తెలుగు నాటక రచనా అపురూప కరదీపిక
ABN, First Publish Date - 2021-11-19T07:01:39+05:30
నాటకం జనజీవన దర్పణం... మానవ హృదయస్పందనల మత్తేభాలపై ఎక్కుపెట్టిన అంకుశం... నవత, భవితల అంకురం... మనోతంత్రులను మీటే సాధనం... అస్తవ్యస్థ వ్యవస్థపై సంధించిన ఆయుధం...
నాటకం జనజీవన దర్పణం... మానవ హృదయస్పందనల మత్తేభాలపై ఎక్కుపెట్టిన అంకుశం... నవత, భవితల అంకురం... మనోతంత్రులను మీటే సాధనం... అస్తవ్యస్థ వ్యవస్థపై సంధించిన ఆయుధం... రచయిత భావనాక్షేత్రంలో పురుడుపోసుకుని అక్షరాల ఆకృతితో నటీనటులు అభినయ వేదికపై చీకటి వెలుగుల రంగేళీతో సామాజికునికి కొంత ఉల్లాసం, మరికొంత ఉత్తేజం, ఇంకొంత ఉద్రేకం కలిగించే పదునైన రూపకం. వినోదం, విజ్ఞానం, సామాజిక స్పృహ సమపాళ్లలో కలగలసినదీ నాటకం. రచయిత మేథోమథనం నుంచి పుట్టిన భావామృత అక్షర సందోహాలు అభినయంగా ఆకృతి ధరిస్తే దృశ్యంగా సాక్షాత్కరిస్తుంది. ఆ దృశ్యం అడుగడుగునా కదిలిస్తుంది. కరిగిస్తుంది. రెండు నవ్వుల పువ్వులను పూయిస్తుంది... నాలుగు కన్నీటి బొట్లను చిందిస్తుంది... కర్తవ్యాన్ని ప్రబోధిస్తుంది... దిశానిర్దేశం చేస్తుంది... అచేతన శృంఖలాలను తెంచుతుంది... జ్ఞానకవాటాలను తెరుస్తుంది.
1860లో కోరాడ రామచంద్రశాస్త్రి రచించిన ‘మంజరీ మధుకరీయం’ తెలుగు నాటక రచనకు అంకురార్పణ జరిగింది. 1880లో తొలి సాంఘిక నాటకమైన ‘నందకరాజ్యా’న్ని వావిలాల వాసుదేవశాస్ర్తి రచించారు. కందుకూరి ‘వ్యవహార ధర్మబోధిని’ తొలి ప్రదర్శన పొందిన తెలుగు నాటకంగా గుర్తింపు పొందింది. వ్యవహారిక భాషకు పట్టం కట్టిన గురజాడ ‘కన్యాశుల్కం’, పాత్రోచిత భాషకు పెద్దపీట వేసిన వేదం వెంకటరాయశాస్ర్తి ‘ప్రతాపరుద్రీయం’ నాటక రచనలో ఒక అద్భుత పరిణామం. బలిజేపల్లి ‘సత్యహరిశ్చంద్ర’, ధర్మవరం ‘చిత్రనిళయం’, కోలాచలం ‘రామరాజు చరిత్ర’, తిరుపతి వేంకటకవుల ‘పాండవోద్యోగ విజయాలు’, కాళ్లకూరి ‘చింతామణి’, ‘వరవ్రికయం’, త్రిపురనేని హేతువాద నాటకాలు, దామరాజు పుండరీకాక్షుడి స్వాతంత్ర్యోద్యమ నాటకాలు, సుంకర వాసిరెడ్డి ఉద్యమ నేపథ్య నాటకాలు, సమకాలీన సమస్యలకు అద్దంపట్టిన ఆత్రేయ నాటకాలు తెలుగు నాట రచనను సుసంపన్నం చేశాయి. ఎన్నో పాశ్చాత్య ధోరణుల ప్రభావంతో తెలుగు నాటకం ఆధునికతను సంతరించుకుంది. అపురూపమైన జానపద కళారూపాలు నాటకంతో మమేకమయ్యాయి. ఆంధ్ర నాటక కళాపరిషత్ పోటీలతో పాటు తెలుగునాట జరిగిన ఎన్నో పరిషత్తుల ప్రదర్శనల మూలంగా నాటక రచన ఇబ్బడిముబ్బడిగా జరిగింది. ప్రజానాట్యమండలి స్ఫూర్తితో నాటక రచన జనజాగృతికి బాటలు తొక్కింది. దాదాపు 141 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో వేలాది నాటక, నాటిక రచనలు వెలువడ్డాయి.
ఒక రచయిత రచించిన నాటకం ప్రదర్శనకు నోచుకోవడంతో పాటు ముద్రితమైనప్పుడే అది శాశ్వతత్వాన్ని పొందుతుంది. నాలుగు చెరగులా ఉన్న నాటక సమాజాలకు ఆ రచన అందుబాటులోకి వస్తుంది. దురదృష్టవశాత్తూ మిగతా ప్రక్రియలతో బేరీజు వేస్తే నాటకరచనల ముద్రణ చాలా వెనుకబడి ఉంది. దీనికి కారణం నాటకం ప్రదర్శన కళ కావడంతో దానికి ప్రేక్షకుల ఆదరణ ఎక్కువ. ముద్రణకు నోచుకుంటే పాఠకుల సంఖ్య పరిమితం. దీనితో ప్రచురణకర్తలు నాటక ముద్రణకు ఆసక్తి చూపలేదు. కానీ పాశ్చాత్య నాటకరంగంలో దాదాపుగా ప్రతి నాటకం ముద్రణ పొందడమే కాకుండా, ఒక నాటకంపై వెలువడిన విమర్శలు, సమీక్షలు, ప్రదర్శనల పూర్తి వివరాలతో ఆ ముద్రణలు ఉంటాయి. తెలుగులో సగానికి పైగా నాటకాలను రచయితలే స్వయంగా ముద్రించుకోగా, కొందరు ప్రచురణకర్తలు మాత్రం నాటకంపై ఉన్న ఆసక్తి, అభిమానంతో కొన్నిటిని ముద్రించారు. ఇంకా వందలాది నాటకాలు, నాటికలు అముద్రితాలుగానే చీకట్లో మగ్గిపోతున్నాయి.
నాటకాల ప్రారంభ దశలో కురుకూరి సుబ్బారావు, కొండపల్లి వీరవెంకయ్య (రాజమండ్రి), వావిళ్ల రామస్వామి అండ్ సన్స్ (మద్రాసు) వంటి ప్రచురణకర్తలు నాటకాలను విరివిగా ముద్రించేవారు. తెలుగు నాటక వికాస దశలో విశాలాంధ్ర పబ్లిషర్స్, నవోదయ, ప్రజాసాహితి, సృజన, అరుణోదయ, అరుణా పబ్లిషింగ్ హౌస్, శ్రీరామా పబ్లిషర్స్, జనత పబ్లిషర్స్ వంటి ప్రచురణ సంస్థలు నాటక ముద్రణకు నడుం కట్టాయి. అజో విభో కందాళం ఫౌండేషన్, యువ కళావాహిని సంస్థలు తాము నిర్వహించే పోటీలకు ఎంపికైన నాటికలను ముద్రించే సంప్రదాయానికి శ్రీకారం చుట్టాయి. ముద్రితమైన నాటకాల సంఖ్య పరిమితం కావడం, అవి నాటకరంగ అధ్యయనం పరిశోధన చేసేవారికి అందుబాటులో లేకపోవడం నాటకాభిమానులకు కొరతగా పరిణమించింది. ఈ లోపాన్ని పూరించి తెలుగు నాటకరంగ ఆరంభ దశ నుంచి వర్తమానం వరకు వెలువడిన ఉత్తమ నాటకాలు, నాటికలను సంకలనాలుగా ముద్రించే బృహత్తర యజ్ఞాన్ని తాడేపల్లి అరవింద ఆర్ట్స్ సంస్థ పక్షాన ప్రఖ్యాత నాటక రచయిత వల్లూరు శివప్రసాద్, ప్రముఖ నటుడు దర్శకుడు గంగోత్రి సాయి నిర్వహిస్తున్నారు. ఉత్తమమైన 58 నాటికలను ఎంపిక చేసి ప్రసిద్ధ తెలుగు నాటికల పేరుతో విశాలాంధ్ర పక్షాన ముద్రించారు. దాదాపు 50 హాస్యనాటికలను ఎంపిక చేసి ప్రసిద్ధ హాస్యనాటికలను ముద్రించారు. 50 బాలల నాటికలను ముద్రించారు.
ఈ స్ఫూర్తి, స్పందనతో చేసిన మరొక అద్భుత ప్రయత్నంగా 100 అపురూపమైన నాటకాలను సేకరించి ప్రసిద్ధ ‘తెలుగు నాటకాలు’ పేరుతో నాటికాభిమానులకు అపురూపమైన కానుకగా అందిస్తున్నారు. తొలి తెలుగు సాంఘిక నాటకమైన వావిలాల నందకరాజ్యం నుంచి వర్తమానం వరకూ వెలువడిన 100 నాటకాలను దాదాపు 1500 పేజీలతో ఆరు సంకలనాలుగా ముద్రించారు. వీటిలో పానుగంటి వృద్ధవివాహం, సోమరాజు రంగూన్రౌడి, దామరాజు పాంచాల పరాభవము, భమిడిపాడి బాగుబాగు, కాళ్లకూరి మధుసేవ, రాజమన్నార్ తప్పెవరిది, బళ్లారి రాఘవ సరిపడని సంగతులు, వేదాంత కవి తెలుగుతల్లి, కొండముది ఎదురీత, సుంకర వాసిరెడ్డి ముందడుగు, ఆత్రేయ యన్.జి.ఒ, నాజర్ ఆసామి వంటి అరుదైన నాటకాలు ఉన్నాయి.
ఈ నాటకాల సేకరణకు శివప్రసాద్, గంగోత్రి సాయి అహోరాత్రాలు శ్రమించారు. ఉభయ రాష్ట్రాలలోని దాదాపు అన్ని గ్రంథాలయాలను జల్లెడ పట్టారు. భారతీయ నాటకరంగ చరిత్రలోనే తొలిసారిగా విస్తృత సంకలన ముద్రణకు పూనుకుని చరితార్థులయ్యారు. ఒక ప్రభుత్వమో, ఒక విశ్వవిద్యాలయమో చేపట్టవలసిన బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించి తెలుగు నాటక గ్రంథస్థ యజ్ఞాన్ని నిర్వహించిన వారి కృషి ప్రశంసనీయం.
డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు
(నేడు హైదరాబాద్లోని, మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో భారత ఉపరాష్ట్రపతి
ముప్పవరపు వెంకయ్యనాయుడు ‘ప్రసిద్ధ తెలుగు నాటకాలు (౧880–2020)’
ఆరు సంకలనాలను ఆవిష్కరిస్తున్న సందర్భంగా)
Updated Date - 2021-11-19T07:01:39+05:30 IST