ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీకి ప్రత్యామ్నాయం ఎండమావేనా?

ABN, First Publish Date - 2021-07-02T06:38:01+05:30

భారత ఉపఖండంలో ప్రప్రథమ సామ్రాజ్య నిర్మాణ వ్యూహకర్త చాణక్యుడు. క్రీస్తుపూర్వం నాల్గవ శతాబ్దికి చెందిన ఈ రాజనీతిజ్ఞుడు భౌతికంగా మర్త్యుడు అయినప్పటికీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత ఉపఖండంలో ప్రప్రథమ సామ్రాజ్య నిర్మాణ వ్యూహకర్త చాణక్యుడు. క్రీస్తుపూర్వం నాల్గవ శతాబ్దికి చెందిన ఈ రాజనీతిజ్ఞుడు భౌతికంగా మర్త్యుడు అయినప్పటికీ స్ఫూర్తి రూపేణా సజీవుడు. ఇరవై ఒకటో శతాబ్ది రాజకీయాలను నిర్ణయాత్మకంగా ముందుకు నడిపించే నవీన చాణక్యుడి కోసం నిరంతర అన్వేషణ సాగుతోంది. కొంతమందికి ఆ అన్వేషణ అమిత్ షా రూపంలో ఫలించింది. భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడిగా వరుసగా పలు ఎన్నికలలో ఘన విజయాలు సాధించిన ఆ ఘటనాఘటన సమర్థుడే నేటి అపర చాణక్యుడని వారు భావిస్తున్నారు. అయితే ‘మార్గాలు ఏవైనా అధికార సాధనే ముఖ్యం’ అన్న చాణక్యనీతికే ఆ పురాతన భారతీయ ధీమంతుని ‘అర్థశాస్త్రం’ పరిమితంకాదు కదా. 


కొత్త రాజకీయ చాణక్యుడు ప్రశాంత్ కిషోర్. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎన్నికల వ్యూహకర్త. ఇటీవల బెంగాల్ ఎన్నికలలో ఆ పార్టీకి చరిత్రాత్మక విజయం సమకూర్చిన సమర్థుడు. మరి ఈ వ్యక్తి మరాఠా యోధుడు శరద్ పవార్‌తో మూడుసార్లు సమావేశ మయ్యాడంటే మాటలా? ఏవో, ఏవేవో వదంతులు వినిపిస్తున్నాయి. నిప్పు లేకుండా పొగ రాజుకుంటుందా? 2024 సార్వత్రక ఎన్నికలలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీని దీటుగా సవాల్ చేయగల రాజకీయ ప్రత్యామ్నాయాన్ని నిర్మించేందుకు పవార్, ప్రశాంత్‌ ప్రయత్నిస్తున్నారా? ఏమిటి వారి పన్నుగడ? 


శరద్ పవార్, ప్రశాంత్ కిషోర్ ఒక అసాధారణ జంట. కాకలుతీరిన మరాఠా యోధుడు పవార్‌కు ప్రజలతో పటిష్ఠ సంబంధాలు ఉన్నాయి. రైతుల నుంచి పారిశ్రామికవేత్తల దాకా ఆయన ఏ సామాజికవర్గం వారితోనైనా మమేకమవగలడు. వారి మద్దతు పొందగల చతురుడు. పవార్‌కు భిన్నమైన వ్యక్తి ప్రశాంత్. నవీన సమాచార సాంకేతికతల నిపుణుడు. తెరవెనుక ఉండి పనిచేసే వ్యక్తి. అష్టపదుల రాజకీయ యోధుడు పవార్, 44 ఏళ్ళ ప్రశాంత్‌ల మధ్య భావసారూప్యత ఏమిటి? అధికార లాలస వారిని కలిపిన ఒక ముఖ్య అంశం. పవార్ దశాబ్దాలుగా అధికార భోగాల అనుభవేకవేద్యుడు. ప్రశాంత్ గత కొద్ది సంవత్సరాలుగా మాత్రమే అధికార పరిమళాలను ఆఘ్రాణిస్తున్న వ్యక్తి. ఈ ఇరువురి మధ్య బలపడుతున్న బంధం వెనుక కనిపిస్తున్న దానికంటే మరేమైనా ఉందా? ఉంటే ఏమిటి దాని పరమ లక్ష్యం?


పవార్-ప్రశాంత్ సమాలోచనలపై ఉహాగానాలు ఆసక్తికరంగా ఉన్నాయి. 2024 సార్వత్రక సమరంలో నరేంద్ర మోదీని సవాల్ చేసి తీరాలన్న కృతనిశ్చయంతో ఉన్న మోదీ వ్యతిరేకుల నిరాశా ధోరణులను ఆ ఊహా గానాలు ప్రతిబింబిస్తున్నాయి. భారత జాతీయ కాంగ్రెస్ ఇప్పటికీ రాజకీయ ఐసియులోనే ఉంది. అంతర్గత కుమ్ములాటలు అంతకంతకూ ఆత్మహత్యా సదృశంగా ముమ్మరమవుతున్నాయి. ఈ పరిస్థితులలో దేశ రాజకీయరంగంలో ‘మూడోఫ్రంట్’ అనేది ప్రధానమంత్రి వ్యతిరేకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఏమిటీ ‘తృతీయ ఫ్రంట్’? తరచు ఇది ప్రస్తావనకు వస్తూనే ఉంది. భావన నుంచి కార్యాచరణకు దిగేలోగానే అంతరించిపోతున్న ఆలోచన అది. అయితే ఆ ఆలోచనను పదే పదే పునరుద్ధరిస్తూనే ఉన్నారు. ఇదొక విలక్షణ రాజకీయ వైచిత్రి. 1990 దశకం మధ్యనాళ్ళలో బీజేపీయేతర, కాంగ్రేసేతర యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని సృష్టించడంలో ప్రతిపక్షాలు సఫలమయ్యాయి. ఈ సఫల ప్రత్యామ్నాయ రాజకీయ నమూనా నిర్మాణంలో ప్రసిద్ధుడయిన విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఒకసారి ఇలా వ్యాఖ్యానించారు: ‘మూడో ఫ్రంట్ అవాంఛనీయంగా కనిపించవచ్చుగానీ అది అనివార్యమైనది’. 


వీపీ సింగ్ వ్యాఖ్య 1990 దశకం అల్లకల్లోల రాజకీయాలను చక్కగా ప్రతిబింబించింది. ఆ దశాబ్దంలో మనదేశం ఆరుగురు ప్రధానమంత్రులను చూసింది. ఎనిమిది ప్రభుత్వాలు న్యూఢిల్లీ గద్దెనెక్కాయి. జాతీయ రాజకీయపక్షంగా బీజేపీ నెమ్మదిగా ప్రాధాన్యం పుంజుకుంటున్న కాలమది. కాంగ్రెస్ మహోజ్వల వైభవాలు క్రమంగా వెలిసిపోతున్న రోజులవి. రాజకీయాలలో ఒక శూన్యం నెలకొంది. దానిని పూరించేందుకు రాజకీయ సంకీర్ణాలు ప్రభవించాయి. బీజేపీ వ్యతిరేకత లేదా కాంగ్రెస్ వ్యతిరేకత నుంచో, లేదా అంటే పచ్చి అవకాశవాదం నుంచో అవి రూపుదిద్దుకున్నాయి. అప్పటికీ ఇప్పటికీ యమునానదిలో చాలా నీరు ప్రవహించింది. నేటి భారతదేశం చాలా భిన్నమైనది. ప్రభుత్వాల అస్థిరతను సహించని, భరించని వైఖరి ఒకటి ప్రజల మనస్సులో సుప్రతిష్ఠితమయింది. నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ వరుసగా రెండు సార్వత్రక ఎన్నికలలో ఘన విజయాలు సాధించింది. కాంగ్రెస్ మరింతగా కృశించిపోయింది. ఇప్పుడు భారత్‌లో ఏకధ్రువ రాజకీయ జగత్తు వర్థిల్లుతోంది. ఆ ఏకైక ధ్రువశక్తికి కార్యకర్తల బలం ఉంది. వనరులు అపారంగా ఉన్నాయి. ఎన్నికల వ్యవస్థపై గుత్తాధిపత్యాన్ని నెలకొల్పుకోగల సంస్థాగత సామర్థ్యముంది. సమీప భవిష్యత్తులో ప్రభవించే రాజకీయ సంకీర్ణాలు ఏవైనా సరే అవి మోదీ నేతృత్వంలోని బీజేపీకి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా మాత్రమే ఉండి తీరుతాయి. 


మరి ఈ పరిస్థితులలో మూడోఫ్రంట్ అనేది లక్ష్యసాధనలో సఫలమవుతుందా? కాషాయశక్తుల ప్రాబల్యం అమితంగా ఉన్న నేటి రాజకీయ వాతావరణంలో మూడో ఫ్రంట్, లక్ష్యసాధన విషయం అలా వుంచి అసలు ఉనికిలోకి వచ్చి కలసికట్టుగా మనగలగడమే కష్టసాధ్యమేమో?! ఇటీవలి శాసనసభా ఎన్నికల ఫలితాలు బీజేపీని ప్రాంతీయ రాజకీయశక్తులు సమర్థంగా ఎదుర్కోగలవని నిరూపించాయి. సాంస్కృతికంగా, భాషాపరంగా తమ తమ రాష్ట్రాల సమున్నత, విశిష్ట అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు కృతనిశ్చయంతో ఉన్న ప్రాంతీయ రాజకీయ శక్తులు బీజేపీ హిందూత్వ జాతీయవాదాన్ని అంగీకరించడానికి, అనుసరించడానికి సిద్ధంగా లేవు. మోదీరాజ్‌కు ప్రత్యామ్నాయాన్ని నిర్మించాలని ఆరాటపడుతున్న వారు ఆ ప్రాంతీయ రాజకీయ శక్తులను ఒక ఉమ్మడివేదికపై ఏకీకృతం చేయాలని ఆరాటపడుతున్నారు. అయితే ఆ ప్రత్యామ్నాయం తప్పనిసరిగా అఖిలభారత ఫ్రంట్‌గా ఉండనవసరం లేదని, బీజేపీకి ఒక ‘స్థానిక’ ప్రత్యామ్నాయంగా ఉండవచ్చని వారు భావిస్తున్నారు.


సంకల్పం సముచితమైనదే. అయితే సత్సంకల్పాలన్నీ ఆచరణలోకి రావడం సుసాధ్యమవుతుందా? ప్రాంతీయ పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా తమ స్థానిక ప్రత్యర్థులతో కలిసివస్తాయా? ఒక జగన్ రెడ్డి, ఒక చంద్రబాబు ఉప్పు-నిప్పు చందం. తృణమూల్ కాంగ్రెస్ వామపక్షాలతో సఖ్యంగా వ్యవహరించడం అసాధ్యం. అఖిలేశ్ యాదవ్, మాయావతిల మధ్య ఏకీభావం కుందేటి కొమ్మే. ప్రత్యర్థులకు ఎలాంటి ప్రాధాన్యాన్ని ప్రాంతీయపార్టీలు సహించవు. నవీన్ పట్నాయక్, కేసీఆర్‌లు బీజేపీతో సైద్ధాంతిక సమరానికి సిద్ధంగా లేరు. ఆ జాతీయ పాలకపక్షంతో అవసరమైన మేరకు సంబంధాలు నెరపడానికి మాత్రమే వారు సమ్మతిస్తారు. 


ప్రతిపాదిత బీజేపీ వ్యతిరేక విశాల సంకీర్ణంలో కాంగ్రెస్‌కు ఒక కీలకపాత్ర ఉండి తీరాలి. కాంగ్రెస్ లేని ప్రత్యామ్నాయమేదీ జాతీయ స్థాయిలో విజయవంతమవ్వదు. కాంగ్రెస్ సారథ్యమనేది చాలా ముఖ్యం, అనివార్యం కూడా. 2019 సార్వత్రక ఎన్నికలలో, అంత అవమానకరమైన ఓటమిలోనూ కాంగ్రెస్‌కు 19.5 శాతం ఓట్లు వచ్చాయనేది ఎవరూ విస్మరించకూడని వాస్తవం. ఆ తరువాత నాలుగు శాతం ఓట్ల వాటాతో డిఎంకె ద్వితీయస్థానంలో ఉంది. వాస్తవిక వాది, కార్యాచరణవాది కనుకనే కాంగ్రెస్ ప్రమేయం లేకుండా కొత్త ప్రతిపక్ష ‘ఫ్రంట్’ అనేది ఉండబోదని శరద్ పవార్ స్పష్టం చేశారు. మరింత స్పష్టంగా చెప్పాలంటే మహారాష్ట్రలో విజయవంతమైన వికాస్ అఘాడి ప్రయోగాన్ని జాతీయస్థాయిలో పునరావృతం చేయాలనేది ఆయన అభీష్టం. ఇది అసాధ్యం కానప్పటికీ క్షేత్ర వాస్తవాల దృష్ట్యా కష్టసాధ్యమైన విషయమేనని చెప్పక తప్పదు. మహారాష్ట్రలో శివసేనతో కలిసి ప్రభుత్వ భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ ఢిల్లీ, గోవా, పంజాబ్‌లలో ఆమ్ ఆద్మీ పార్టీతో సర్దుబాటు చేసుకోవడానికి సుముఖత చూపుతుందా? తన ఓటుబ్యాంకును కొల్లగొడుతున్న పార్టీగా ఆప్‌ను కాంగ్రెస్ భావిస్తోంది. ఆప్, బీజేపీలలో ఏ పార్టీని తన మొదటి శత్రువుగా కాంగ్రెస్ పరిగణిస్తుంది?


ఇంతకూ ‘జాతీయ’ ఎన్నికలలో ప్రతిపక్ష ఫ్రంట్‌కు నాయకత్వం వహించేది ఎవరు? ఇదొక సంక్లిష్ట సమస్య. దీనిపై తర్క వితర్కాలు చాలా లోతుగా జరుగుతున్నాయి. ఈ సమస్యను సముచితరీతిలో పరిష్కరించుకోవడం చాలా చాలా ముఖ్యం. మీడియా ప్రభావం అమితంగా ఉన్న మన సమాజంలో పార్లమెంటరీ ఎన్నికలు అధ్యక్షతరహా ఎన్నికల స్వభావాన్ని సంతరించుకున్నాయి. 2019 సార్వత్రక ఎన్నికలలో ఒక సమైక్య ప్రతిపక్షాన్ని నిర్మించేందుకు చివరిక్షణంలో ప్రయత్నాలు జరిగాయి. అయితే ప్రధానమంత్రి పదవి అభ్యర్థిగా ఎవరు ఉండాలనే విషయమై ఆ ప్రయత్నాలు కార్యరూపం దాల్చలేదు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. నరేంద్ర మోదీని ఓడించడమే లక్ష్యమా లేక రాహుల్ గాంధీని తమ నాయకుడిగా ఆమోదించాలా? ఈ విషయమై ప్రతిపక్షాలు నిర్ణయం తీసుకోవలసివచ్చింది. అవి సందిగ్ధంలో పడ్డాయి. అటువంటి సందిగ్ధావస్థే ఒక విధంగా ఇప్పుడూ ఉంది. నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయంగా ఒక దీటైన నాయకుడిని చూపుతూ అధ్యక్ష తరహా రీతి ఎన్నికలలో ప్రధానమంత్రిని సవాల్ చేయాలా? లేక దేశవ్యాప్తంగా 543 నియోజకవర్గాలలోనూ రాష్ట్రాలవారీగా సంకీర్ణాలను నిర్మించాలా? ఈ కీలక సమస్యను పరిష్కరించుకోనంతవరకు ప్రతిపక్షాల ఏకీకరణ ఎండమావిగా ఉండిపోతుంది.


రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

Updated Date - 2021-07-02T06:38:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising