వేంపాడు టోల్‌ప్లాజాపై పిడుగు
ABN, First Publish Date - 2021-07-03T05:23:51+05:30
మండలంలోని వేంపాడు హైవే టోల్‌ప్లాజా కార్యాలయంపై శుక్రవారం ఉదయం పిడుగు పడింది.
పూర్తిగా ధ్వంసమైన టెక్నికల్ యూనిట్
పనిచేయని సీసీ కెమెరాలు, ఫాస్టాగ్ స్కానర్లు
రూ.20 లక్షలకుపైగా ఆస్తి నష్టం
ఉదయం నుంచి టోల్ ఫీజు లేకుండానే వాహనాల రాకపోకలు
నక్కపల్లి, జూలై 2: మండలంలోని వేంపాడు హైవే టోల్‌ప్లాజా కార్యాలయంపై శుక్రవారం ఉదయం పిడుగు పడింది. శుక్రవారం ఉదయం రెండు గంటలపాటు భారీ వర్షం పడింది. ఈ సమయంలో వేంపాడు హైవే టోల్‌ప్లాజా ప్రాంతంలో పలుమార్లు పిడుగులు పడ్డాయి. ఒక పిడుగు టోల్‌ప్లాజా ప్రధాన కార్యాలయంపై పడడంతో టెక్నికల్ యూనిట్ తీవ్రంగా దెబ్బతిన్నది. టోల్‌ప్లాజా కౌంటర్ల ఆపరేటింగ్ సిస్టమ్, ఫాస్టాగ్ యూనిట్, సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఇతర సామగ్రి కాలిపోయాయి. దీంతో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఫాస్టాగ్ స్కానింగ్ ఆగిపోయింది. సాయంత్రం వరకు టోల్‌ఫీజు లేకుండానే వాహనాలు రాకపోకలు సాగించాయి. ఇరువైపులా పది టోల్ ఫీజు గేట్లు వుండగా...రాత్రి ఏడు గంటల ప్రాంతానికి ఆరు గేట్లకు చెందిన సీసీ కెమెరాలు, ఫాస్టాగ్ స్కానర్లను వినియోగంలోకి తీసుకువచ్చారు. మిగిలిన వాటిని అందుబాటులోకి తీసుకురావడానికి సిబ్బంది కృషిచేస్తున్నారు. ఈ సందర్భంగా టోల్‌ప్లాజా మేనేజర్ పలివెల వెంకటరమణ మాట్లాడుతూ, పిడుగుపాటు కారణంగా వివిధ రకాల పరికరాలు కాలిపోవడంతో సుమారు రూ.20 లక్షల మేర నష్టం వాటిల్లినట్టు చెప్పారు.
Updated Date - 2021-07-03T05:23:51+05:30 IST