ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్య, లలితకళలు, జీవన విలువలు

ABN, First Publish Date - 2021-02-19T07:56:01+05:30

మనిషి జాంతవ స్థితి నుండి నాగరికుడుగా పరిణమించిన క్రమంలో శాస్త్రీయ ఆవిష్కరణలకు ఎంత ప్రాధాన్యముందో నైతిక విలువలు, కళలకు అంతే ప్రాముఖ్యత...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనిషి జాంతవ స్థితి నుండి నాగరికుడుగా పరిణమించిన క్రమంలో శాస్త్రీయ ఆవిష్కరణలకు ఎంత ప్రాధాన్యముందో నైతిక విలువలు, కళలకు అంతే ప్రాముఖ్యత ఉంది. వీటిని సత్యం శివం సుందరం అని కూడ అనవచ్చు. వీటి మధ్య అవినాభావ సంబంధముంది. ఒకదాన్ని ఇంకొకటి పరిపుష్టం చేసుకుంటాయి. పరస్పర ఆశ్రితాలు కూడా. బహుళ ప్రాచుర్యంలో ఉన్న సంగీతం, సాహిత్యం, నాట్యం, శిల్పం వంటివే కాకుండా జానపదులలో ప్రచారంలో ఉన్న కళారూపాలు చిందు, డప్పు, కోలాటం, యక్షగానం వంటి సమస్త జానపద కళారూపాలు కూడ కళాజగత్తుకే చెందుతాయి. అయితే ఈ కళల పరిపుష్టతకు శాస్త్ర సాంకేతిక ఆశ్రయం ఎంతో అవసరం. ఒక అందమైన శిల్పం చెక్కాలంటే భౌతికశాస్త్ర సిద్ధాంతాల అవసరముంటుంది. సంగీత పరికరాలన్నీ ఇప్పుడు యంత్రాల సహాయంతో తయారు చేస్తున్నారు. యంత్రాలన్నీ శుద్ధ భౌతికశాస్త్ర సిద్ధాంతాలకు పుట్టిన బిడ్డలే కదా. అలాగే ఒక మంచి చిత్రం వేయాలంటే కొలతలు, రంగుల అవసరమెంతో ఉంటుంది. క్రీ.పూ. భరతుడు నాట్యశాస్త్ర గ్రంథాన్ని రచించాడు. అందులో సంగీతం, నాట్యం గురించి శాస్త్రీయంగా చర్చించే క్రమంలో అనివార్యంగా మాథ్స్, ఫిజిక్స్‌ సిద్ధాంతాలను కూడ పొందు పరచాల్సి వచ్చిందని అంటారు. గాంధీ బేసిక్‌ విద్యావిధానం అంతా వడ్రంగి, నేత, కూరగాయలు పండించుట వంటి క్రాఫ్ట్స్‌ చుట్టూ తిరుగుతుంది. వీటిని కూడా ఒక రకమైన ఉత్పాదక కళలే అంటూ వాటిని నేర్పే క్రమంలో ఆయా వృత్తులకు సహాయకారిగా ఉండే మాథ్స్, సైన్స్‌ వంటి సబ్జెక్టులను బోధించాలని సూచించాడు. అంటే వివిధ విషయాల మధ్య ఉన్న ఏకత్వాన్ని గుర్తించాడన్నమాట. ఈ రకంగా వాటి మధ్య భౌతిక ఏకత్వమే కాకుండా తాత్విక ఏకత్వం కూడ ఉంటుంది. అందుకే కీట్స్‌ అనే ఆంగ్ల కవి Truth is beauty, beauty truth. A thing of beauty is joy forever అని సత్యానికి, అందానికి, ఆనందానికి మధ్య ఉన్న ఏకత్వాన్ని వివరించాడు. ఇక్కడ అందం అంటే శృంగార పరమైనదే కానక్కరలేదు. పువ్వులను, కొండలను, నదులను చూసినప్పుడు కలిగే ఆనందాన్ని కూడ అందం అనవచ్చు.


అంతేకాకుండా శాస్త్రం, నైతికత, కళలు విడివిడిగా వేటికవే ఇచ్చే జ్ఞానం పాక్షికమైనది, గహనమైనది. ఈ మూడు ఒక దానిలో ఒకటి అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఇచ్చిన జ్ఞానమే సంపూర్ణమైనది. అది మనిషి సృజనాత్మకతను ఇనుమడింపజేయుటమే గాక, నూతన ఆవిష్కరణలకు తోడ్పడుతుంది. నోబెల్‌ బహుమతి పొందిన శాస్త్రవేత్తలలో చాలామందికి ఏదో ఒక కళలో ప్రావీణ్యం ఉండటం గమనించాల్సిన విషయం. అబ్దుల్‌ కలాం కూడ తనకు ఇష్టమైన పుస్తకం చదువుతూనో, సంగీతం వింటూనో సేదదీరేవాడట. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యాపిల్‌ ఫోన్‌ సృష్టికర్త స్టీవ్‌ జాబ్స్‌ అని మనందరికీ తెలుసు. అద్భుతమైన కొత్త కొత్త డిజైన్లతో ప్రతి ఆరు నెలల కొకసారి ఆ ఫోన్‌ నూతనంగా ఆవిష్కరింపబడి మార్కెట్‌లోకి విడుదల చేయబడుతుంది. ఆ కంపెనీ నుండి ఆవిష్కరింపబడిన మాషిన్‌టోష్‌ అనే కంప్యూటర్‌ మార్కెట్‌లో ఒక విప్లవమే సృష్టించింది. ఇంతటి సృష్టి ఎలా సాధ్యమయిందని విలేఖరులు అడిగినప్పుడు ‘తమ కంపెనీలో గొప్ప సాంకేతిక నిపుణులే కాదు.....వాళ్ళలో గొప్ప సంగీత విద్వాంసులు, కవులు, చరిత్రకారులు ఉన్నారు’ అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంటే నూతన ఆవిష్కరణలకు కళల తోడ్పాటు అవసరం అని చెప్పినట్లయ్యింది. అంతే కాకుండా గ్రీకు భాషలో Poerty is an art of persuation అనే మాట ఒకటుందని శేషేంద్ర శర్మ అన్నారు. కావ్యాన్ని ఒప్పించే కళగా గుర్తించటం అద్భుతమైన తాత్విక పరికల్పన. మామూలు లౌకిక విషయాలు మొదలుకొని అంతర్జాతీయ వ్యవహారాల వరకు ఈ సూత్రాన్ని అనువర్తింపచేయవచ్చు. నిజమే కదా, సత్యమేకదా అని నిష్ఠూరంగా చెబితే మేలు కంటే కీడు ఎక్కువ జరుగుతుంది. అదే విషయాన్ని సున్నితంగా, ప్రేమగా చెబితే ఆమోదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చేదు మాత్రకు తీపి పూత పూసి ఇచ్చినట్లు. దేశాల మధ్య సిద్ధాంత సారూప్యత వల్ల నెరవేరని కార్యాలు సాంస్కృతిక సంబంధాల వల్ల నెరవేరుతాయి.


అందువల్ల కళాకారులను సాంస్కృతిక రాయబారులు అనవచ్చు. ఒక్క సైనికుడిని కూడ పంపకుండా తన సాంస్కృతిక వైభవంతో భారతదేశం రెండు వేల సంవత్సరాల పాటు చైనాపై ఆధిపత్యం వహించిందని హిషి అనే చైనా రాయబారి చెప్పాడు. అంటే దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాల ఆవశ్యకతను నొక్కి చెప్పినట్లయ్యింది. అందువల్ల వ్యక్తి జీవితంలో గాని, సమాజంలో గాని భౌతిక, నైతిక, కళాత్మక అంశాలకు సమప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరముంది. దురదృష్టవశాత్తు కాల గమనంలో మేధస్సుకు పట్టాభిషేకం లభించింది. కళాత్మక, నైతిక విలువల ప్రతినిధి అయిన హృదయం పాదాక్రాంతం అయ్యింది. మానవ అంతర్నిహిత హృదయగత స్వభావాలైన కరుణ, ప్రేమ, త్యాగం, సౌందర్యం వంటి అంశాలు దాదాపుగా అంతరించిపోయాయి. ఇవి సమాజ మనుగడకు మనిషి ఏర్పరచుకున్న కట్టుబాట్లు కావు. మానవ జీవన సామగ్రిలో అంతర్భాగాలు. మానవుడు నాగరికుడు కాకముందే అతన్ని పునీతుడిని చేసిన దివిటీలు. సంవేదనాశీలత స్థానంలో శూన్యతా భావాలు వచ్చి చేరాయి. అవినీతి అందలమెక్కింది. నీతికి శిలువ మిగిలింది. ప్రజలు ఓటర్లు అయ్యాయరు. వ్యవస్థలన్నీ ప్రజల అవస్థలుగా మారాయి. అందువలన సమాజంలో హింసా ప్రవృత్తి పెరిగి హత్యలు, ఆత్మహత్యలు, నిర్భయ లాంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. ఈ పరిస్థితి మారాలంటే అన్ని వ్యవస్థలలో సమూల మార్పులు ఏక కాలంలో రావలసిన అవసరముంది. ముఖ్యంగా విద్యాలయాలు నిస్సారమైన సమాచారం ఇచ్చే కేంద్రాలుగా మారాయి. జ్ఞానాత్మక అంశాలకు తప్ప భావాత్మక అంశాలకు స్థానమే లేదు. ఇట్టి సమాచారాన్ని మోయలేక విపరీతమైన మానసిక ఆందోళనకు, ఒత్తిడికి గురవుతున్నారు. దీనివలన విద్యార్థులలో ఆత్మవిశ్వాసం దెబ్బతిని హింసాప్రవృత్తి పెరుగుతుంది. జీవంతో తొణికిసలాడాల్సిన బోధనాభ్యసన ప్రక్రియ స్వేచ్ఛను కోల్పోయి యాత్రికతను సంతరించుకుంటోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని చార్లెస్‌ డికెన్స్‌ ‘హార్డ్‌టైమ్స్’ అనే నవలలో ‘Facts, Facts and nothing but facts, the emotional deficit this breeds is vitiated further by an individualist excellence’ అని చెప్పడం జరిగింది. అంటే ఒక విషయంపై నిపుణత సాధించినంతమాత్రాన సమగ్రత చేకూరినట్లు కాదు. దీని వలన అసాధారణ ప్రజ్ఞావంతులు నైతిక మరుగుజ్జులు పుట్టే అవకాశముంది. ఉగ్రవాదులందరు సాంకేతిక నిపుణులే మరి! శాస్త్రీయ ప్రజ్ఞకు ప్రతీక అయిన అణుబాంబు రేపటి మానవ హననానికి స్మారక చిహ్నంగా మారవచ్చు. అందుకే 1996లో UNESCO విద్యా కమిషన్‌ తన నివేదికలో ‘The information that we provide is useless unles it is organized into knowledge and knowledge is of no use unless it deepens into wisdom. But even wisdom is not enough unless it leads to compassion which breaksdown the frontiers of the ego and increases our kinship with mankind’ అని విద్య పరమార్ధాన్ని వివరించింది. అంటే మనం ఇచ్చే సమాచారం మనుషులలో ఉన్న అహాన్ని తుంచి అందరినీ కలిపి ఉంచి సోదర భావాన్ని పెంచే కారుణ్య భావంగా మారాలన్న మాట. మరి ఈ పరిస్థితి మారాలంటే భావాత్మక, మానసిక చలనాత్మక అంశాలను పెంచే కళలను, క్రాఫ్ట్స్‌ను, క్రీడలను కూడా ప్రధాన పాఠ్యాంశాలుగా చేర్చాల్సిన అవసరముంది. రెసిడెన్షియల్‌ పాఠశాలలు స్థాపించినప్పుడు దివంగత ప్రధాని పి.వి. నరసింహారావు కళలను తప్పనిసరి విషయంగా ఉంచారు. అందువల్ల ప్రాథమిక విద్య నుంచి ఉపాధ్యాయ విద్య, ఉన్నత విద్య వరకు ఈ పరిస్థితిని కొనసాగించాలి. ఇంజనీరింగ్‌, వైద్యం వంటి కోర్సులలో ఒక హ్యుమానిటీస్‌ సబ్జెక్ట్‌ను బోధనాంశంగా ఉంచాలి. మరి దీని వలన ప్రయోజనమేమిటి అనే ప్రశ్న ఉదయిస్తుంది. సంగీతం, సాహిత్యం, నాట్యం వంటి కళలు హృదయాన్ని సున్నితంగా కోమలంగా, ఆర్ద్రంగా ఉంచుతాయి. మనిషిలోని నైరూప్య భావాలకు, ఛేదించలేని కలవరపెట్టే అంశాలకు స్పష్టతను, రూపాన్ని ఇస్తాయి. మనలో అణిచి పెట్టుకున్న భావోద్వేగాలను ప్రక్షాళనం చేసేవి (Cathartic) కళలే. పికాసో మాటలలో చెప్పాలంటే మన ఆత్మలపై పేరుకుపోయిన రోజువారి దుమ్మును దులిపేవి కళలు. కావ్యానందం ఇతర జీవన విలువలకు సమగ్రతనిస్తుంది. Neglect of art in education impovarishes the education process అని కొఠారి చెప్పిన మాటలను గుర్తుంచుకోవాలి. భావాత్మక అంశాలను పణంగా పెట్టి జ్ఞానాత్మక అంశానికి ప్రాధాన్యమివ్వటం ఒక మతిలేని చర్య అని ‘కరికులమ్ ఫ్రేమ్ వర్క్- 2005’లో అభివర్ణించారు. అందుకే బోధించటం ఒక కళ అని అభివర్ణించారు. ఏ విషయాన్ని బోధించినా కళాత్మకత అంతర్వాహినిగా కొనసాగించాలి. తరగతి నిర్వహణలో ఓపిక, సానుభూతి, ప్రేమ, ఉల్లాసము వంటి విలువలను ప్రదర్శించాలి. నేర్చుకునే ప్రక్రియ యావత్తు చర్చించుట, ఆలోచించుట, పంచుకొనుట, స్పందించుట, ఆవిష్కరించుట వంటి అంశాలను ఆలంబనగా చేసుకొని కొనసాగించాలి. ఒక పక్షి తన సారాన్ని తన పిల్లలకు ఎంత సహజంగా అందిస్తుందో అంత సహజంగా మానవ అస్తిత్వ సారాన్ని విద్యార్థులకు అందించాలి. అప్పుడే బోధనాభ్యాసన ప్రక్రియ జీవంతో తొణికిసలాడుతుంది. ఉపాధ్యాయుడు ఒక కదిలే కళారూపంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ప్రేమించేవాడికే బోధించే అర్హత ఉంటుందని చెప్పిన టాగోర్‌ మాటలు గాని, Every teacher must be a poet అని చెప్పిన వర్డ్స్‌వర్త్‌ మాటలలోని పరమార్ధమిదే. నూతన విద్యావిధానం- 2020లో కళల, క్రీడల అనివార్యతను మొదటిసారిగా కూలంకషంగా చర్చించారు. ఎంతవరకు అమలు జరుగుతుందో వేచిచూడాలి.

బాణాల మన్మథ రెడ్డి

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యులు

Updated Date - 2021-02-19T07:56:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising