అధికార పార్టీకి ఆమోదం... ప్రతిపక్షానికి అవరోధం
ABN, First Publish Date - 2021-10-22T04:18:49+05:30
వైసీపీ చేపడుతున్న దీక్షలకు పోలీసుల అనుమతి లభిస్తోంది. అదే చంద్రబాబు దీక్షకు మద్దతుగా వెళుతున్న ప్రతిపక్ష నాయకులకు ఆవరోధాలు సృష్టిస్తున్నారు.
టీడీపీ నాయకులపై కొనసాగిన గృహ నిర్బంధాలు... ఆంక్షలు
(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి)
వైసీపీ చేపడుతున్న దీక్షలకు పోలీసుల అనుమతి లభిస్తోంది. అదే చంద్రబాబు దీక్షకు మద్దతుగా వెళుతున్న ప్రతిపక్ష నాయకులకు ఆవరోధాలు సృష్టిస్తున్నారు. తెలుగుదేశం నియోజకవర్గ ఇన్‌చార్జి వలవల బాబ్జీ తమ పార్టీ శ్రేణులతో చంద్రబాబు దీక్షకు వెళ్లడానికి సన్నాహాలు చేసుకున్నారు. ఉదయం బయలు దేరే సమయానికి పోలీసులు బాబ్జి ఇంటిని చుట్టుముట్టారు. బయటకు వెళ్లేందుకు వీలు లేదని స్పష్టం చేశారు. బయటకు వెళ్లకుండా అడ్డుకోవడాన్ని బాబ్జి తప్పుపట్టారు. పోలీసులతో ఘర్షణ పడ్డారు. మరోవైపు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి వ్యాఖ్యలకు నిరసనగా పోలీస్ ఐలాండ్‌వద్ద రాజశేఖర రెడ్డి విగ్రహం సమీపంలో జనాగ్రహ దీక్షకు సన్నాహాలు చేసుకుంది. అదే విషయాన్ని బాబ్జి పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. మరోవైపు పోలీస్ ఐలాండ్ వద్ద వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జనాగ్రహ దీక్ష ప్రారంభించారు. దాంతో తెలుగుదేశం నాయకులు అభ్యంతరం తెలిపారు. పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దీనితో తెలుగుదేశం నాయకులకు కూడా పోలీసులు అనుమతి ఇచ్చారు. ఒకే కారులో ఐదుగురికి మించి చంద్రబాబు దీక్షకు వెళ్లకూడదంటూ షరతు విధించారు. అధికార పార్టీ దీక్షలో దాదాపు 50 మంది నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశంలో కొద్దిమందికి మాత్రమే అనుమతి ఇవ్వడం గమనార్హం. పోలీ సుల అనుమతి లభించడంతో వలవల బాబ్జితోపాటు, పాతూరి రాంప్రసాద్ చౌదరి, పరిమి రవికుమార్, కిలపర్తి వెంకట్రావు, గంధం సతీష్‌లు చంద్ర బాబు దీక్షకు మద్దతుగా అమరావతి పయనమయ్యారు.
తణుకు: వైసీపీ అప్రజాస్వామిక పనులు మానుకోవాలని టీడీపీ నరసాపురం పార్లమెంటు ఉపాధ్యక్షుడు బసవ రామకృష్ణ అన్నారు. గురు వారం చంద్రబాబు దీక్షకు మద్దతుగా తణుకు నుంచి బయలు దేరుతున్న రామకృష్ణను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఈ విషయం తెలిసిన పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. నిరసన వ్యక్తం చేసే వారిని గృహ నిర్బంధాలు చేయడం తగదన్నారు. ఆయన ఇంటి వద్దే పలువురు నాయకులతో నిరసన తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మాదాసు రాంబాబు, తాతపూడి మారుతీరావు, గుమ్మళ్ళ హనుమంతరావు, కొమ్మిరెడ్డి వెంకటేశ్వరావు, రాంబాబు, గోపిరెడ్డి చిన్నారావు, సీతారామయ్య పాల్గొన్నారు.
పెంటపాడు: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో చేస్తున్న దీక్షకు మద్దతుగా వెళ్ళకుండా పోలీసులు మండలంలో టీడీపీ నాయకులు పాతూరి, కిలపర్తి వెంకట్రావు, నల్లమిల్లి చినగోపిరెడ్డి, దాసరి సతీష్‌కుమార్‌లను గృహ నిర్బంధం చేశారు.
ఇరగవరం: చంద్రబాబు చేపట్టిన నిరసన దీక్ష దగ్గరకు వెళ్లనీయకుండా మండల టీడీపీ నాయకులను ఉదయం నుంచే అడ్డుకోవడంతో ఇంటి వద్దనే దీక్షకు మద్దతు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో నరసాపురం పార్లమెంట్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు చుక్కా సాయిబాబు, కాసగాని రామకృష్ణ, పసుపులేటి బాలాజీ, మామిడిశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
గణపవరం: గణపవరం మండలం నుంచి గురువారం తెల్లవారు జామున పార్టీ శ్రేణులు అమరావతి తరలి వెళ్లారు. నాలుగు బృందాలుగా గణపవరం మండలం పార్టీ అధ్యక్షుడు ఇందుకూరి రామకృష్ణంరాజు ఆధ్వర్యంలో అమరావతికి చేరుకున్నారు. అయితే ఈ బృందంలో ఐదుగురిని అడ్డుకుని ఏలూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో నిర్బందించారు. ఈ సమాచారాన్ని విలేకరులకు పార్టీ నేతలు తెలిపారు. అదుపులో ఉన్న వారు ఏలూరు పార్లమెంట్ టీడీపీ ఆర్గనైజింగ్ కార్యదర్శి యాళ్ల సుబ్బారావు, ఏలూరు పార్లమెంట్ టీడీపీ రైతు కార్యదర్శి కవల కోదాండ రాంబాబు, పార్టీ నాయకులు కూనసాని నాగేశ్వరరావు, జూపల్లి రాజేంద్ర ఉన్నట్టు తెలిపారు.
ఉంగుటూరు: చంద్రబాబు దీక్షకు ఉంగుటూరు మండల శ్రేణులు గురువారం మద్దతు పలికారు. మంగళగిరి దీక్షా శిబిరానికి బయలు దేరిన నారాయణపురం కార్యకర్తలను చేబ్రోలు పోలీసులు నిర్బంధించారు. దీంతో స్టేషన్‌లోనే వారు నిరీక్షించారు.
భీమడోలు: చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్షా కార్యక్రమానికి ఉంగు టూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు హాజరై దీక్షలో పాల్గొన్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు, బడేటి రాధా కృష్ణయ్య తదితరులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే మండలంలోని పలువురు నేతలను దీక్షా శిభిరానికి వెళ్ళనీయకుండా ఇళ్ళ వద్దే పోలీసులు నిర్బంధించారు.
Updated Date - 2021-10-22T04:18:49+05:30 IST