ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మన్యంలో కొనసాగుతున్న గెడ్డల ఉధృతి

ABN, First Publish Date - 2021-09-29T06:22:26+05:30

గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలకు ఏజెన్సీలోని గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో గెడ్డలకు అవతల ఉన్న గిరిజనుల రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు.

పాడేరు మండలంలో గొండెలిలో ఉధృతంగా ప్రవహిస్తున్న మత్స్యగెడ్డ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఉరకలేస్తున్న మత్స్యగెడ్డ 

 రాకపోకలకు అవస్థలు పడుతున్న గిరిజనులు.. 

 పాడేరు ఘాట్‌లో విరిగిపడిన కొండచరియ


పాడేరు, సెప్టెంబరు 28: గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలకు ఏజెన్సీలోని గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో గెడ్డలకు అవతల ఉన్న గిరిజనుల రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఏజెన్సీలో పాడేరు, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ మండలాల్లో మంగళవారం సైతం గెడ్డల ఉధృతి కొనసాగుతున్నది. పాడేరు మండలంలో మత్స్యగెడ్డ ఉరకలేస్తుండగా, హుకుంపేట మండలంలో రాళ్లగెడ్డ ఉధృతి కొనసాగుతున్నది. అలాగే పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో మత్స్యగెడ్డ పాయలు వరదనీటితో జోరుగా ప్రవహిస్తున్నాయి. పెదబయలు మండలంలో తమరాడ, అడుగులపుట్టు, లక్ష్మిపేట, గోమంగి, బొంగరం ప్రాంతాల్లో గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అలాగే ముంచంగిపుట్టు మండలంలో లక్ష్మిపురం, బుంగాపుట్టు, సుత్తిగుడ ప్రాంతాల్లో గెడ్డలు జోరుగా ప్రవహిస్తుండడంతో గెడ్డలకు అవతల ఉన్న గిరిజనులు ఇళ్లకే పరిమితమయ్యారు. అలాగే డుంబ్రిగుడ మండలంలో చాపరాయి, లోగిలి, సంపంగిగెడ్డ ఉధృతి తగ్గనప్పటికీ, గిరిజనులు సాహసింగి గెడ్డల్లోంచి రాకపోకలు సాగిస్తున్నారు.  

మూడు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాల కారణంగా పాడేరు ఘాట్‌లోని 12వ మైలుకు సమీపంలో ఓ మలుపు వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. అయితే ఆ సమయంలో వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. ఘాట్‌ మలుపుల వద్ద చెట్లు లేకపోవడంతో వర్షాలకు ఆ ప్రాంత భూమి నానిపోవడం వల్లే కొండచరియలు విరిగిపడ్డాయని డ్రైవర్లు అంటున్నారు. అయితే రెండోసారి కూడా ఘాట్‌లో కొండ చరియలు విరిగిపడడంతో రాత్రి 12 గంటల వరకు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

డుంబ్రిగుడ మండలంలోని పలు చోట్ల పంట పొలాలు మునిగిపోగా, మరికొన్నిచోట్ల చెట్ల కొమ్మలు విరిగి పడడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మండలంలోని గెడ్డలన్నీ ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తుండడంతో గెడ్డల ఆవల ఉన్న ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. మారుమూల ప్రాంతాలైన కొల్లాపుట్టు-గసభా రహదారిలో కొండచరియ విరిగి పడడంతో తహసీల్దార్‌ జయప్రకాశ్‌ వెళ్లి రక్షణ చర్యలు చేపట్టారు. అలాగే చాపరాయి జలపాతంలో పర్యాటకులు వెళ్లకుండా ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేశారు. చాపరాయి గెడ్డలో ఎవరూ దిగకుండా పోలీసు పహారా ఏర్పాటు చేశారు.

అరకులోయ మండలంలో వాగులు, గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో మారుమూల ప్రాంతాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. బొండాం పంచాయతీ పరిధి జయంతివలస-బొండాం కొత్తవలస మధ్య పెద్దగెడ్డపై వంతెన పూర్తికాకపోవడంతో ఆ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బొండాం కొత్తవలస గ్రామస్థులు తాగునీటికి అవస్థలు పడుతున్నారు.  

ముంచంగిపుట్టు మండలంలో గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో మండలంలో మూడు రోజులుగా కురిసిన వర్షాలకు గెడ్డలు, వాగుల ఉధృతి కొనసాగుతున్నది. మంగళవారం కూడా వర్షం కురిసింది. మండలంలో పనస, బంగారుమెట్ట, దారెల, పెదగూడ ప్రాంతాల్లో ఐదు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అలాగే బుంగాపుట్టు, బూసిపుట్టు, రంగబయలు, లక్ష్మీపురం పంచాయతీల పరిధిలోని గెడ్డలు, వాగులు వరదనీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో గెడ్డలకు అవతల ఉన్న గిరిజన పల్లెల్లోని ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో గెడ్డలకు సమీపంలోని గిరిజనులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Updated Date - 2021-09-29T06:22:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising