మహా మాయ
ABN, First Publish Date - 2021-07-20T05:25:11+05:30
జీవీఎంసీ జోన్-8 పరిధిలో వేపగుంట, పెందుర్తి పరిసర ప్రాంతాల్లో సింహాచలం దేవస్థానం భూములు, ప్రభుత్వ భూములు ఉన్నాయు.
200 మంది ఇంటి పన్నుకు ఒకటే పట్టా
దేవదాయ, ప్రభుత్వ భూముల ఆక్రమణదారులకు జీవీఎంసీ సిబ్బంది సహకారం
జోన్-8 రెవెన్యూ విభాగంపై ఆరోపణలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఎవరైనా తమ ఇంటికి కొత్తగా ఆస్తి పన్ను (అసెస్‌మెంట్) వేయాల్సిందిగా మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)కు దరఖాస్తు చేసుకుంటే...ఆ ఆస్తికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను సమర్పించాలి. డాక్యుమెంట్లలో చిన్నపాటి తేడా వున్నా పన్ను విధించరు. కానీ జోన్-8 పరిధిలో మాత్రం జీవీఎంసీ రెవెన్యూ విభాగంలోని కొంతమంది సిబ్బందిని ప్రసన్నం చేసుకుంటే ప్రభుత్వ భూమి అయినా...దేవస్థానం భూములు అయినా సరే క్షణాల్లో డోర్ నంబర్ కేటాయిస్తూ కొత్త అసెస్‌మెంట్‌జారీ చేస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
జీవీఎంసీ జోన్-8 పరిధిలో వేపగుంట, పెందుర్తి పరిసర ప్రాంతాల్లో సింహాచలం దేవస్థానం భూములు, ప్రభుత్వ భూములు ఉన్నాయు. కొంతమంది ఈ భూములను కబ్జా చేస్తున్నారు. కొన్నాళ్లకు వంద గజాలు, రెండు వందల గజాలు చొప్పున విభజించి ఇతరులకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఆ భూములకు సంబంధించి ఎలాంటి పట్టాలు లేకపోయినప్పటికీ వారే తప్పుడు వివరాలతో కరెంటు మీటరు వేయించేస్తున్నారు. అనంతరం జీవీఎంసీ సిబ్బందిని ప్రసన్నం చేసుకుని తప్పుడు పత్రాలతో ఇంటి పన్ను వేయించుకుంటున్నారు. ఆ తర్వాత ఆయా స్థలాల్లో పక్కా భవనాలను నిర్మించుకుంటున్నారు. వేపగుంట, ముత్యమాంబ కాలనీ, వెంకటసాయినగర్, చీమలాపల్లి, సాయిబాబా నగర్, వరలక్ష్మినగర్, సాయిమాధవ్ నగర్, బంటా కాలనీ వంటి ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉందంటున్నారు. జోన్-8 రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న ఒక ఉద్యోగితోపాటు అధికారి వద్ద సహాయకుడిగా పనిచేస్తున్న మరొక ఉద్యోగి కలిసి అడ్డదారిన డోర్ నంబర్లు (అసెస్‌మెంట్లు) కేటాయిస్తూ భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారని కొంతమంది ఆధారాలతో సహా జీవీఎంసీ కమిషనర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ దందా అధికంగా సాగుతోందని, కోర్టు వివాదాలు వున్న స్థలాలకు సైతం ఎలాంటి పట్టాలు, ఆధారాలు లేకుండానే డోర్ నంబర్‌లు కేటాయించేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
గత ప్రభుత్వ హయాంలో జారీచేసిన జీవో నంబర్ 296/16 ద్వారా సింగంపల్లి సన్యాసమ్మకు 2016 సెప్టెంబర్ 16న ఆర్‌సీ 386/2016/వీజెడ్‌ఎం 1001-69-69224 నంబర్‌తో పట్టా జారీ చేశారు. ఇదే పట్టాను మార్ఫింగ్ చేసి సుమారు 200 మందికి ఇంటి పన్నులు వేయించినట్టు తెలిసింది. ఈ జోన్ పరిధిలో గత ఏడాది కాలంలో కొత్తగా కేటాయించిన డోర్ నంబర్లను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తే ఆ విషయం బయటపడుతుందని పేర్కొంటున్నారు. ఒక పట్టాను స్కానింగ్ చేసి కేవలం పేర్లు మార్చి నకిలీ పట్టాలను తయారుచేసి, సచివాలయం నుంచి జోనల్ కార్యాలయం వరకూ అందరినీ మేనేజ్ చేసి, అడ్డదారిన డోర్ నంబర్లు కేటాయించేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సాధారణంగా ఏదైనా ఆస్తికి సంబంధించి డాక్యుమెంట్‌కు వెనుక వైపు డాక్యుమెంట్ నంబర్ ఉంటుందని, ఆ నంబర్‌ను సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పరిశీలిస్తే....పట్టాదారు వివరాలు కనిపిస్తాయని అలాగైతేనే అది ఒరిజనల్‌గా భావించాల్సి వుంటుందని పేర్కొంటున్నారు. అయితే జోన్-8లో కొత్తగా కేటాయించిన డోర్ నంబర్లకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలిస్తే స్థలం డాక్యుమెంట్ మొదటి పేజీలో ఉన్న పేరుకి, రెండో పేజీలో వున్న డాక్యుమెంట్ నంబర్‌కు పొంతన వుండదని పేర్కొంటున్నారు. ఉదాహరణకు కొత్త 95వ వార్డులో ఇటీవల కేటాయించిన డోర్‌నంబర్లను వాటి పత్రాలను పరిశీలిస్తే 16 అసెస్‌మెంట్లను నకిలీ పత్రాలతో జారీ చేశారని, వాటికి సంబంధించిన ఆధారాలను జీవీఎంసీ కమిషనర్‌కు అందజేయాలని నిర్ణయించుకున్నట్టు స్థానికులు కొందరు పేర్కొనడం గమనార్హం. దీనిపై అధికారులు దృష్టిసారిస్తే రూ.3 కోట్ల కుంభకోణం బయటపడుతుందని అభిప్రాయపడుతున్నారు.
Updated Date - 2021-07-20T05:25:11+05:30 IST