విజయసాయి పీఏనంటూ వైసీపీ నేతకే టోకరా
ABN, First Publish Date - 2021-12-07T07:57:30+05:30
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పీఏనంటూ ఆ పార్టీ నేతకే టోకరా ఇచ్చాడో వ్యక్తి. బాధితుడు సోమవారం స్పందన..
మోసం బయటపడటంతో ఆత్మహత్య బెదిరింపులు
‘స్పందన’లో గుంటూరు ఎస్పీకి బాధితుడి ఫిర్యాదు
గుంటూరు, డిసెంబరు 6: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పీఏనంటూ ఆ పార్టీ నేతకే టోకరా ఇచ్చాడో వ్యక్తి. బాధితుడు సోమవారం స్పందన కార్యక్రమంలో గుంటూరు అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పాతగుంటూరులోని లక్ష్మీనగర్‌కు చెందిన నాగం వెంకటమోహన్ వైసీపీ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ సంయుక్త కార్యదర్శి. గతేడాది జూలైలో విశాఖపట్నంలోని ఎంపీ విజయసాయిరెడ్డి కార్యాలయానికి వెళ్లగా, అక్కడ జి.నాగేంద్రబాబు అనే వ్యక్తి పరిచయమయ్యాడు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రోగ్రామర్‌గా కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటానని నాగేంద్రబాబు చెప్పడంతో మోహన్ అతని ఫోన్ నెంబరు తీసుకున్నారు. ‘బ్యాక్‌లాగ్ పోస్టులు ఇప్పిస్తా.. తెలిసిన వారు ఎవరైనా ఉంటే చెప్పండి’ అని నాగేంద్రబాబు ఆశ కల్పించడంతో ఉభయగోదావరి జిల్లాలకు చెందిన రమణ, మరో వ్యక్తికి ఆ ఉద్యోగాలు ఇప్పించాలని మోహన్ కోరారు. ఇందుకోసం మూడు విడతల్లో రూ.2లక్షలు నాగేంద్రబాబుకు ఇచ్చారు. తర్వాత ఉద్యోగం కోసం ఫోన్లు చేయగా ‘మీ విషయం కలెక్టర్‌తో మాట్లాడాలి.. త్వరలోనే పని అయిపోతుంది’ అంటూ కాలయాపన చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఆరు నెలలుగా ఫోన్ తీయకపోవడంతో మోహన్ విశాఖలోని విజయసాయిరెడ్డి కార్యాలయంలో ఆరా తీయగా ఆ పేరు కలిగిన వ్యక్తులు ఎవరూ లేరని సమాధానం వచ్చింది. అంతలోనే అతనికి నాగేంద్రబాబు ఫోన్ చేసి.. ‘నా గురించి ఆరా తీయాల్సిన అవసరం లేదు. నీ నుంచి తీసుకున్నది లక్షే. కొంచెం టైమ్ ఇస్తే ఆ మొత్తం ఇచ్చేస్తా. నా గురించి విచారించినా, ఫిర్యాదు చేసినా ఆత్మహత్య చేసుకుంటా’ అని బెదిరించాడు. నాగేంద్రబాబు ఫేస్‌బుక్, వాట్సప్ ఖాతాలకు ప్రొఫైల్ పిక్‌గా పోలీసు దుస్తులతో ఉన్న ఫొటో పెట్టుకున్నాడని కూడా ఎస్పీకి అందజేసిన ఫిర్యాదులో మోహన్ పేర్కొన్నారు.
Updated Date - 2021-12-07T07:57:30+05:30 IST