అప్పన్న కల్యాణోత్సవానికి కర్పూర దండలు సిద్ధం
ABN, First Publish Date - 2021-04-19T04:53:10+05:30
వరాహలక్ష్మీనృసింహస్వామి కల్యాణోత్సవానికి కర్పూర దండలు సిద్ధమయ్యాయి.
సింహాచలం, ఏప్రిల్ 18: వరాహలక్ష్మీనృసింహస్వామి కల్యాణోత్సవానికి కర్పూర దండలు సిద్ధమయ్యాయి. ఈ కర్పూర దండల తయారీ తమ పూర్వీకులు నుంచి తనకు సంక్రమించిన పెద్ద వరంగా భావిస్తున్నట్టు అడివివరం గ్రామవాసి తోట కృష్ణ తెలిపారు. ఏటా మాదిరిగానే ఈనెల 23న అప్పన్న స్వామి వార్షిక తిరుకల్యాణ మహోత్సవాన్ని నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అడివివరం గ్రామానికి చెందిన తోట రామన్న మనవడు కృష్ణకు కర్పూర దండల తయారీకి అనుమతులిచ్చారు. దీంతో కల్యాణోత్సవంలో వాడేందుకు కంఠమాల, అమ్మవార్లకు అవసరమైన మాలికలు ఆరేసి జతలు, పెళ్లివారికి పంచే కర్పూర పుల్లలు మూడు వందలు తయారుచేశారు. ఈ సందర్భంగా తోట కృష్ణ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ పూర్వజన్మ ఫలంగా స్వామివారి సేవ దక్కడం చాలా సంతృప్తినిస్తుందన్నారు. కర్పూర మాలికలకు కావాల్సిన ఐదు కిలోల కర్పూరాన్ని విజయనగంలో కొనుగోలు చేసి భార్య నళిని, కుమార్తె హరితలతో కలిసి 20 రోజుల పాటు కష్టపడి, ఎంతో నిష్టతో కర్పూర దండలను సిద్ధం చేశామన్నారు. ఇందుకు గాను దేవస్థానం రూ.12 వేలు చెల్లిస్తోందని, ఆ సొమ్ము లాభమా, నష్టమా అన్నదానిని పట్టించుకునే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.
Updated Date - 2021-04-19T04:53:10+05:30 IST