పోయే ఉద్యోగాలకు శిక్షణ..!
ABN, First Publish Date - 2021-07-11T09:07:10+05:30
ఎప్పుడో ఉద్యోగంలోకి తీసుకున్నారు. అప్పటి నుంచీ వారితో పని చేయించుకుంటున్నారు. కానీ వారు శిక్షణ లేకుండా పనిచేస్తున్నారనే విషయం అధికారులకు ఇప్పుడు అకస్మాత్తుగా గుర్తుకొచ్చింది
మద్యం షాపుల ఉద్యోగుల శిక్షణకు టెండర్
విధుల్లోకి తీసుకుని ఇప్పటికే రెండేళ్లు
‘దశల వారీ మద్య నిషేధం’లో కొందరి తొలగింపు
ఉన్నవారి కొలువులకు రెండేళ్ల గ్యారెంటీ లేదు
అయినా శిక్షణకు ఏపీఎ్‌సబీసీఎల్ నిర్ణయం
ఏం తెలియకుండానే ఇప్పటిదాకా పనిచేశారా?
నిధుల దుర్వినియోగానికే ‘శిక్షణ’ అని ఆరోపణలు
‘దశలవారీగా మద్య నిషేధం’ ఎన్నికల హామీలో భాగంగా వైసీపీ సర్కారు 500కు పైగా మద్యం షాపులను ఎత్తివేసింది. దీంతో దాదాపు 1700 మంది ఉద్యోగాలు కోల్పోయారు. మరో ఆర్నెల్లలో మరికొన్ని షాపులు తొలగించనుంది. అంటే మరికొంత మంది కూడా ఉద్యోగాలు కోల్పోతారు. సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తే అందరి ఉద్యోగాలూ పోతాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం అమ్మకాల కోసం రెండేళ్ల క్రితం చేరిన ఉద్యోగులకు.. మరో రెండేళ్లు కూడా ఉంటాయని గ్యారెంటీ లేని ఉద్యోగాలకు.. ఇప్పుడు శిక్షణ ఇప్పిస్తారట! ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
(అమరావతి, ఆంధ్రజ్యోతి)
ఎప్పుడో ఉద్యోగంలోకి తీసుకున్నారు. అప్పటి నుంచీ వారితో పని చేయించుకుంటున్నారు. కానీ వారు శిక్షణ లేకుండా పనిచేస్తున్నారనే విషయం అధికారులకు ఇప్పుడు అకస్మాత్తుగా గుర్తుకొచ్చింది. ఉద్యోగంలో చేరి దాదాపు రెండేళ్లు అవుతున్న సమయంలో ఇప్పుడు వారికి శిక్షణ ఇప్పించాలనే విచిత్రమైన నిర్ణయం తీసుకున్నారు. పోనీ ఇప్పుడైనా శిక్షణ ఇప్పిస్తే భవిష్యత్తులో బాగా పనిచేస్తారు కదా అని అనుకున్నా... మరో రెండేళ్లు అయినా వారు విధుల్లో ఉంటారన్న గ్యారెంటీ లేదు. అయినా వారందరికీ ఇప్పుడు శిక్షణ ఇప్పించాలని నిర్ణయం తీసుకున్నారు. శిక్షణ పొందాల్సిన వారు మద్యం షాపుల్లో పనిచేసే సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్ కాగా... శిక్షణ ఇప్పించాలని నిర్ణయం తీసుకున్నది ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ (ఏపీఎ్‌సబీసీఎల్). 2019 నవంబరులో ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం షాపులు ప్రారంభమయ్యాయి. అప్పట్లో 3500 మద్యం షాపుల్లో పనిచేసేందుకు సుమారు 12 వేల మంది ఉద్యోగులను ఏపీఎ్‌సబీసీఎల్ విధుల్లోకి తీసుకుంది. నవంబరులో షాపులు ప్రారంభమైతే నెల ముందుగానే వారిని తీసుకుంది. అప్పట్లో ఎక్సైజ్ అధికారులే మద్యం డిపోల్లో వారికి మూడు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. అప్పటి నుంచి వారంతా షాపుల్లో పనిచేస్తున్నారు. మద్యం సరుకు దిగుమతి, అమ్మకాలు, క్యాష్ బుక్ నిర్వహణ, బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం, వాటిని కంప్యూటరైజ్ చేయడం వంటి అన్ని పనులూ చేస్తున్నారు. కాగా వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలోని హామీ ప్రకారం దశలవారీ మద్య నిషేధంలో భాగంగా రెండుసార్లుగా 500కు పైగా షాపులు ఎత్తివేయడంతో వాటిలో పనిచేసిన దాదాపు 1700 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రస్తుతం మిగిలిన 2934 షాపుల్లో 2934 మంది సూపర్‌వైజర్లు, 7324 మంది సేల్స్‌మెన్ పనిచేస్తున్నారు. మద్యం షాపుల పూర్తి బాధ్యతను వారే తీసుకుంటున్నారు.
ప్రభుత్వ విధాన నిర్ణయం ప్రకారం మరో ఆరు నెలల్లో మరికొన్ని షాపులు తొలగించాల్సి ఉంది. అంటే అప్పుడు కొంత మంది ఉద్యోగాలు కోల్పోతారు. అనంతరం మరికొంతకాలానికి ప్రభుత్వం సంపూర్ణ మద్యనిషేధానికి వెళ్లాల్సి ఉంది. అప్పుడు మొత్తం షాపుల్లో పనిచేసేవారంతా ఉద్యోగాలు వదులుకోవాల్సిందే. ఈ దశలో వారికి శిక్షణ ఇప్పించాలని ఏపీఎ్‌సబీసీఎల్ నిర్ణయించడం గమనార్హం. మద్యం షాపుల్లో పనిచేస్తున్న వారందరికీ శిక్షణ ఇచ్చేందుకు కంపెనీలు ముందుకు రావాలంటూ తాజాగా టెండర్ నోటిఫికేషన్ కూడా జారీచేసింది. ఉద్యోగులకు బేసిక్ డొమైన్ నాలెడ్జ్, ఐటీ స్కిల్స్, అకౌంట్ బుక్స్ నిర్వహణ, ఫైనాన్సియల్ మేనేజ్‌మెంట్, వినియోగదారులతో ఎలా వ్యవహరించాలి, అమ్మకాలు పెంచే నైపుణ్యం, సాఫ్ట్ స్కిల్స్, ఎక్సైజ్ చట్టాలపై అవగాహన వంటి 12 అంశాలపై శిక్షణ ఇచ్చే సంస్థ కావాలని టెండర్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఒక్కో ఉద్యోగికి మూడు రోజుల పాటు శిక్షణ ఇవ్వాలని, మద్యం షాపుల విధులకు ఇబ్బంది లేకుండా బ్యాచ్‌లుగా నిర్ణయించి వేర్వేరుగా శిక్షణ ఇవ్వాలని తెలిపింది. ఇంతకాలం తర్వాత గ్యారెంటీ లేని ఉద్యోగాలకు ఇప్పుడు శిక్షణ ఇప్పించాలన్న నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. కావాల్సిన వారికి టెండర్ కట్టబెట్టి ఆర్థిక లబ్ధి చేకూర్చేందుకే ఇప్పుడు శిక్షణ అంశాన్ని తెరపైకి తెచ్చారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఏపీఎ్‌సబీసీఎల్ మొదట వీరందరినీ నేరుగా విధుల్లోకి తీసుకోగా, అనంతరం కొద్దికాలానికి రెడ్డి ఎంటర్‌ప్రైజెస్ అనే అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీని తెచ్చారు. ఇప్పటికే దానిపై తీవ్ర విమర్శలు వస్తుండగా.. మళ్లీ కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసేలా శిక్షణ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు.
Updated Date - 2021-07-11T09:07:10+05:30 IST