పేలుడు ఘటన బాధిత కుటుంబం ఆందోళన
ABN, First Publish Date - 2021-10-29T06:17:09+05:30
మండల కేంద్రంలోని మందుగుండు వ్యాపారి ఇంటి ఎదుట మేడివాడ పేలుడు బాధిత కుటుంబం, గ్రామస్థులు గురువారం బైఠాయించారు.
దేముడమ్మ మృతదేహంతో వ్యాపారి ఇంటి ముందు బైఠాయింపు
న్యాయం జరగకపోతే ఇక్కడే దహన సంస్కారాలు చేస్తామని హెచ్చరిక
రావికమతంలో ఉద్రిక్త వాతావరణం
పోలీసుల చర్చలు, వ్యాపారి హామీతో ఆందోళన విరమణ
రావికమతం, అక్టోబరు 28: మండల కేంద్రంలోని మందుగుండు వ్యాపారి ఇంటి ఎదుట మేడివాడ పేలుడు బాధిత కుటుంబం, గ్రామస్థులు గురువారం బైఠాయించారు. ఈ ఘటనలో గాయపడి మృతి చెందిన నడిపల్లి దేముడమ్మ మృతదేహంతో వారు నిరసన తెలిపారు. న్యాయం జరిగేవరకూ కదిలేది లేదని, ఇక్కడే దహన సంస్కారాలు చేస్తామని ఆందోళనకారులు హెచ్చరించారు. రాత్రి పది గంటల వరకూ ఆందోళన కొనసాగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మేడివాడలో ఈ నెల 24న మందుగుండు సామగ్రి పేలడంతో రెండు గృహాలు నేలమట్టమై ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడ్డ మరో మహిళ నడిపల్లి దేముడమ్మ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. దీంతో కోపోద్రోక్తులైన దేముడమ్మ కుటుంబీకులు, గ్రామస్థులు మేడివాడలో బుధవారం రాత్రి వ్యాపారి దుకాణం, మందుగుండు సామగ్రి ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. సీఐ హామీ మేరకు శాంతించగా, గురువారం ఉదయం దేముడమ్మ మృతదేహంతో రావికమతంలోని వ్యాపారి ఇంటి ఎదుట బైఠాయించారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్థులు, బంధువులు ఆందోళనకు దిగారు. పేదవాడి కడుపు మంటను ఎవరూ పట్టించుకోరా అంటూ మండిపడుతున్నారు. న్యాయం జరిగేవరకూ కదిలేది లేదని, దేముడమ్మ దహన సంస్కారాలు ఇక్కడే నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. రాత్రి వరకూ ఆందోళన కొనసాగడం, పరిస్థితి ఉద్రిక్తకరంగా మారడంతో కొత్తకోట సీఐ లక్ష్మణమూర్తి సర్కిల్ పరిధిలోని పోలీసు సిబ్బందితో వచ్చి బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఇరు వర్గాలతో చర్చలు జరిపారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. మృతురాలి కుటుంబ సభ్యులకు నష్టపరిహారం ఇచ్చేందుకు వ్యాపారి అంగీకరించడంతో రాత్రి 10 గంటలకు ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని దహన సంస్కరణల నిమిత్తం అక్కడి నుంచి మేడివాడ గ్రామానికి తీసుకువెళ్లిపోయారు.
Updated Date - 2021-10-29T06:17:09+05:30 IST