దానశీలి ప్రేమ్‌జీ!
ABN, First Publish Date - 2021-10-29T08:53:04+05:30
విప్రో వ్యవస్థాపక చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో రూ.9,713 కోట్ల విరాళాలు ఇచ్చారు.
గడిచిన ఆర్థిక సంవత్సరంలో రోజుకు రూ.27 కోట్ల విరాళం ఎడెల్‌గివ్
హురున్ ఇండియా జాబితా మొత్తం రూ.9,713 కోట్ల దానం
భారత దాతల జాబితాలో వరుసగా రెండో ఏడాదీ అగ్రస్థానం
రెండు, మూడు స్థానాల్లో శివ్ నాడార్, ముకేశ్ అంబానీ
హెటిరో చైర్మన్ పార్థసారథి రెడ్డికీ చోటు
ముంబై: విప్రో వ్యవస్థాపక చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో రూ.9,713 కోట్ల విరాళాలు ఇచ్చారు. అంటే, సగటున రోజుకు రూ.27 కోట్లు దానం చేశారు. ఎడెల్‌గివ్ హురున్ ఇండియా విడుదల చేసిన భారత దాతల జాబితా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రేమ్‌జీ వరుసగా రెండో ఏడాదీ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఈ కరోనా కష్టాల సంవత్సరంలో ప్రేమ్‌జీ తన విరాళాలను 23 శాతం మేర పెంచారని రిపోర్టు పేర్కొంది. మరిన్ని వివరాలు..
గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,263 కోట్ల విరాళాలిచ్చిన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్‌కు ఈ లిస్ట్‌లో రెండో స్థానం లభించింది. ఆసియా కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ రూ.577 కోట్ల విరాళాలతో మూడో స్థానంలో నిలిచారు.
రూ.377 కోట్ల విరాళాలిచ్చిన ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా నాలుగో స్థానంలో ఉండగా.. దేశంలో రెండో అత్యంత ధనవంతుడు, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ రూ.130 కోట్ల దానంతో 8వ స్థానంలో ఉన్నారు.
ప్రముఖ స్టాక్ ఇన్వెస్టర్, బిగ్‌బుల్‌గా పేరుగాంచిన రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాకూ ఈ ఏడాది లిస్ట్‌లో తొలిసారి చోటు దక్కింది. గత ఆర్థిక సంవత్సరం ఈయన విద్యా రంగానికి రూ.50 కోట్లు విరాళంగా ఇచ్చారు. జాబితాలోని కొత్తవారిలో అత్యధికంగా విరాళమిచ్చింది ఈయనే.
జాబితాలోని 11 మంది రూ.100 కోట్లకు పైగా విరాళాలివ్వగా.. రూ.50-100 కోట్లు దానం చేసినవారు 20 మంది ఉన్నారు. 42 మంది రూ.20 కోట్లకు పైగా విరాళమిచ్చారు.
జాబితాలో తొమ్మిది మంది మహిళలు కూడా ఉన్నారు. రోహిణి నీలేకని ఫిలాంథ్రపీ స్‌కు చెందిన రోహిణి నీలేకని రూ.69 కోట్ల విరాళాలతో మహిళల్లో అగ్రస్థానంలో నిలిచారు. కాగా, పూర్తి జాబితాలో 14వ స్థానం దక్కింది.
నగరాలవారీగా చూస్తే, 31 మంది ముంబైకి చెందినవారు. ఢిల్లీ నుంచి 17 మంది, బెంగళూరు నుంచి 10 మంది, హైదరాబాద్ నుంచి 7 కంపెనీల కుటుంబాలకు స్థానం దక్కింది.
రంగాల వారీగా చూస్తే, అత్యధికం (20 శాతం) ఫార్మా పరిశ్రమకు చెందినవారే. ఆటోమొబైల్ (11 శాతం), సాఫ్ట్‌వేర్ (10 శాతం) ఇండస్ట్రీలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
బాలీవుడ్ ప్రముఖులు అక్షయ్ కుమార్ రూ.26 కోట్ల విరాళంతో 34వ స్థానంలో, అమితాబచ్చన్ రూ.15 కోట్ల విరాళంలో 55వ స్థానంలో ఉన్నారు.
Updated Date - 2021-10-29T08:53:04+05:30 IST