ఐటీఐ కౌన్సెలింగ్ హాల్ ఖాళీ
ABN, First Publish Date - 2021-01-13T04:36:28+05:30
కంచరపాలెం బాలికల ఐటీఐ ప్రాంగణంలోని నరవ ప్రభుత్వ ఐటీఐలో చేరేందుకు అభ్యర్థులు లేకపోవడంతో సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి.
నరవలో 136 సీట్లకు 20 మంది అభ్యర్థులు హాజరు
నాలుగో విడతలో పూర్తైన ఎంపిక
కంచరపాలెం, జనవరి 12: కంచరపాలెం బాలికల ఐటీఐ ప్రాంగణంలోని నరవ ప్రభుత్వ ఐటీఐలో చేరేందుకు అభ్యర్థులు లేకపోవడంతో సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి. మంగళవారం నిర్వహించిన కౌన్సెలింగ్‌కు కేవలం 20 మంది మాత్రమే హాజరయ్యారు. ఇక్కడ ఎలక్ర్టికల్, డీజిల్ మెకానిక్, ఫిట్టర్, ఎలక్ర్టానిక్ మెకానిక్ తదితర ముఖ్యమైన ట్రేడుల్లో 136 సీట్లు అందుబాటులో ఉన్నాయి. నక్సల్స్ బాధిత ప్రాంతాల పిల్లల కోసం ఈ ఐటీఐను ఏర్పాటు చేశారు. సదరు అభ్యర్థులు అందుబాటులో లేకపోతే ఇతరులతో సీట్ల భర్తీకి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. కాగా ఈ బాధ్యతలు నిర్వర్తించే అధికారుల నిర్లక్ష్యంతో గత మూడు విడతల కౌన్సెలింగ్‌లకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. నాలుగో విడత దరఖాస్తుల సమర్పణకు రెండు రోజుల ముందు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. దీంతో చాలామంది దరఖాస్తు చేసుకునే అవకాశం లేకపోయింది. ఫలితంగా 68 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా, 20 మంది మాత్రమే హాజరయ్యారు. కాగా కంచరపాలెం ప్రభుత్వ పాత ఐటీఐ, బాలికల ఐటీఐలో మిగులు సీట్లకు నిర్వహించిన కౌన్సెలింగ్‌లో మెరిట్ అభ్యర్థులకు రోస్టర్ పద్ధతిలో సీట్లు కేటాయించినట్టు ప్రిన్సిపాల్ వై.ఉమాశంకర్ పేర్కొన్నారు.
Updated Date - 2021-01-13T04:36:28+05:30 IST