చెరువు చేపలకు డిమాండ్
ABN, First Publish Date - 2021-04-19T04:52:32+05:30
ఒక వైపు వేసవి దెబ్బకు కోడి మాంసం ధరకు రెక్కలు రావడం, సముద్రంపై చేపల వేట నిషేధం కూడా ఇప్పుడే ఉండడంతో చాలా మంది మాంసాహార ప్రియులు చెరువు చేపల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.
సముద్రంపై చేపల వేట నిషేధంతో పెరిగిన గిరాకీ
గోపాలపట్నం, ఏప్రిల్ 18: ఒక వైపు వేసవి దెబ్బకు కోడి మాంసం ధరకు రెక్కలు రావడం, సముద్రంపై చేపల వేట నిషేధం కూడా ఇప్పుడే ఉండడంతో చాలా మంది మాంసాహార ప్రియులు చెరువు చేపల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. దీని వల్ల చెరువు చేపలకు కూడా డిమాండ్ పెరిగింది. దీంతో చేపల బజార్లు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. నగరంలోని చేపల బజార్లకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద మొత్తంలో చెరువు చేపలు దిగుమతి అవుతున్నాయి. ప్రధానంగా వారంలో సుమారు మూడు రోజుల పాటు టన్నుల కొద్దీ చేపలు నగరానికి చేరతాయి. దీంతో పాటు జిల్లాలోని డ్యామ్‌లు, విజయనగరం పరిసర ప్రాంతాల్లోని కొన్ని చెరువుల నుంచి నగరానికి పెద్ద మొత్తంలో చేపలు దిగుమతి అవుతున్నాయి. ఉభయగోదావరి జిల్లాలతో పాటు విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల నుంచి వచ్చే చేపలలోడ్‌లు రాంపురం వద్ద గల హోల్‌సేల్ యార్డుకు చేరి అక్కడి నుంచి నగరంలోని రిటైల్ మార్కెట్‌కు చేరతాయి. ఈ హోల్‌సేల్ మార్కెట్ నుంచి రిటైల్ వర్తకులు చేపలను కొనుగోలు చేసిన ప్రధాన కూడళ్లలో విక్రయాలు చేస్తుంటారు.
ఉత్తరాంధ్ర చెరువు చేపలకు గిరాకీ
సాధారణంగా ఉభయగోదావరి జిల్లాల నుంచి నగరానికి వచ్చే చేపలు ఆయా ప్రాంతాల్లో చేపల చెరువుల నుంచి లభించినవి. ఈ చేపలను చెరువుల్లో మేతలు వేసి పెంపకం చేపడతారు. కాగా మన జిల్లాలోని మేహాద్రిగెడ్డ రిజర్వాయర్ డ్యామ్‌తో పాటు తగరపువలస, ఆనందపురం, దేవరాపల్లి, ఎస్.కోట ప్రాంతాల్లో గల చెరువులతో పాటు విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో గల చేపల చెరువుల్లో సహజసిద్ధంగా పెరిగిన చేపలకు నగరంలో మంచి గిరాకీ ఉంది. సహజసిద్ధంగా ఏడాది పాటు చెరువుల్లో పెరిగే ఈ ప్రాంతాల్లోని చేపలను వేసవిలో చెరువులు ఎండిన తరువాత మార్కెట్‌కు తరలిస్తుంటారు. దీంతో ఈ చేపలను ఒడిశా, బెంగాల్ ప్రాంతాలకు కూడా ఎగుమతి చేస్తారు. నగరంలోని బజారుల్లో కూడా ఉత్తరాంధ్ర జిల్లాల చేపలు లభిస్తుంటాయి.
చేపల ధర స్వల్పంగా పెరిగే అవకాశం
సముద్రంపై చేపల వేట నిషేధం మొదలైన నేపథ్యంలో చెరువు చేపల ధరలు కాస్త పెరగవచ్చని వర్తకులు చెబుతున్నారు. ప్రస్తుతం బజారులో లభించే బొచ్చు, శీలావతి, బంగారుపాప, జడ్డువ వంటి రకాల చేపలకు ఎక్కువగా డిమాండ్ ఉంది. చేపల సైజును బట్టి ధర ఉంటుంది. కిలో కంటే తక్కువ బరువు గల చేపలు ఒక ధర ఉంటే, ఒకటి రెండు కిలోల బరువు ఉన్న చేపలు మరొక ధర, అలాగే సుమారు 5 కిలోల బరువు ఉండే చేపల ధర కాస్త అధికంగా ఉంటుంది. మొత్తం మీద కిలో చేప ధర రూ.100 నుంచి రూ.130 వరకూ ధర పలుకుతుంది. కాగా చేపలకు గల డిమాండ్‌ను బట్టి ఈ ధర కూడా కాస్త పెరిగింది. చేపల్లో పోషక విలువలు అధికంగా ఉండడంతో మాంసాహార ప్రియులు కూడా ధర గురించి ఆలోచించకుండా కొనుగోలు చేస్తుంటారు.
Updated Date - 2021-04-19T04:52:32+05:30 IST