పెనుభారమైన ఆస్తిపన్ను!
ABN, First Publish Date - 2021-06-30T06:35:30+05:30
కరోనా కష్టాలు తీరకముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై తమ ప్రతాపాన్ని ఏదో ఒక విధంగా చూపుతున్నాయి...
కరోనా కష్టాలు తీరకముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై తమ ప్రతాపాన్ని ఏదో ఒక విధంగా చూపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పెట్రోలు ధరలు పెంచుతుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తిపన్ను పెంచడమే కాక, చెత్త సేకరణపై కొత్తగా పన్ను విధిస్తూ జీవోలు జారీ చేసింది. ఆస్తిపన్నును ఆరేళ్లకొకసారి సవరించాలని చట్టం చెబుతోంది. కానీ వివిధ కారణాల వల్ల దానిని ఎవరూ పాటించడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2002లో నివాసభవనాలకు, 2011లో వాణిజ్యభవనాలకు ఆస్తిపన్నును సవరించారు. ఇప్పటికీ అదేవిధానం కొనసాగుతోంది. కొత్తగా పెంచిన పన్నులకు సంబంధించి గరిష్ఠ విధానం అంటూ లేదు. నివాసగృహమైనా, నివేశ స్థలమైనా రిజిస్ట్రేషన్ విలువలో నిర్దేశించిన శాతానికి చేరుకునే వరకూ పన్ను పెరుగుతూనే ఉంటుంది.
తాజా జీవో ప్రకారం కొత్త పన్ను విధానం ప్రవేశపెట్టిన తొలి సంవత్సరం ఇప్పుడున్న పన్ను మీద కనీసం 10 శాతం, గరిష్ఠంగా 15 శాతం పెరుగుతుంది. తొలి సంవత్సరం చెల్లించిన పన్ను, ఈ ఏడాది తాజా రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం లెక్కించిన పన్ను కంటే ఎక్కువ ఉన్నా లేదా సమానంగా ఉన్నా తగ్గించరు. అప్పుడు 20 శాతం పెంచుతారు. ఈ విధంగా ఏటా కొంత చొప్పున పెంచుకుంటూ వెళ్తే, ఏదో ఒకరోజు ఆ సంవత్సరం రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం గణించిన పన్నుకీ, చెల్లించిన పన్ను సమానమైతే అక్కడి నుంచి ఎలాంటి పరిమితులు లేకుండాను, తర్వాత రిజిస్ట్రేషన్ విలువ పెరిగిన ప్రతిసారి అదే దామాషాలోను ఆస్తిపన్ను పెంచుకుంటూ వెళ్లాలని జీవోలో పేర్కొన్నారు.
కొత్త భవనాలకు కూడ రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం పన్ను వర్తింపజేసేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరికి పాత పన్ను విధానం వర్తించదు. ఇప్పటికే ఒక సాధారణ గృహం ఉన్న వ్యక్తి, దానిపై అదనంగా ఒక అంతస్తు వేసుకున్నా, ఒక్క గది కట్టుకున్నా కొత్తగా ఆస్తిపన్ను మదింపు చేసి, మొత్తం భవనానికి రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా పన్ను వసూలు చేస్తారు. నివాసభవనంగా ఉన్న దానిని వాణిజ్యభవనంగా మార్చినా ఆస్తిపన్ను మదింపు చేస్తారు. దానికి కూడా రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగానే పన్ను చెల్లించాలి. నిర్మాణాలు పూర్తయి పన్ను ఖరారు కాని భవనాలకు కూడా ఇదే పద్ధతిలో పన్ను వసూలు చేస్తారు.
ప్రభుత్వం ఈ మోసపూరితంగా, అర్థరహితంగా ఆస్తిపన్నును పెంచి ప్రజలపై భారం మోపింది. ఈ భారం 8 నుంచి పది వేల కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఇసుక, భూమి, గనులు అన్నింటినీ ఏదో ఒక రకంగా దోపిడీ వనరుగా మార్చుకున్న ప్రభుత్వ పెద్దలు, ఇలాంటి పన్నుల రూపంలో ప్రజల నడ్డివిరుస్తున్నారు. ఆదాయం కోసం ప్రభుత్వ భూమి, భవనాల రిజిస్ట్రేషన్ విలువలను పెంచుతున్నారు. తదనుగుణంగా పన్ను కూడా పెరుగుతూ పోతుంది. ఇది ప్రజల సాంఘిక, ఆర్థిక పరిస్థితుల ఆధారంగా చేసిన ప్రక్రియ కాదు. వాస్తవానికి పన్నులు పెంచాలని వైకాపా ప్రభుత్వం గత ఏడాదే నిర్ణయం తీసుకుంది. మునిసిపల్ ఎన్నికలు అయిపోయాక, పాలకమండళ్లు తన చేతిలోకి వచ్చాక దానిని అమలు చేసింది. ప్రజాభిప్రాయాన్ని కోరకుండా, సామాన్య ప్రజలకు మౌలిక సదుపాయాలు పెంచకుండా పన్నుల్ని పెంచడం అప్రజాస్వామికం.
అధికారంలో ఉన్నాం కాబట్టి తాము ఏం చేసినా చెల్లుతుందనే భావనలో ప్రభుత్వ పెద్దలున్నారు. పన్ను పెంపు జీవో పట్ల ప్రజలలో పెద్దెత్తున నిరసన వ్యక్తమవుతోంది. ఇప్పటికే అన్ని మున్సిపల్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదు. మున్సిపాలిటీలలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, రోజూ చెత్త సేకరించడం, మురికి కాలువలు శుభ్రం చేయడం, పార్కులను సరిగా నిర్వహించడం వంటి వాటిలో పిఫలమైన పాలకులు పన్నులతో ఎడాపెడా వాయిస్తున్నారు. అందులో భాగంగానే వచ్చే నెల నుంచి రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో చెత్త సేకరణ పై కూడ కొత్తగా పన్ను విధించి ప్రతి ఇంటి నుంచి రుసుము వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇళ్ల నుంచి వ్యర్థాల సేకరణ, రవాణాకు ఇప్పుడున్న తోపుడు బళ్ల స్థానంలో తొలి దశలో 3,100 డీజిల్ ఆటోలను సమకూర్చనున్నారు. రెండో దశలో 1700 ఈ–ఆటోలను కేటాయించనున్నారు. వీటిద్వారా వ్యర్థాలను సమీపంలో ఉన్న ఎరువుల తయారీ కేంద్రానికి తరలిస్తారు.
పొడిచెత్త నుంచి విద్యుత్ తయారీకి విశాఖపట్నం, గుంటూరులలో రెండు ప్లాంట్లు అందుబాటులోకి రానున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్లాంట్లు అందుబాటులో లేనిచోట్ల పొడి చెత్తలోని ప్లాస్టిక్, ఐరన్, స్టీల్ ఇతరత్రా వస్తువులను స్థానిక వ్యాపారసంస్థలకు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ‘చెత్త’తో కూడా వ్యాపారం చేయదలచుకున్నది. ప్రజలకు సేవ చేయడం కోసం స్థానిక సంస్థలను ఏర్పాటు చేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు. తమను తాము పరిపాలించుకునే హక్కును ప్రజలు కోల్పోతుండడం విచారకరం. హక్కుల పరిరక్షణ కోసం పోరు సల్పడమే వారి ముందున్న కర్తవ్యం.
చిమ్మె జాన్ బర్నబాస్
న్యాయవాది
Updated Date - 2021-06-30T06:35:30+05:30 IST