వర్షంతో ఊరట
ABN, First Publish Date - 2021-05-12T04:51:34+05:30
గత కొన్ని రోజులుగా తీవ్ర ఎండలతో అల్లాడిపోయిన ప్రజలకు మంగళవారం మధ్యాహ్నం గంట పాటు కురిసిన వర్షం ఊరటనిచ్చింది.
సబ్బవరం, మే 11: గత కొన్ని రోజులుగా తీవ్ర ఎండలతో అల్లాడిపోయిన ప్రజలకు మంగళవారం మధ్యాహ్నం గంట పాటు కురిసిన వర్షం ఊరటనిచ్చింది. ఈ వర్షం రైతులకు మేలు చేస్తుందని పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే వేసిన మెట్ట పంటలు ఎండిపోయే దశలో వర్షం కురవడం లాభదాయకమని రైతులు అంటున్నారు. ఖరీఫ్ పంటలు వేసుకునేందుకు ఈ వర్షం ఎంతో ఉపకరిస్తుందని చెబుతున్నారు. వేసవి దుక్కులు చేసుకుని ఎరువులు కలుపుకునేందుకు వీలవుతుందని అంటున్నారు.
పెందుర్తిలో..
పెందుర్తి: పెందుర్తిలో మంగళవారం మఽద్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు వీచడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. వర్షం వల్ల మేలు జరుగుతుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు.
గోపాలపట్నంలో..
గోపాలపట్నం: నగరంలో మంగళవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి గోపాలపట్నం పరిసర ప్రాంతాలు తడిసిముద్దయ్యాయి. గోపాలపట్నం కొండవాలు ప్రాంతాల నుంచి వచ్చిన వర్షపు నీరు గెడ్డల నుంచి పొంగి ప్రవహించడంతో గెడ్డలో పేరుకుపోయిన చెత్త లోతట్టు ప్రాంతాలకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వర్షపు నీరు కొత్తపాలెం, వెంకటాపురం గ్రామ శివారుల్లోని పంట పొలాల్లో, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిపోయింది.
పరవాడలో..
పరవాడ: మండల కేంద్రం పరవాడ పరిసర ప్రాంతంలో మంగళవారం భారీ వర్షం కురిసింది సుమారు అరగంట పాటు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. గత పది రోజులుగా ఎండలలో అల్లాడిపోయిన ప్రజానీకానికి ఈ వర్షం కాస్త ఉపశమనం ఇచ్చింది. వర్షం కారణంగా చాలా చోట్ల రహదారులపై నీరు నిలిచిపోయింది. ఈ వర్షం కూరగాయల పంటలకు ఊపిరి పోసిందని రైతులు చెబుతున్నారు. సింహాద్రి ఎన్టీపీసీ, కలపాక, తానాం, ఫార్మాసిటీ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
Updated Date - 2021-05-12T04:51:34+05:30 IST