డీఈవోకు పొగ!?
ABN, First Publish Date - 2021-09-17T05:35:03+05:30
విశాఖలో పోస్టింగ్ కోసం ఇతర శాఖల మాదిరిగానే విద్యా శాఖలో కూడా తీవ్ర పోటీ నెలకొంది.
జిల్లా నుంచి బలవంతంగా పంపడానికి రంగం సిద్ధం
విద్యాశాఖ డైరెక్టరేట్‌కు లింగేశ్వరరెడ్డి
విశాఖ జిల్లా విద్యాశాఖాధికారిణిగా తన భార్యను నియమించుకోవడానికి డైరెక్టర్ స్థాయి అధికారి యత్నాలు
ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి...సీఎం పేషీలో ఫైల్
ఒకటి, రెండు రోజుల్లో గ్రీన్‌సిగ్నల్ లభిస్తుందని ప్రచారం
ఎస్‌ఎస్‌ఏ ఏపీసీ పోస్టుకు ముగ్గురి పోటీ
ఇన్‌చార్జి మంత్రి, జిల్లా మంత్రికి తెలియకుండా అమరావతి స్థాయిలో యత్నాలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖలో పోస్టింగ్ కోసం ఇతర శాఖల మాదిరిగానే విద్యా శాఖలో కూడా తీవ్ర పోటీ నెలకొంది. కీలకమైన జిల్లా విద్యా శాఖాధికారి పోస్టు కోసం అమరావతి స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుత డీఈవో లింగేశ్వరరెడ్డిని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌కు పంపి, ఆ స్థానంలో డిప్యూటీ డీఈవో నుంచి డీఈవోగా ఇటీవల పదోన్నతి పొందిన తన భార్యను నియమించుకోవడానికి డైరెక్టర్ హోదాలో వున్న ఓ అధికారి ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఫైల్ సీఎం పేషీలో వుందని, ఒకటి, రెండు రోజుల్లో గ్రీన్‌సిగ్నల్ లభిస్తుందని సమాచారం.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీపై ప్రస్తుతం నిషేధం ఉంది. పదోన్నతులు పొందిన వారిని ఖాళీలు వున్నచోట నియమించుకోవాలే తప్ప ప్రస్తుతం పోస్టులో వున్న వారిని బదిలీ చేయకూడదు. కానీ జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డిని బదిలీ చేయడానికి రాష్ట్రస్థాయిలో పెద్దలపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. లింగేశ్వరరెడ్డి జిల్లా విద్యాశాఖాధికారిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లయింది. ఆయనకు జాయింట్ డైరెక్టర్ (జేడీ)గా పదోన్నతి రావాలి. కానీ జేడీ పోస్టులు ఐదు వుండగా, పదోన్నతుల జాబితాలో వున్న పేర్లలో లింగేశ్వరరెడ్డి ఆరో వ్యక్తి. ఈ నేపథ్యంలో నాలుగైదు నెలల్లో కొన్ని జేడీ పోస్టులు ఖాళీ అవుతాయని, అప్పటివరకు లింగేశ్వరరెడ్డిని విశాఖలో కొనసాగించాలని విద్యా శాఖా మంత్రి భావించారు. మరోవైపు ఇటీవల ఏడీ (డిప్యూటీ డీఈవోలు)ల నుంచి డీడీలు(డీఈవో)గా పదోన్నతి పొందిన తొమ్మిది మంది...పోస్టింగుల కోసం ఎదురుచూస్తున్నారు. పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ హోదాలో వున్న ఓ అఽధికారి భార్య కూడా వీరిలో ఉన్నారు. ఆమెకు విశాఖ డీఈవోగా పోస్టింగ్ ఇవ్వాలంటూ తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. ఆయనకు ప్రభుత్వ పెద్దల అండదండలు వుండడంతో విశాఖ డీఈవో లింగేశ్వరరెడ్డిని పాఠశాల విద్యా శాఖ డైరెక్టరేట్‌లో ఫారెన్ సర్వీస్ ద్వారా పనిచేసే (ఇతర శాఖల అధికారులు పనిచేసేది) పోస్టుకు బదిలీ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అయితే డీఈవో బదిలీ వ్యవహారం జిల్లా మంత్రికిగానీ, జిల్లా ఇన్‌చార్జి మంత్రికి గానీ తెలియకపోవడం కొసమెరుపు.
ఎస్‌ఎస్‌ఏ ఏపీసీ పోస్టుకు ముగ్గురు పోటీ
జిల్లాలో ఖాళీగా వున్న సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ పోస్టు కోసం ముగ్గురు అధికారులు పోటీపడుతున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ హోదా కలిగిన ఈ పోస్టును దక్కించుకోవడానికి ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫైల్ సీఎం పేషీలో వుండగా...ఈ పోస్టుకి కూడా జిల్లా ఇన్‌చార్జి మంత్రి, జిల్లా మంత్రికి తెలియకుండా సీఎం పేషీ స్థాయిలో వ్యవహారం జరుగుతుండడం విశేషం.
ఎస్‌ఎస్‌ఏలోకి ఇతర జిల్లాల టీచర్లు
కాగా సమగ్ర శిక్షా అభియాన్‌లో సెక్టోరియల్ అధికారుల పోస్టులకు విద్యా శాఖలో స్కూలు అసిస్టెంట్ నుంచి ఉన్నత పాఠశాల హెచ్‌ఎం హోదా వున్న టీచర్లను ఫారెన్ సర్వీస్ కింద నియమిస్తారు. సాధారణంగా ఏ జిల్లాలో పనిచేసే టీచర్లను అదే జిల్లాలో ఎస్‌ఎస్‌ఏలో సెక్టోరియల్ అధికారులుగా నియమించడం సంప్రదాయం. అయితే ప్రస్తుతం జీసీడీవో (గర్ల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్) పోస్టులోకి విజయనగరం జిల్లాకు చెందిన మహిళా టీచర్ ఒకరు పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారి సిఫారసుతో వస్తున్నట్టు ప్రచారం సాగుతున్నది. సాధారణంగా సెక్టోరియల్ అధికారులుగా నియమించాలంటే జిల్లాస్థాయిలో టీచర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించి రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించాలి. ఈ విధానానికి పాఠశాల విద్యాశాఖ తిలోదకాలు ఇచ్చిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన టీచర్ ఒకరు సెక్టోరియల్ అధికారిగా ఉన్నారు. పొరుగు జిల్లాల నుంచి మరికొందరు టీచర్లు విశాఖ జిల్లా ఎస్‌ఎస్‌ఏలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.
Updated Date - 2021-09-17T05:35:03+05:30 IST