తెరపైకి మరో కొండ
ABN, First Publish Date - 2021-06-26T05:56:03+05:30
రుషికొండ ఐటీ పార్కులో మరో కొత్త కొండను ఏపీఐఐసీ తెరపైకి తీసుకువచ్చింది.
ఐటీ పార్కులో హిల్ నంబర్ 4
అదానీ సహా నాలుగు సంస్థలకు అక్కడే భూమి కేటాయింపు
నాలెడ్జ్ పార్కుగా నామకరణం
టీడీపీ హయాంలో అభివృద్ధి చేసిన రెండు ప్రాంతాలను పక్కనపెట్టిన వైసీపీ ప్రభుత్వం
వాటిని ఎవరికి కేటాయిస్తారో...
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
రుషికొండ ఐటీ పార్కులో మరో కొత్త కొండను ఏపీఐఐసీ తెరపైకి తీసుకువచ్చింది. ఇప్పటివరకు మూడు కొండలే ప్రచారంలో ఉన్నాయి. ఒకటో నంబరు కొండపై మిరాకిల్‌తో పాటు మరో ఐటీ సంస్థ ఉన్నాయి. రెండో నంబరు కొండపై సింబయోసిస్, మహతి, నవయుగ, న్యూనెట్ వంటివి ఉన్నాయి. మూడో నంబరు కొండపై ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ (స్టార్టప్ విలేజ్), మిలీనియం టవర్, పాత ఐబీఎం పనిచేస్తున్నాయి. వీటి తరువాత మరో కొండపై 40 ఎకరాలను తెలుగుదేశం హయాంలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్‌కు కేటాయించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ కేటాయింపు రద్దు చేసింది. మరో కొండకు నాలుగో నంబర్‌గా పేరు పెట్టి అందులో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్‌కు 25 ఎకరాలు కేటాయించింది. అయితే ఆ సంస్థ వచ్చే పరిస్థితి లేదు. అలాగే కాపులుప్పాడలో 400 ఎకరాలకుపైగా వున్న ఒక కొండను తెలుగుదేశం హయాంలో అభివృద్ధి చేశారు. అందులో 170 ఎకరాల్లో లేఅవుట్ వేసి, రహదారులు నిర్మించి, వాటర్ ట్యాంక్, వీధి దీపాలు కూడా ఏర్పాటుచేశారు. అక్కడే అదానీ డేటా సెంటర్‌కు కొన్ని ఎకరాలు ఇచ్చి, మిగిలిన భూమి రిజర్వులో ఉంచారు. అదానీ సెంటర్‌కు అక్కడ ఇచ్చిన భూమిని ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ...వెనక్కి తీసుకుంది. ఆ సంస్థకు కూడా ఇప్పుడు నాలుగో నంబరు కొండపై భూమి కేటాయించింది. అదే కొండపై డీఆర్‌డీఓ పరిశోధన కేంద్రానికి 5 ఎకరాలు ఇచ్చి, ఏపీఐఐసీ సెంటినరీ టవర్స్‌కు కొంత భూమి ఉంచుకుంది. ఈ కొండకు కొత్తగా ‘నాలెడ్జ్ పార్క్’ అని నామకరణం చేసింది. ఇది శ్రీరామ్ ప్రాపర్టీస్ నుంచి రుషికొండ బీచ్‌కు వెళ్లే మార్గంలో ఉంది.
అభివృద్ధి చేసినవన్నీ పక్కనపెట్టి...
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అభివృద్ధి చేసిన కొండలపై భూములన పక్కనపెట్టి, చెట్లు, తుప్పలతో నిండి, కచ్చా రోడ్డు కూడా సరిగ్గా లేని మరో కొండ (హిల్ నంబర్ 4గా పేర్కొంటున్నారు)పై అదానీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థలకు భూములు కేటాయించింది. దాదాపు రూ.50 కోట్లతో అభివృద్ధి చేసిన కాపులుప్పాడ ఐటీ లేఅవుట్‌ను రెండేళ్లుగా ఖాళీగా ఉంచింది. అలాగే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్‌కు భూములు ఇచ్చిన కొండపైకి గత ప్రభుత్వం చక్కటి రహదారి నిర్మించింది. దానిని కూడా పక్కనపెట్టారు. అభివృద్ధి చేసిన వాటిని ఇవ్వకుండా తుప్పలతో నిండిన కొండపై భూములు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని నగరంలోని ఐటీ సంస్థల ప్రతినిధులు అంటున్నారు. అంటే ఇప్పట్లో ఆయా సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించవని పాలకులే భావిస్తున్నారా?... అనే సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. మరి ఇప్పటికే అభివృద్ధి చేసిన కాపులుప్పాడ ఐటీ లేఅవుట్‌ను, మరో కొండను ఎవరి చేతిలో పెడతారో అర్థం కావడం లేదంటున్నారు.
Updated Date - 2021-06-26T05:56:03+05:30 IST