయినా ఎక్కడా ఆయనలో నామమాత్రం కూడా పేరు కోసం, కీర్తి ప్రతిష్ఠల కోసం, భుజకీర్తులూ పదవుల కోసం ఆత్రం కనిపించదు. బహుశా అందుకే ఇంత కృషి చేయగలిగారేమో.


పాత వరంగల్ జిల్లా కోడూరు గ్రామంలో 70 సంవత్సరాల క్రితం ఫిబ్రవరి 21, 1951లో దేవరాజు జన్మించారు. 2011లో ‘ఆవరణం’ సాహితీ వజ్రోత్సవ సంచిక వచ్చింది. 80 మంది ప్రముఖులు రాజు గారి గురించి రాసిన వ్యాసాలతో వచ్చిన సంచిక అది. ఈ పదేళ్ల కాలంలో సృష్టించిన వైజ్ఞానిక వ్యాసాల సృష్టి, సాహిత్య కృషి అనన్యసామాన్యమైనదిగా చెప్పాలి. ఆయన మొదటి కవితా సంపుటి ‘గుడిసె గుండె’ తెలంగాణ ప్రజల భాషలో తొలి కవితా సంపుటిగా పలువురు పేర్కొంటారు. ఈ విషయాన్ని సాహిత్య అకాడెమీ వారు కూడా ప్రస్తావించారు.


మీ పెద్ద పెద్దోల్లంతా / నా లెక్కనే ఏషాలు గడ్తరని నా లెక్కనే పల్కులు పలుక్తరని / నాకేమెర్క గులాపోన్నినన్ను బట్టుక తంతరు? / మా కుల వృత్తయ్యా ఇది మేం బయిరూపులోల్లం ఇలా ఎప్పుడో 1974 లోనే ఆయన రాసిన ‘గుడిసె గుండె’ అనే కవితా సంపుటిలో తెలంగాణ జనసామాన్య భాషను తన కవిత్వ భాషగా ఆవిష్కరించారు. ‘గాయపడ్డ ఉదయం’, ‘నీకూ నాకూ మధ్య ఓ రంగుల నది’, ‘రాజముద్ర,’ ‘కాలాన్ని వెనకేసిన మనిషి’ మొదలైన కవితా సంపుటాలలో దేవరాజు, కవిత్వ వ్యక్తీకరణలో తన మంచు కడిగిన ముత్యంలాంటి ఆత్మను నిక్షిప్తం చేశారు. అలాగే ఆయన 1977లో వెలువరించిన ‘కడుపుకోత’ కథాసంపుటి కూడా తెలంగాణ ప్రజల భాషలో వచ్చిన తొలి కథాసంపుటిగా చాలామంది పేర్కొంటారు. 


1991 నుంచి దేవరాజు సైన్సు ప్రచార సమరం సాగుతూనే ఉంది. ఎన్నో పాపులర్ ప్రచురణ సంస్థలు ఆ పుస్తకాలను ముద్రించడానికి పోటీ పడ్డాయి. ‘భారతీయ వైజ్ఞానిక వికాసం’, ‘మూఢనమ్మకాలు- సైన్స్’ , ‘విజ్ఞాన పథంలో విజయ ఘట్టాలు’, ‘మా‘నవ’వాదం- జీవన నినాదం’, ‘జీవ పరిశ్రమలు’ మొదలైన ఎన్నో పుస్తకాలతో దేవరాజు తెలుగు జాతిని చైతన్యం చేసే పని పెట్టకున్నారు. ఇక ఆయన రాసిన సాహిత్య వ్యాసాలు తెలుగు సాహిత్య విద్యార్థులకు పాఠాలుగా నిలుస్తాయి. ‘ఆధునిక యుగంలో జానపద సాహిత్యం’, సాహితీవేత్తల పరిచయం చేస్తూ రాసిన ‘స్మృతి సుగంధం’, ‘ స్త్రీ దరహాసం దోచిన ఇతిహాసం’, ‘తొలితరం స్త్రీవాదుల జీవిత కథలు’, ‘ఆత్మ నుంచి అక్షరానికి’, ‘స్త్రీ అక్షరాలు శిలాక్షరాలు’, ‘భారతీయ రచయిత్రుల విజయకేతనం’ మొదలైన వ్యాస సంపుటాలు ఆయన సాహిత్య అధ్యయనానికే కాక సాహిత్యంలో అనేక అస్తిత్వ ఉద్యమాల పట్ల ఆయనకున్న ప్రగాఢ సానుభూతిని కూడా వ్యక్తం చేస్తాయి. ఆయన రాసిన బాలసాహిత్యం కూడా తక్కువేమీ కాదు. ఇక అనువాదాలు కోకొల్లలు. హరివంశ రాయ్ బచ్చన్ ‘మధుశాల’ను ఆయన తెలుగులో గేయ రూపంలో చేసిన అనువాదం చాలా గొప్పది. దేనికీ దేబిరించింది లేదు. కొన్ని అవార్డులు ఆయన్ని వరించి తప్పనిసరిగా తీసుకోవాలని మొహమాటం పెట్టినప్పుడు ఆయన కాదనలేదు. 94లో దాశరథి దంపతుల సత్కారం లాంటివి, కొన్ని జీవనసాఫల్య పురస్కారాలు ఆయన అందుకున్నారు. 


మౌనం ఆయన ఆత్మ స్వభావం. జ్ఞానార్జన ఆయన సహజ లక్షణం. నిరంతరాయంగా నిశ్శబ్దంగా పని చేసుకుంటూ పోవడమే ఆయన ప్రవృత్తి. ఎన్నో గౌరవాలు దక్కాల్సిన హక్కు ఉన్న కవి, రచయిత, మేధావి, సైన్స్ ప్రచారకుడు, విజ్ఞాన ఖని, నడిచే విశ్వవిద్యాలయం లాంటి రాజు గారికి ఇప్పుడు తెలంగాణ సారస్వత పరిషత్తు, దేవులపల్లి రామానుజరావు సాహిత్య పురస్కారాన్ని అందజేయబోతున్నట్లు తెలిసి సంతోషం కలిగింది. ఇలాంటివారిని గౌరవించుకోవడం అంటే నిజమైన శాస్త్ర పరిజ్ఞానాన్ని, సామాజిక చైతన్యాన్ని, సాహిత్య సౌందర్యాన్ని తగిన రీతిలో సత్కరించుకోవడం లాంటిదే. మరిన్ని గౌరవాలు ఆయన పొందితే అది తెలుగు వారందరికీ నిజమైన గౌరవంగా భావించవచ్చు.

డా. ప్రసాదమూర్తి

Updated Date - 2021-08-22T06:45:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising