నేటి నుంచి జొమాటో ఐపీఓ
ABN, First Publish Date - 2021-07-14T06:41:23+05:30
జొమాటో పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) బుధవారం ప్రారంభమవుతోంది. ఈ ఐపీఓ ద్వారా రూ.9,375 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది.
తగ్గిన ‘గ్రేమార్కెట్’ ప్రీమియం
ముంబై: జొమాటో పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) బుధవారం ప్రారంభమవుతోంది. ఈ ఐపీఓ ద్వారా రూ.9,375 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. గత ఏడాది మార్చిలో వచ్చిన ఎస్‌బీఐ కార్డ్స్ ఐపీఓ తర్వాత, భారత ఐపీఓ మార్కెట్‌లో ఇదే అతి పెద్ద ఐపీఓ. ఈ ఐపీఓ ధరను రూ.72-76 మధ్య నిర్ణయించారు. ఈ లెక్కన కంపెనీ వాల్యుయేషన్ రూ.64,365 కోట్లు. ఈ ఇష్యూ శుక్రవారం నాడు ముగియనుంది. కాగా మంగళవారం నాడు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి జొమాటో రూ.4,196 కోట్లు సమీకరించింది.
తగ్గుతున్న ప్రీమియం: అయితే గ్రేమార్కెట్‌లో జొమాటో ఐపీఓ షేర్ల ప్రీమియం పడిపోతోంది. వారం రోజుల క్రితం 25 శాతం ఉన్న ఈ ప్రీమియం మంగళవారం పది శాతానికి పడిపోయింది. కంపెనీ షేర్ల ధరను ఎక్కువగా నిర్ణయించడమే ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయి నా జొమాటో ఐపీఓ సబ్‌స్ర్కిప్షన్‌కు ఢోకా ఉండదని భావిస్తున్నారు. ఎఫ్‌పీఐల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందని అంచనా.
16 నుంచి తత్వ చింతన్ ఫార్మా ఐపీఓ: స్పెషాలిటీ కెమికల్స్ తయారీ సంస్థ తత్వ చింతన్ ఫార్మా కెమ్ ఐపీఓ శుక్రవారం ప్రారంభమవుతోంది. ఈ ఐపీఓ ద్వారా రూ.500 కోట్లు సమీకరించాలని కంపెనీ నిర్ణయించింది. ఇందు కోసం రూ.1,073-1,083 ప్రైస్ బ్యాండ్‌తో షేర్లు జారీ చేస్తోంది. ఈ రూ.500 కోట్ల ఐపీఓలో రూ.225 కోట్లు కొత్త ఈక్విటీ షేర్ల జారీ ద్వారా సమీకరిస్తుంది. మిగతా రూ.275 కోట్లు ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రస్తుత ఇన్వెస్టర్లు తమ వాటాలో కొన్ని షేర్లను అమ్మకానికి పెడుతున్నారు.
ఐపీఓ బాటలో శ్రీ భజరంగ్ పవర్: చత్తీస్గఢ్‌కు చెందిన శ్రీ భజరంగ్ పవర్ అండ్ ఇస్పాత్ కంపెనీ ఐపీఓకు సిద్ధమైంది. ఇందుకోసం మంగళవారం సెబీకి దరఖాస్తు చేసింది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ.700 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. అప్పులు తీర్చడంతో పాటు అదనపు వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం ఈ నిధులు ఖర్చు చేస్తుంది.
Updated Date - 2021-07-14T06:41:23+05:30 IST