దళితులకు దగా!
ABN, First Publish Date - 2021-08-27T09:06:00+05:30
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ(ఏపీఐఐసీ) తీరుతో దళిత పారిశ్రామికవేత్తలు హడలిపోతున్నారు.
వీరపనేనిగూడెం పారిశ్రామిక పార్కులో కేటాయింపులు నిల్
దరఖాస్తు చేసుకున్నా ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే
స్థలం ధర 12 రెట్లు పెంచేసిన ఏపీఐఐసీ
ఎకరా రేటు రూ.కోటి వరకూ చెబుతోన్న అధికారులు
ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని దళిత పారిశ్రామికవేత్తల డిమాండ్
దళిత పారిశ్రామికవేత్తల ముప్పతిప్పలు
మౌలిక వసతులు అభివృద్ధి చేసిన స్థలాలిస్తాం... అంటూ ప్రభుత్వం ఊదరగొడుతోంది. మరోవైపు ఏపీఐఐసీ మాత్రం దళిత పారిశ్రామికవేత్తలను ముప్పతిప్పలు పెడుతోంది. వారికి కేటాయించిన స్థలాలను రిజిస్ట్రేషన్ చేయకుండా ఏళ్ల తరబడి కాలయాపన చేస్తోంది. పైగా గతంతో పోలిస్తే స్థలం ధరను అధికారులు ఏకంగా 12రెట్లు పెంచేశారు. చట్టప్రకారం తమకు దక్కాల్సిన కోటాను కూడా ఇవ్వకుండా ఏపీఐఐసీ కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని దళిత పారిశ్రామికవేత్తలు ఆరోపిస్తున్నారు.
(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ(ఏపీఐఐసీ) తీరుతో దళిత పారిశ్రామికవేత్తలు హడలిపోతున్నారు. ప్రతి పారిశ్రామిక పార్కులో ఎస్సీ, ఎస్టీలకు చట్టప్రకారం ఇవ్వాల్సిన స్థలాలను కూడా కేటాయించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కృష్ణాజిల్లా వీరపనేనిగూడెంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేశారు. తెలంగాణలో స్థిరపడిన ఏపీ పారిశ్రామికవేత్తలకు ఇందులో స్థలాలు కేటాయించారు. మొత్తం 75 ఎకరాల్లో పరిశ్రమలు పెట్టేందుకు పలువురికి స్థలం ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తలకు చట్టప్రకారం 17 ప్లాట్లు కేటాయించారు. అయితే ఏళ్ల తరబడి వారికి ఆ స్థలాలను మాత్రం ఇవ్వడం లేదు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ(ఏపీఐఐసీ) అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని, కొందరు అధికారులు దళితులపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వీరపనేనిగూడెంలో ఇంజనీరింగ్ క్లస్టర్ పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు 2016లో నిర్ణయించారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో పెట్టుబడులు పెట్టాలన్న ఉద్దేశంతో తెలంగాణలో స్థిరపడిన ఏపీ పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి దీనిపై మాట్లాడారు. సానుకూలంగా స్పందించిన ఆయన ఏపీఐఐసీతో మాట్లాడి వీరపనేనిగూడెంలో వారికి స్థలాలు ఇవ్వాలని సూచించారు.
పారిశ్రామిక పార్కులో ఏపీఐఐసీ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసిన తర్వాత అందరికీ స్థలాలు కేటాయించారు. పారిశ్రామికవేత్తలు డబ్బు చెల్లించి రిజిస్ర్టేషన్లు కూడా చేసుకున్నారు. కొన్ని పరిశ్రమలు కూడా ఏర్పాటయ్యాయి. ఈ స్థలాల్లో దళితులకు చట్టప్రకారం రావాల్సిన వాటాను కేటాయించాలని కొందరు నాటి టీడీపీ ప్రభుత్వాన్ని కోరారు. ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు 7శాతం స్థలాలను ఇవ్వాలని 2019 ఏప్రిల్‌లోనే నిర్ణయించారు. ఆ తర్వాత ఎన్నికలు జరిగి రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. వైసీపీ అధికారం చేపట్టి రెండేళ్లు దాటినా ఇప్పటికీ ఆ నిర్ణయం మాత్రం అమలు కాలేదని దళిత పారిశ్రామికవేత్తలు ఆరోపిస్తున్నారు.
స్థలం ధర భారీగా పెంపు
పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినవారిని ప్రోత్సహించేందుకు, యువతకు ఉద్యోగ కల్పనకు ఉపకరిస్తుందన్న ఉద్దేశంతో గత ప్రభుత్వంలో తక్కువ ధరకే స్థలాలను కేటాయించారు. ఎకరం రూ.8 లక్షల చొప్పున పారిశ్రామికవేత్తలకు ఇచ్చారు. అత్యధికులకు అరెకరం, ముప్పావు ఎకరం చొప్పున కేటాయించారు. మౌలిక సదుపాయాల కల్పనకు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆ పార్కులోనే దళితులకు వారి కోటా ప్రకారం స్థలాలు ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు వాటి కోసం అడిగితే ఎకరా ధర సుమారు రూ.కోటి వరకూ పెంచేసి, ఆ మేరకు కట్టాలని ఏపీఐఐసీ అధికారులు అంటున్నట్లు సమాచారం. అప్పటికి, ఇప్పటికి ఏకంగా 12రెట్లు ధర పెంచడమేంటని దళిత పారిశ్రామికవేత్తలు వాపోతున్నారు. ఏపీఐఐసీ అధికారుల నిర్వాకంపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.
Updated Date - 2021-08-27T09:06:00+05:30 IST